జనవరి 15 వరకు రోజూ రెండు సెషన్లలో నిర్వహణ
ఈ నెల 16 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి డిసెంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక్కో పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక్కో పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950గా నిర్ణయించారు.
పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ 16 నుంచి https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జనవరి 3 నుంచి 15 వరకు రెండు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
150 మార్కులకు పరీక్ష
టీజీటెట్‌ను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునేవారు పేపర్–1కు, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపర్–2కు హాజరుకావాలి. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠాలు చెప్పాలనుకునేవారు రెండు పేపర్లూ రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపరులో 150 బహుళైచి్ఛక ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. నెగెటివ్ మార్కులు ఉండవు.
అర్హతలు ఇవే..
పేపర్–1కు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాటు రెండేళ్ల డీఎల్‌ఎడ్/డీఎడ్, నాలుగేళ్ల బీఎల్‌ఎడ్ లేదా సంబంధిత స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
పేపర్–2కు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
ఈ రెండు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు చాలు.
నాలుగేళ్ల బీఏఎడ్, బీఎస్సీఎడ్ చేసినవారు కూడా అర్హులు.
సంబంధిత భాషలో డిగ్రీ, ఓరియంటల్ లాంగ్వేజ్ లేదా పీజీతోపాటు లాంగ్వేజ్ పండిట్ శిక్షణ పొందినవారు భాషా ఉపాధ్యాయుల కేటగిరీలో అర్హత పొందవచ్చు.
బీఈ, బీటెక్ అభ్యర్థులు నిర్దేశిత మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత ఆధారంగా పేపర్–2కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారు.
ఇదీ చదవండి: ప్రతిభను వెలికితీసేలా పరీక్షలు ఉండాలి


