సమాజంలో ఎన్నో బంధాలుంటాయి. కానీ అత్త – కోడలు బంధం మాత్రం చాలా ప్రత్యేకం. రక్తసంబంధం కాకపోయినా, మనసుతో ముడిపడిన బంధం ఇది. ఒక తల్లి తన కూతురిని మరో ఇంటికి పంపిస్తే, ఆ ఇంట్లో మరో తల్లి ఆమెను కూతురిగా స్వీకరిస్తుంది. ఇక్కడే అత్తాకోడళ్ల మధ్య అసలైన ప్రేమ, అనుబంధాలు మొదలవుతాయి.
నిజామాబాద్: టీవీ సీరియల్స్, సినిమాల్లో చూపించినట్టు అత్తా–కోడళ్లంటే గొడవలు, కుట్రలు, కన్నీళ్లు మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఆ ఇల్లే స్వర్గమవుతుందని నిరూపిస్తున్న వారు ఎందరో.. ఒకప్పుడు ‘అత్తను చూస్తే కోడలికి, కోడలిని చూస్తే అత్తకు గిట్టదు‘ అనే మాట ఇప్పుడు పాతదైపోయింది. నేటి అత్తలు కోడలిని కూతురిగా ఆదరిస్తున్నారు.. నేటి కోడళ్లు అత్తను కన్నతల్లిగా ఆరాధిస్తున్నారు. అత్తల దినోత్సవం సందర్భంగా అత్తాకోడళ్ల అనుబంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ అత్తల దినోత్సవం రోజున ఒక్కసారి... ప్రతి కోడలు తన అత్తకు ‘అమ్మా‘ అని ప్రేమగా పిలిచి, ప్రతి అత్త తన కోడలిని ‘నా కూతురు‘ అని గర్వంగా చెప్పుకుంటే.. ఆ ఆనందమే వేరు.
ఇప్పటి అత్తలు మారారు. ఉద్యోగం చేసే కోడలిని ‘ఇంటి పని చేయలేదు‘ అని నిందించడం లేదు. పైగా ‘అలసిపోయావ్, కాసేపు విశ్రాంతి తీసుకో‘ అంటూ కూతురిలా లాలిస్తున్నారు. కోడలి పుట్టినరోజును కూతురి పుట్టినరోజులా ఘనంగా జరుపుతున్న అత్తలు ఎందరో. తన చీరలనే కోడలికి ఇచ్చి మురిసిపోతున్న అత్తలు సమాజంలో ఎందరో ఉన్నారు. ‘నా కూతురు తన అత్తగారింట్లో సంతోషంగా ఉండాలని నేను ఎలా కోరుకుంటానో, నా కోడలు కూడా నా ఇంట్లో అలాగే సంతోషంగా ఉండాలి‘ అని చెప్పే అత్తలే ఆదర్శం.

ఇద్దరూ అర్థం చేసుకోవాలి
‘కోడలు వచ్చేది కోడలిగా కాదు, కూ తురిగా. అత్త ఉండేది అత్తగా కాదు, తల్లిగా. ఈ ఇద్దరూ అర్థం చేసుకుంటే ఆ కుటుంబంలో గొడవలకు చోటే ఉండదు. ‘మాది ఉమ్మడి కుటుంబం.. మా అత్తమ్మ క్రమశిక్షణ కారణంగా నేటికీ మా ఇంట్లో గొడవలు అనేవి లేకుండా కలిసి మెలిసి ఉంటున్నాం. ఇద్దరు కోడళ్లను తన కూతురుతో సమానంగా చూడటమే అందుకు కారణం. టీవీ సీరియల్స్ ప్రభావం మా కుటుంబంపై ఉండదు.
– కోడళ్లు స్రవంతి, దివ్యతో అత్త దుమాని గంగామణి, ఆర్మూర్

తల్లితో సమానంగా చూసుకుంటుంది
నాకు(సునీత) మా బావతో 30 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. మేన కోడలిని కావడంతో నన్ను మా అత్తమ్మ తన కడుపులో పుట్టిన బిడ్డలా చూసుకుంటోంది. 15 ఏళ్ల క్రితం మా మరిదికి డాక్టర్ రేణుకతో పెళ్లయ్యింది. నాతో సమానంగా చిన్న కోడలిని సైతం బిడ్డలా చూసుకోవడం ఆమె గొప్పతనం. బంధువులు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
– కోడళ్లు సునీత, రేణుకతో అత్త జక్కుల రాజుబాయి, ఆర్మూర్

మా అత్తమ్మ ప్రేమతో..
మా అత్తమ్మ ప్రే మ కారణంగా నేటికీ మాది ఉమ్మడి కుటుంబంగా ఉంది. మాతో పాటు మా పిల్లలను సైతం తన కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. తోటి కోడళ్లమైన మా మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా మా అత్తమ చూపే ప్రేమ కారణంగానే పట్టించుకోకుండా కలిసి పోతాం. మాతోపాటు మా పిల్లల బాధ్యతను సైతం ప్రేమగా చూసుకోవడం ఆమెలోని గొప్పతనం.
– కోడళ్లు లాస్య, సంఘవితో అత్త కొక్కెర సత్తమ్మ, ఆర్మూర్
అత్తల్లో ముత్యం లలిత
డొంకేశ్వర్(ఆర్మూర్): అత్త అంటే ఆంక్షలు విధించే వ్యక్తి కాదు... అమ్మలా ప్రేమను పంచే రూపమని నిరూపిస్తున్నారు డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన ముత్యం లలిత. లలిత తన ఇద్దరు కోడళ్లు భాగ్యలక్ష్మి, వకులను సొంత కూతుళ్లలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు కోడళ్లు లెక్చరర్లుగా ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండటంతో, లలితే ఇంటి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మనవళ్లు, మనవరాళ్లను ఎంతో ప్రేమగా, దగ్గరుండి చూసుకుంటున్నారు. మనస్పర్థలకు తావులేకుండా అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త అర్థం చెబుతూ లలిత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
– కోడళ్లు భాగ్యలక్ష్మి, వకులతో అత్త లలిత
అమ్మ తరువాత అమ్మ
కోడళ్లు కూడా అత్తను అత్తగా కాకుండా అమ్మలా చూస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న అత్తకు తల్లిలా సేవ చేస్తూ, ఆఫీసు నుంచి వస్తూనే అత్తకు ఇష్టమైన టీ పెట్టి ఇస్తున్న కోడళ్లు, పండగలప్పుడు తన తల్లికే కాకుండా అ త్తకు కూడా చీర కొంటున్న కోడళ్లు.. ఈ బంధం ఎంత గొప్పదో చెబుతున్నారు. ‘అమ్మ తర్వాత అమ్మే అత్త. నా భర్తను ఇంత మంచి వ్యక్తిగా పెంచిన ఆమెకు సేవ చేయడం నా అదృష్టం‘ అంటున్న కోడళ్ల మాటలు ఈ బంధానికి ఉన్న గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటే, చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడకపోతే ఆ ఇల్లు నిత్యం దీపావళే.


