లడఖ్: లడఖ్‌లో జరుగుతున్న అన్యాయాలపై తాను గళం ఎత్తుతున్నందుకే ప్రభుత్వం, దాని మీడియా యంత్రాంగం తనను, తన సంస్థ ‘హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్’ (హెచ్‌ఐఏఎల్) భూమి లీజు వివాదాన్ని అడ్డుపెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోపించారు. లీజు గడువు ముగిసిందంటూ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ‘సందేశాన్ని స్వీకరించండి, రాయబారిని చంపకండి’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
హెచ్‌ఐఏఎల్ సంస్థకు కేటాయించిన భూమి లీజు గడువు 2019 మే 5 నాడే ముగిసిందని, సంస్థ సరైన సమయానికి లీజు డీడ్ పూర్తి చేయకపోవడం, రుసుములు చెల్లించకపోవడం వల్ల ఆ కేటాయింపు చట్టపరంగా రద్దయిందని లడఖ్ యంత్రాంగం జమ్మూ కశ్మీర్, లడఖ్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
ఈ వాదనపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా స్పందిస్తూ, లడఖ్ యంత్రాంగం తీరు అధికారిక అసమర్థతకు పరాకాష్ట అని విమర్శించారు. లీజు పాలసీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని అధికారులే గతంలో లిఖితపూర్వకంగా తెలిపారని, తాము పలుమార్లు దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారుల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగిందని, ఇప్పుడు ఆ నెపాన్ని తమపై నెట్టడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్


