రైలులో చోరీ ఘటన కలకలం రేపింది. ఎవరో ఆగంతకులు తనను తోసేసి తన బంగారు నగలు, పాస్‌పోర్ట్ దొంగిలించారని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె వెల్లడించారు. రైలులో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ రైల్వే అధికారులను నిలదీశారు. చోరీ ఘటనకు వెంటనే బాధ్యత రైల్వే శాఖను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శృతి అనే మహిళ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలను పోస్టు చేశారు. రైలు నంబర్ 13071 (హౌరా–జమాల్‌పూర్ ఎక్స్‌ప్రెస్)లోని ఏ1 కోచ్, 51వ నంబర్ సీటులో ప్రయాణిస్తున్న సమయంలో తనను ఎవరో తోసివేశారని, కిందపడటంతో గాయాలయ్యాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో తన బంగారు ఆభరణాలు, పాస్‌పోర్ట్ కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు.
ఏసీ కోచ్‌లలోనే ప్రయాణికులకు భద్రత లేకపోతే అధిక ధరలు చెల్లించి టికెట్లు ఎందుకు కొనాలని ఆమె ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో ఫిర్యాదు చేసేందుకు రైల్వే అధికారి కూడా అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అదే రైలులోని మరో కోచ్‌లోనూ ఇలాంటి ఘటన జరిగినట్లు ఆమె ప్రస్తావించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే సేవ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ ఈ ఘటనపై బాధ్యత తీసుకుని అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటన సోషల్ మీడియా వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందనలను రేకెత్తించింది. చాలా మంది భారతీయ రైళ్లలో ప్రయాణికుల భద్రత, సేఫ్టీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ఈ పోస్టుపై రైల్వే అధికారిక ఫిర్యాదుల ఖాతా ‘రైల్వే సేవ’ స్పందించింది. ప్రయాణ వివరాలు, పీఎన్‌ఆర్ లేదా యూటీఎస్ నంబర్, మొబైల్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని సూచించింది. అలాగే రైల్ మదద్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని లేదా 139 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని తెలిపింది.
తదనంతరం శృతి ఫిర్యాదు రైల్ మదద్‌లో నమోదైనట్లు, ఫిర్యాదు నంబర్‌ను ఎస్‌ఎంఎస్ ద్వారా పంపినట్లు రైల్వే సేవ వెల్లడించింది. ఈ విషయాన్ని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కూడా తెలిపింది.
ఇదీ చదవండి: రైల్వే టికెట్ రిజర్వేషన్‌లో కీలక మార్పులు రాబోతున్నాయా?
I was deliberately pushed and robbed of gold jewellery & my passport aboard Train 13071 Coach A1 Seat 51 near Sahibganj, fell & injured. Request urgent investigation & accountability. @RailMinIndia @RailwaySeva https://t.co/9cqSJve1Qf
— shruti (@furrymomneds) November 13, 2026


