హమ్మయ్య.. సమస్య క్లియర్‌ అయింది! | Microsoft Outage Outlook Teams Microsoft 365 Fully Restored | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. సమస్య క్లియర్‌ అయింది!

Nov 14 2026 1:53 PM | Updated on Nov 14 2026 2:05 PM

Microsoft Outage Outlook Teams Microsoft 365 Fully Restored

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మైక్రోసాఫ్ట్‌ సేవల అంతరాయానికి ఎట్టకేలకు తెరపడింది. రెండు రోజుల పాటు స్తంభించిపోయిన ఔట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, మైక్రోసాఫ్ట్‌ 365తో పాటు ఇతర అనుబంధ క్లౌడ్‌ ఆధారిత సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. నవంబర్‌ 12న ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగిన ఈ సాంకేతిక సమస్య కారణంగా అంతర్జాతీయంగా కార్యాలయ కార్యకలాపాలు, ఈ-మెయిల్‌ కమ్యూనికేషన్‌, వర్చువల్‌ సమావేశాలు, వ్యాపార లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది.

అమెరికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా విస్తరించి..

తొలుత అమెరికా ప్రాంతంలో ప్రారంభమైన ఈ కనెక్టివిటీ సమస్యలు క్రమంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వినియోగదారులకూ విస్తరించాయి. ముఖ్యంగా సంస్థల రోజువారీ అధికారిక సమాచార మార్పిడికి కీలకంగా ఉన్న ఔట్‌లుక్‌ ఈ-మెయిల్‌ సేవలు, టీమ్స్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ నిలిచిపోవడంతో ఉద్యోగులు, వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా నవంబర్‌ 14న విడుదల చేసిన ప్రకటనలో సమస్యకు మూలకారణమైన అంతర్గత సాంకేతిక లోపాన్ని పూర్తిగా సరిదిద్దామని, ప్రభావితమైన అన్ని ప్రాంతాల్లో సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌లో లోపమే కారణం

ఈ అంతరాయంపై మైక్రోసాఫ్ట్‌ చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు గతంలో చేపట్టిన ఒక అప్‌గ్రేడ్‌లో తలెత్తిన అంతర్గత లోపం, ఇటీవల చేసిన మరో నెట్‌వర్క్‌ మార్పు ఇందుకు కారణం. దీనివల్ల కొన్ని సర్వర్లు పనిచేయడం నిలిపివేయగా ఆ భారం మిగిలిన సర్వర్లపై పడింది. ఫలితంగా పలు ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరిగి వినియోగదారులకు సేవలు నిలిచిపోయాయి. అయితే, వినియోగదారుల రద్దీ ఒక్కసారిగా పెరగడం వల్ల గానీ, సైబర్‌ దాడి, హ్యాకింగ్‌ లేదా ఏఐ టూల్స్‌ ప్రమేయంతో గానీ ఈ సమస్య తలెత్తలేదని, ఇది పూర్తిగా అంతర్గత సాంకేతిక లోపమేనని సంస్థ స్పష్టం చేసింది.

దశలవారీగా పునరుద్ధరణ

సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం మైక్రోసాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ బృందానికి పెను సవాలుగా మారింది. తొలుత పునరుద్ధరించిన కొన్ని సర్వర్లపైకి వినియోగదారుల ట్రాఫిక్‌ను మళ్లించగానే అవి మళ్లీ స్పందించడం మానేశాయి. దీంతో ఒకేసారి మొత్తం ట్రాఫిక్‌ను అనుమతించకుండా సర్వర్ల సామర్థ్యాన్ని పెంచుతూ ప్రతి దశలోనూ వ్యవస్థల స్థిరత్వాన్ని పరీక్షిస్తూ అత్యంత జాగ్రత్తగా సేవలను పునరుద్ధరించాల్సి వచ్చింది. ఇందుకు ఎక్కువ సమయం పట్టినప్పటికీ మళ్లీ అంతరాయాలు తలెత్తకుండా నిరోధించడానికి ఈ వ్యూహం దోహదపడిందని మైక్రోసాఫ్ట్‌ వివరించింది.

ఇండిగో స్పందన

ఈ సాంకేతిక సమస్య ప్రభావం భారత్‌లోని కార్పొరేట్‌ రంగంతో పాటు విమానయాన సేవలపైనా పడింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తమ ఈ-మెయిల్‌ కస్టమర్‌ సపోర్ట్‌ ఛానల్‌కు ఆటంకం కలిగిందని, ప్రయాణికుల నుంచి ఈ-మెయిల్స్‌ స్వీకరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ సపోర్ట్‌ మార్గాల ద్వారా సేవలు కొనసాగించినట్లు పేర్కొంది. మరోవైపు, సేవల పునరుద్ధరణపై మైక్రోసాఫ్ట్‌ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్‌ చందోక్‌ స్పందిస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక బృందాలు అవిశ్రాంతంగా శ్రమించి సేవలను తిరిగి పట్టాలెక్కించాయని తెలిపారు.

మైక్రోసాఫ్ట్‌ క్షమాపణ

అంతరాయం వల్ల ఇబ్బందులు పడిన వినియోగదారులు, వ్యాపార భాగస్వాములకు మైక్రోసాఫ్ట్‌ బహిరంగ క్షమాపణలు తెలిపింది. వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా పరిగణిస్తున్నామని పేర్కొంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి లోపానికి గల కారణాలు, పరిష్కార చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోనున్న జాగ్రత్తలతో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మందికి పైగా వినియోగదారులు మైక్రోసాఫ్ట్‌ 365 సేవలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో కంపెనీ మౌలిక సదుపాయాల్లో తలెత్తే చిన్నపాటి సాంకేతిక లోపం అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలను ఏ స్థాయిలో స్తంభింపజేయగలదో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఏడాది తిరగకముందే బిజినెస్‌ మూసివేత.. కట్‌ చేస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement