జైలు అంటే కేవలం చేసిన తప్పులకు శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు.. పశ్చాత్తాపంతో తమను తాము సంస్కరించుకుని, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు సిద్ధమయ్యే పరివర్తన కేంద్రంగా మారాలి. నేరచరిత్ర అనే మచ్చను చెరిపేసుకుని శిక్షాకాలం ముగిసిన తర్వాత ఖైదీలు తిరిగి జన జీవనంలో కలవడానికి సరైన ఉపాధి మార్గాలు అత్యవసరం. ఈ లక్ష్యంతో తెలంగాణ జైళ్లశాఖ చరిత్రాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను ఏర్పాటు చేసి ఖైదీల పునరావాస ప్రక్రియ చేపట్టింది.
జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యామిశ్రా ఈ నూతన ఐటీఐని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా ఖైదీల కోసం ప్రత్యేక ఐటీఐని నెలకొల్పడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఒక్కో బ్యాచ్‌లో 200 మంది అభ్యర్థులకు సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఫిట్టర్, పెయింటర్, వీవింగ్ టెక్నీషియన్, వుడ్‌వర్క్ వంటి ఉపాధి ఆధారిత కోర్సులకు ఆమోదం లభించిందని, తద్వారా ఖైదీలకు జైలు ఆవరణలోనే నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చిందని వివరించారు.
పునరావాసమే పరమావధి..
శిక్ష పూర్తిచేసుకుని బయటకు వచ్చే ఖైదీలకు సమాజంలో ఎదురయ్యే ప్రధాన సవాలు జీవనోపాధి. నేరచరిత్ర కారణంగా ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి వెనుకాడటం, సామాజిక వివక్ష, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు వారిని మళ్లీ తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వృత్తి విద్య ఒక బలమైన ఆయుధంగా పనిచేస్తుంది. ఫిట్టర్ కోర్సు పూర్తిచేసిన వారు పారిశ్రామిక రంగాల్లో సాంకేతిక నిపుణులుగా రాణించే వీలుంది. పెయింటింగ్, వుడ్‌వర్క్ నైపుణ్యాలతో సొంతంగా చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చు. వీవింగ్ టెక్నీషియన్ శిక్షణ ద్వారా వస్త్ర తయారీ పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
పటిష్టమైన సంస్కరణల పునాది
తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఖైదీల మానసిక, శారీరక వికాసం కోసం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కౌన్సెలింగ్, యోగా, ధ్యానం, క్రీడలతో పాటు అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో, స్వల్పకాలిక ఖైదీలకు తాపీపని, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, నర్సరీ నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ), మెప్మా, ఎస్‌బీఐ-ఆర్‌ఎస్‌ఈటీఐ, జన్ శిక్షణ్ సంస్థాన్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. అదనంగా, అర్హులైన ఖైదీలకు రుణ సదుపాయాలు కల్పిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు జైళ్లశాఖ బాటలు వేస్తోంది.
ఆచరణాత్మక శిక్షణకు వేదిక
చర్లపల్లి కేంద్ర కారాగారం ఇప్పటికే స్టీల్ ఫర్నిచర్, కార్పెంట్రీ, ఫినైల్, శానిటైజర్, వీవింగ్, డైయింగ్, సబ్బులు, టైలరింగ్, బేకరీ, నర్సరీ వంటి అనేక ఉత్పత్తి విభాగాలకు కేంద్రంగా ఉంది. ఇలాంటి పారిశ్రామిక వాతావరణం ఉన్న చోట ఐటీఐ ఏర్పాటు కావడం ఖైదీలకు ఎంతో ప్రయోజనకరం. తరగతి గదిలో నేర్చుకునే పాఠాలను, జైలులోని ఉత్పత్తి విభాగాల్లో ఆచరణాత్మకంగా సాధన చేసే అరుదైన అవకాశం వారికి లభిస్తుంది.
అయితే, ఈ వినూత్న ప్రయత్నం ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన సమన్వయం అవసరం. శిక్షణ పూర్తిచేసుకున్న ఖైదీలకు గుర్తింపు పొందిన ధ్రువపత్రాలు (సర్టిఫికేషన్) అందించాలి. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను నవీకరించడం కీలకం. జైలు నుంచి విడుదలయ్యే సమయానికి ప్లేస్‌మెంట్ సహకారం అందించడం, స్వయం ఉపాధి కోరుకునే వారికి ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు సులభంగా అందేలా సంబంధిత శాఖలు చొరవ చూపాలి.
ఇదీ చదవండి: ఏడాది తిరగకముందే బిజినెస్ మూసివేత.. కట్ చేస్తే..


