ఆ అత్తమ్మ ప్రేమకు.. కోమానే జయించింది ఆ కోడలు! | Chinese Womans 17 Years Of Care Helps Daughter-In-Law Recover | Sakshi
Sakshi News home page

ఆ అత్తమ్మ ప్రేమకు.. కోమానే జయించింది ఆ కోడలు!

Oct 25 2026 2:09 PM | Updated on Oct 25 2026 3:14 PM

Chinese Womans 17 Years Of Care Helps Daughter-In-Law Recover

అత్తా కోడళ్లు అనగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి ఆ ఇద్దరి సంబంధబాంధవ్యాలు. కానీ కొందరు అత్తలు అమ్మనే మరిపించేలా కోడలికి ప్రేమను అందించే వాళ్లు కూడా ఉన్నారు. అంతేగాదు కోడలకు అన్నివిధాల కొండంత అండగా నిలబడుతుంటారు. ఇవాళ అత్తల దినోత్సవం నేపథ్యంలో కోమాలో ఉన్న కోడలిని కంటికిరెప్పలా సాకి, కోలుకునేలా చేసిన ఓ అత్తమ్మ కథ గురించి తెలుసుకుందామా.

చైనాలో 68 ఏళ్ల జువాన్ ఫెంగింగ్ అనే మహిళ కోమాలో ఉన్న తన కోడలిని కన్న కూతురిలా సాకింది. బెడ్‌కే పరిమితమై ఉంటే అన్ని సపర్యలు చేసింది. ఆమె కోడలు క్సూ పెళ్లైన నెలకే ట్రక్కు ఢీకొని మెదడు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లిపోయింది. శారీరక సవాళ్లు, నిరంతర సంరక్షణ తదితరాలు అవసరమైనా..వెనక్కి తగ్గకుండా ఆ అత్త ఆ కోడలికి అన్ని విధాల మద్దతిస్తూ కంటికి రెప్పలా చూసుకుంది ఆమెను. 

2009లో ప్రమాదం జరగగా అప్పటి నుంచి క్సూ కోమాలోనే ఉంది. కానీ ఫెంగింగ్‌ ఆమెను తన సొంతకూతురిలా చూసుకుంది. ఆమె సంరక్షణ బాధ్యతలన్నీ ఆమెనే స్వయంగా చూసుకుంది. తన కొడుకుని పెళ్లి చూసుకున్నంత మాత్రన ఆమెను వదిలిపెట్టలేనని చెబుతుండటం విశేషం. ఆమె తమ కుటుంబంలో భాగమయ్యాక, సొంత బిడ్డగానే భావించానని చెబుతోంది ఫెంగింగ్‌. మల మూత్రాదుల దగ్గర నుంచి మంచానికే పరిమితమవ్వడంతో శరీరం పుండ్లు పడకుండా చూసుకోవడం వరకు అన్నింటిని చాలా ఓపికతో చేసేది. ఆ అత్తమ్మ సపర్యలకు కోడలు క్సూ కోలుకుని స్పృహలోకి వచ్చింది. 

అయితే ప్రమాదం వల్ల బ్రెయిన్‌కి అయిన నష్టం కారణంగా గ్రహణశక్తి కోల్పోయి నాలుగేళ్ల చిన్నారిలా మారిపోయింది ఆమె ప్రవర్తన. అయినప్పటికీ..నడక నేర్పుస్తూ..వ్యాయామాలు చేయిస్తోంది. నెమ్మదిగా మాట్లాడేలా చేస్తోంది. అంతేగాదు చిన్నచిన్నగా వంటలు కూడా చేస్తోంది. ఆ అత్త చేసిన సేవలకు తగినట్లుగానే కోడలు క్సూలో మెరుగుదల కనిపించడం విశేషం. అయితే ఫెంగింగ్‌ మాత్రం ఆమె ఇంకా పూర్తిస్థాయిలో మెరుగుపడాలని ఆశిస్తోంది. 

ఎందుకంటే రేపు తను లేకపోయినా..ఆమె తను తినడానికి ఏదో ఒకటి వండుకోగలుగుతుంది కదా అని అంటోంది. అంతేగాదు ఒకవేళ తను చనిపోయినా..క్సూ బాధ్యతను కుమారుడిని నిర్వర్తించమని కోరడం విశేషం. కానీ కోడలు కోలుకోవడం కోసం ఆ అత్త ఫెంగింగ్‌  ఏ ఐదో, పదో ఏళ్లు కాదు..ఏకంగా 17 ఏళ్ల పాటు నిరంతరాయంగా సపర్యలు చేసింది ఈ అత్త. అంత గొప్ప మనసున్న అత్తను పొందిన ఆ కోడలు నిజంగా అదృష్టవంతురాలు కదా..!.

ఇదీ చదవండి: నేడు ‘అత్తల దినోత్సవం’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement