నాసిరకం.. పర్యవేక్షణ లోపం! | Low-grade electrical equipment major threat | Sakshi
Sakshi News home page

నాసిరకం.. పర్యవేక్షణ లోపం!

Nov 14 2026 6:04 AM | Updated on Nov 14 2026 6:04 AM

Low-grade electrical equipment major threat

ప్రాణాల మీదకు తెస్తున్న విద్యుత్‌ ఉపకరణాలు

తక్కువ నాణ్యత వస్తువులతో ఏటా సగటున

900 మంది మృత్యువాత... కార్యరూపం దాల్చని ఈఆర్‌సీ, కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు

ప్రమాణాల పర్యవేక్షణలో అధికారులు విఫలం

వైర్లు, కేబుళ్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు, ఎంసీబీలు

అన్నీ చాలావరకు నాణ్యత లేనివే..!

వినియోగదారులు సైతం తక్కువ ధర కలిగిన ఉపకరణాలు కొనుగోలు చేస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉపకరణాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తరచూ షార్ట్‌ సర్క్యూట్లు చోటుచేసుకోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సంవత్సరం 2 లక్షల విద్యుత్‌ మీటర్లు కాలిపోతున్నాయి. సంబంధిత ఘటనల్లో ఏటా సగటున 900 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అధికారిక లెక్క కాగా..అనధికారికంగా ఈ సంఖ్య భారీగా ఉంటుందని అంచనా. నాణ్యత ప్రమాణాలపై పర్యవేక్షణ లోపం, తక్కువ ధరకు వచ్చిన ఉపకరణాలకే ప్రజలు ప్రాధాన్యతనివ్వడం, వారిలో సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని    నిపుణులు చెబుతున్నారు. 

వినియోగదారులు వాడే విద్యుత్‌ ఉపకరణాల నాణ్యతపై దృష్టి పెట్టాలని ఏడాది క్రితం విద్యుత్‌ నియంత్రణ మండలి సూచించింది. కేంద్ర విద్యుత్‌ శాఖ కూడా నాణ్యత లేని ఉపకరణాలు మార్కెట్లోకి రానివ్వకుండా చూడాలని ఆదేశించింది. ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ వ్యాప్తంగా 80 శాతం వినియోగదారులు నాసిరకం వస్తువులే కొనుగోలు చేస్తున్నారని పంపిణీ సంస్థలు జరిపిన పరిశీలనలో వెల్లడైంది. వైర్లు, కేబుళ్ళు, స్విచ్‌లు, ప్లగ్‌లు, ఎంసీబీలు అన్నీ నాణ్యత లేనివే కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లో కొన్నింటిని నకిలీ ఐఎస్‌ఐ ముద్రలతో విక్రయిస్తున్నారు. వీటి వల్ల విద్యుత్‌ లీక్‌లు, షార్ట్‌ సర్క్యూట్లు, అగ్రిప్రమాదాలు, విద్యుత్‌ షాక్‌లు సంభవిస్తున్నాయి.  

రూ.కోట్లలో వ్యాపారం 
    పరిశ్రమల వార్షిక సర్వే నివేదికల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ ఏటా రూ. 5,466 కోట్ల విలువైన విద్యుత్‌ ఉపకరణాల తయారీ జరుగుతోంది. ఇందులో వైర్లు, కేబుళ్ళు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్, ఎంసీబీలు , విద్యుత్‌ మీటర్లు ఉంటున్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని వినియోగదారులకు విద్యుత్‌ ఉపకరణాలు అందుతున్నాయి. అయితే ఇళ్ళ నిర్మాణం చేపట్టే వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తారు.

అధిక లాభాలపై ఆశతో కాంట్రాక్టర్లు నాసిరకం ఉపకరణాలు కొనుగోలు చేసి పనికానిచ్చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో 85 శాతం నాసిరకం విద్యుత్‌ ఉపకరణాలే ఉంటున్నట్లు పరిశీలనలో తేలింది. విద్యుత్‌ ఉపకరణాల తయారీలో వాడే రాగి, అల్యూమినియం, ఇత్తడి, ప్లాస్టిక్‌ వంటి ముడిసరుకులను నాణ్యత లేనివి వాడుతున్నారు. ప్రమాణాలకు సరిపోని ఇన్సులేషన్‌ వస్తువులను వాడుతున్నారు. కండక్టర్‌ మందం, ఇన్సులేష¯న్‌ పొర నాణ్యత, విద్యుత్‌ నిరోధక సామర్థ్యంలో లోపాలు ఉంటున్నాయి.

స్విచ్‌లు, ప్లగ్‌లు, సాకెట్ల తయారీలో ప్లాస్టిక్‌ బాడీ, రాగి లేదా ఇత్తడి కాంటాక్టులు, స్ప్రింగులు కీలకం. నాణ్యత లేని ప్లాస్టిక్, తక్కువ సామర్థ్యం కలిగిన లోహ భాగాలు ఉపయోగిస్తే వేడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. విద్యుత్‌ ప్రవాహం సమయంలో స్పార్కింగ్, కాంటాక్టులు కాలిపోవడం, ప్లగ్‌లు వేడెక్కడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఓవర్‌లోడ్, షార్ట్‌సర్క్యూట్‌ సంభవించినప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే పరికరాలే మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్లు. వీటిలో బైమెటాలిక్‌ స్ట్రిప్, మాగ్నెటిక్‌ ట్రిప్పింగ్‌ వ్యవస్థ, కాంటాక్టులు, ఆర్క్‌ చాంబర్‌ వంటి భాగాలుంటాయి. వీటి నాణ్యతలో లోపాలుంటే ప్రమాద సమయంలో ఎంసీబీ సకాలంలో పనిచేయడం పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.  

మామూళ్ల కక్కుర్తి? 
    విద్యుత్‌ ఉపకరణాల నాణ్యత, ఐఎస్‌ఐ ధ్రువీకరణ విషయంలో బ్యూరో ఆఫ్‌ ఇండియ¯న్‌ స్టాండర్డ్స్‌ ప్రధాన బాధ్యత వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్‌ పరిధిలోకి తెచి్చన ఉత్పత్తులకు ఐఎస్‌ఐ ధ్రువీకరణ తప్పనిసరి. లైసె¯న్స్‌ లేకుండా ఐఎస్‌ఐ ముద్రను ఉపయోగించడం, తప్పుదారి పట్టించే విధంగా విక్రయించడం చట్టవిరుద్ధం. అయితే నాణ్యత ప్రమాణాలు చూడాల్సిన అధికారులు నకిలీ తయారీ దారుల మామూళ్ళకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. లేబొరేటరీల్లో పరీక్షలు నిర్వహించకుండానే నామమాత్రపు జరిమానాలతో కేసులు ముగిస్తున్నారు.  

వినియోగదారులు రాజీ పడకూడదు 
విద్యుత్‌ ఉపకరణాల నాణ్యతపై వినియోగదారుల్లో అవగాహన పెరగాలి. నిర్మాణ సమయంలో తక్కువ సామర్థ్యం ఉపకరణాలు వాడతారు. ఆ తర్వాత లోడ్‌ పెంచుతారు. ఇవే ప్రమాదాలకు కారణమవుతాయి. ఉపకరణాల తయారీ నాణ్యతను బీఎస్‌ఐ పరిశీలిస్తుంది. నాణ్యత లోపించిందని తెలిస్తే ఆ సంస్థకు ఫిర్యాదు చేస్తే వాస్తవాలు వెలికి తీస్తారు. ఏదేమైనా విద్యుత్‌ వస్తువుల విషయంలో వినియోగదారులు రాజీ పడొద్దు.  
– నందకుమార్‌ (రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రికల్‌ అధికారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement