రూ. 5.61లక్షల కోట్లు | Telangana Government Faces Growing Debt Burden | Sakshi
Sakshi News home page

రూ. 5.61లక్షల కోట్లు

Nov 14 2026 5:56 AM | Updated on Nov 14 2026 5:56 AM

Telangana Government Faces Growing Debt Burden

తెలంగాణ రాష్ట్రానికి అప్పుల గుదిబండ

ఆర్థిక వృద్ధితో పాటే గణనీయంగా అప్పులు 

జీఎస్‌డీపీలో 34.9 శాతానికి చేరిన మొత్తం రుణాలు 

ఆదాయంలో 26.8 శాతం రుణాల చెల్లింపులకే 

మానవ వనరుల అభివృద్ధికి కేటాయింపులు నేలచూపు 

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సెస్‌ దశాబ్ది నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) తెలిపింది. తెలంగాణ రూ.5.61 లక్షల కోట్ల అప్పుల భారం మోస్తోందని తెలిపింది. ఆర్థిక జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధి దాటి అప్పులు చేశారని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, ఆదాయ వనరులు, అప్పులు, ప్రభుత్వ వ్యయాల తీరుపై సమగ్ర అధ్యయన నివేదికను సెస్‌ శుక్రవారం విడుదల చేసింది.

బేగంపేట సెస్‌ ప్రాంగణంలోని బీపీఆర్‌ విఠల్‌  ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌బీఐ చైర్‌ ప్రొఫెసర్‌ దేబా ప్రసాద్‌రథ్, ఆర్‌బీఐ డీఈపీఆర్‌ అడ్వైజర్‌ సంగీతాదాస్, ది ఇండియా ఫోరం ఎడిటర్‌ రామ్మోనోహర్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ రేవతి తదితరులు నివేదికను విడుదల చేశారు. ‘పబ్లిక్‌ ఫైనాన్సెస్‌ ఆఫ్‌ తెలంగాణ: ట్రెండ్స్, ఛాలెంజస్‌ అండ్‌ పాలసీ ప్రయారిటీస్‌’పేరుతో రూపొందించిన ఈ నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పలు కీలక అంశాలను సెస్‌ వెల్లడించింది.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) పెరుగుతున్నప్పటికీ, అప్పులు, ఆర్థిక బాధ్యతలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. కోవిడ్‌ అనంతరం ఆదాయ వృద్ధి మందగించడం, కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటా తగ్గడం, సంక్షేమ పథకాలపై అధిక వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారాయని వివరించింది. నివేదికలోని వివరాలు.. 

నాల్గవ వంతు అప్పులకే.. 
    2025 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యక్ష బకాయి రుణాలు రూ.3,89,941 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో 24.2 శాతం. ప్రభుత్వ ఖాతాల బాధ్యతలు, ప్రభుత్వ హామీతో తీసుకున్న ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలను కలిపితే మొత్తం ఆర్థిక బాధ్యతలు రూ.5,61,787 కోట్లకు చేరాయి. అంటే జీఎస్‌డీపీలో 34.9 శాతం. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన 32.8 శాతం పరిమితిని 2.1 శాతం మేర ఈ మొత్తం అధిగమించింది.

అప్పుల చెల్లింపుల భారం రాష్ట్ర ఆర్థిక వనరులపై ప్రభావం చూపుతోంది. 2024–25లో ప్రభుత్వ రుణాలు, ఆఫ్‌బడ్జెట్‌ రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులు కలిపి రూ.62,953 కోట్లుగా నమోదయ్యాయి. ఇది రాష్ట్ర మొత్తం ఆదాయ వసూళ్లలో 26.8 శాతం కావడం గమనార్హం.

అంటే రాష్ట్రానికి వచ్చే ప్రతి రూ.100 ఆదాయంలో దాదాపు రూ.27 అప్పుల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది. 2020 సెప్టెంబర్‌లో తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి చేసిన సవరణ కూడా అప్పుల బాధ్యతలు పెరగడానికి ఒక కారణంగా నివేదిక పేర్కొంది. వార్షిక అదనపు రిస్క్‌ వెయిటెడ్‌ గ్యారంటీ పరిమితిని మొత్తం ఆదాయ వసూళ్లలో 90 శాతం నుంచి 200 శాతానికి పెంచిన అంశాన్ని ప్రస్తావించింది. 

ఏటా 11.4 శాతం ఆర్థిక వృద్ధి 
    తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది. 2014–15 నుంచి 2024–25 మధ్య నామమాత్ర జీఎస్‌డీపీ వార్షికంగా 11.4 శాతం, వాస్తవ జీఎస్‌డీపీ 6.2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 2023–24 నాటికి నామమాత్ర తలసరి ఆదాయంలో గోవా తర్వాత సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. 2024–25 నాటికి స్థూల రాష్ట్ర విలువ జోడింపులో (జీఎస్‌వీఏ) సేవల రంగం వాటా 67 శాతానికి చేరింది.

హైదరాబాద్‌ ఈ వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలిచింది. అయితే వ్యవసాయ రంగం జీఎస్‌వీఏలో కేవలం 14.1 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 41.7 శాతం మందికి ఉపాధి కల్పింస్తుండటం ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక అసమానతలను సూచిస్తోంది. దశాబ్ద కాలంలో మొత్తం ఆదాయ వసూళ్లలో 76 శాతం రాష్ట్ర సొంత ఆదాయ వనరుల నుంచే సమకూరింది. ఎస్జీఎస్టీ, రాష్ట్ర వ్యాట్, ఎక్సైజ్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల ద్వారా వచ్చే రాష్ట్ర సొంత పన్ను ఆదాయం ఏటా 11.6 శాతం పెరిగి 2024–25 నాటికి రూ.1,09,233 కోట్లకు చేరింది.  

తగ్గిన కేంద్ర నిధులు 
    కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో తెలంగాణ వాటా క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. రుణేతర కేంద్ర బదిలీలు రాష్ట్ర ఆదాయ వసూళ్లలో 2015–16లో 23.5 శాతం ఉండగా, 2024–25 నాటికి 15.1 శాతానికి పడిపోయాయి. 14వ ఆర్థిక సంఘం సమయంలో కేంద్ర పన్నుల విభజనలో తెలంగాణ వాటా 2.43 శాతంగా ఉండగా, 15వ ఆర్థిక సంఘం కాలంలో 2.10 శాతానికి తగ్గింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో స్వల్ప పెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ పరిహారం గడువు ముగియడం వల్ల కేంద్ర గ్రాంట్ల రూపంలో అందే సహాయం కూడా తగ్గిందని తెలిపింది.  

మానవ వనరులపై నిర్లక్ష్యం 
    రాష్ట్ర వ్యయ విధానంపైనా నివేదిక కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి, అభివృద్ధియేతర వ్యయాల నిష్పత్తి 72:28గా ఉన్నప్పటికీ, అభివృద్ధి వ్యయంలో ఎక్కువ భాగం సంక్షేమ సబ్సిడీలు, ప్రత్యక్ష నగదు బదిలీల వైపు మళ్లుతోందని విశ్లేíÙంచింది. మానవ మూలధన అభివృద్ధికి చేసే ఖర్చు తక్కువగా ఉందని పేర్కొంది. వివిధ సంక్షేమ పథకాల వ్యయానికి అనుగుణంగా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయనే అంశంపై సమగ్ర అధ్యయనాలు, ఆర్థిక పారదర్శకతకు సంబంధించిన పరిశోధనలు కూడా పెరగాల్సిన అవసరం ఉందని సూచించింది. 

ఇలా చేయాలి... 
⇒ తెలంగాణ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం సెస్‌ పలు సూచనలు చేసింది. 
⇒ రాష్ట్ర ఆదాయ వృద్ధిని పెంచేందుకు పన్నుల వసూళ్ల వ్యవస్థను మెరుగుపరచాలి. 
⇒ ఆఫ్‌బడ్జెట్‌ రుణాలు, ప్రభుత్వ హామీలపై వార్షిక వివరాలను వెల్లడించాలి. 
⇒ సంక్షేమ పథకాల అమలులో సామాజిక తనిఖీలు చేపట్టాలి. 

⇒ ఫలితాల ఆధారిత బడ్జెటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి. 
⇒ మానవ వనరుల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి. 
⇒ ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యయాల పునరుద్ధరణ నమూనాలు రూపొందించాలి. 
⇒ టీజీఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని రిస్క్‌ వెయిటెడ్‌ పరిమితులను పునఃపరిశీలించాలి. 

నివేదికలో వెల్లడైన వివరాలు ఇలా.. 
రాష్ట్ర మొత్తం ఆర్థిక బాధ్యతలు        : రూ.5,61,787 కోట్లు 
జీఎస్‌డీపీలో ఎంత:             34.9 శాతం. 
చట్టబద్ద రుణ పరిమితి        : 32.8 శాతం 
రాష్ట్ర సొంత పన్ను ఆదాయం    : రూ.1,09,233 కోట్లు 
రుణ సేవల చెల్లింపులు    : రూ.62,953 కోట్లు 
సేవల రంగం వాటా        : 67 శాతం 
వ్యవసాయ రంగం వాటా    : 14.1 శాతం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement