అందరూ అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అయితే అదెలా అనే విషయంలోనే తడబడుతుంటారు. కొందరు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. డబ్బు, హోదాలతో పనిలేకుండా కష్టాన్నే నమ్ముకుంటూ సాగుతూ కనీవినీ ఎరుగని విధంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే యూకేకు చెందిన కేథరీన్ టాన్-గిల్లెస్పీ. ఇవాళ ఆమె అమెరికా కేఎఫ్‌సీ వ్యాపార సంస్థలకు అధ్యక్షురాలు. ఆమె ఈ స్థాయికి ఎలా చేరుకుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడం ఖాయం. మరి ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!.
ఆ మహిళే బ్రిటన్‌కి చెందిన కేథరీన్ టాన్-గిల్లెస్పీ. ఆమె తన 13వ ఏట నుంచే ఉద్యోగ కెరీర్‌ని ప్రారంభించింది. ఈ 52 ఏళ్ల మహిళ మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. ఆమె తల్లి నర్సుగా పనిచేస్తుండగా, తండ్రి బీబీసీలో లైటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తుండేవారు. దాంతో ఆమె చిన్న వయసులోనే బ్రిటిష్ రెస్టారెంట్ చైన్ బీఫీటర్‌లో గిన్నెల కడుగుతూ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది.
అలా ఆమె గంటకు రూ. 152 రూలు ఆర్జించేది. అది నేటి కరెన్సీ విలువ ప్రకారం రూ. 500లకు సమానం. ఆ తర్వాత ఐస్ క్రీమ్ మెషీన్ వద్దకు మారింది. రెస్టారెంట్‌లో ఉండే వేగవంతమైన పని ఆమెకు ఎంతగానో నచ్చింది. ఆమె సెకండరీ స్కూల్ చదువుతున్నప్పుడే రెస్టారెంట్ చైన్‌లో పనిచేయడం ప్రారంభించింది. చివరికి అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి చేరుకుంది. అంతేగాదు రెస్టారెంట్‌లో టీం వర్క్, ఒత్తిడి, వేగం, పని, మంచి క్రమశిక్షణను నేర్పిస్తాయని అంటోందామె. ఇందులో సక్సెస్ కావాలంటే మాత్రం కస్టమర్లను సంతృప్తి పరిచే టాలెంట్ కూడా స్వతహాగా ఉండాలని అంటోంది.
ఆ తర్వాత ఆమె ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలో వ్యాపార శాస్త్రం అభ్యసించింది. ఆ తర్వాత 1996లో ఆ కోర్సులో పట్టభద్రురాలైన వెంటనే మార్కెటరంగంలోకి ప్రవేశించి HP, ఫ్రిటో-లే, సోనీ పిక్చర్స్ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు. వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ వ్యాపార వినూత్న విధానం నుంచి ప్రేరణ పొందిన టాన్ అదే మార్గాన్ని అనుసరించాలని భావించింది. పనిప్రదేశ సంస్కృతికి తన ఎదుగుదలను పరిమితం చేయాలనుకోలేదు. అందుకే కంపెనీని విడిచిపెట్టి KFC సౌత్ పసిఫిక్‌కు వచ్చింది.
అక్కడ ఆమె ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మార్కెటింగ్‌ను పర్యవేక్షించారు. 2017లో, ఆమె ఆ కంపెనీకి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయ్యారు. ఆమె 2024లో KFC కెనడా బాధ్యతలు స్వీకరించి, ఏప్రిల్ 2025లో KFC US అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పెరుగుతున్న పోటీ, మారుతున్న అభిరుచులను అంచనావేస్తూ.. వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందామె. తను ఎప్పుడు డబ్బు, హోదాల వెంట పరిగెట్టనని, ఎదగడానికి, నేర్చుకోవడానికే సదా ప్రయత్నిస్తుంటానని అన్నారామె.
వృత్తి నిపుణులు అధిక ఒత్తిడికి లోనుకాకుండా సవాళ్లను స్వీకరించాలని అదే తన సక్సెస్ మంత్ర అని చెబుతోందామె. అలాగే యువతను సదా తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పేందుకు, అలాగే కోరుకున్న అవకాశాలను వెతుక్కోవడానికి సన్నద్ధత చూపించాలని చెబుతోందామె. అంతేగాదు ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడూ..అతి చెత్తగా ఏం జరగగలదో అంచనా వేయాలని సూచిస్తోంది కేథరీన్ టాన్-గిల్లెస్పీ.
ఇదీ చదవండి: ఆ అత్తమ్మ ప్రేమకు.. కోమానే జయించింది ఆ కోడలు!


