సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో అండాల రాకెట్ గుట్టురట్టయ్యింది. పలు ఫెర్టిలిటీ సెంటర్లపై ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఫిర్యాదులు అందాయి. సద్గురు పేరు ఏఆర్‌టీ, ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లీనిక్‌లు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే టార్గెట్‌గా మాఫియా.. దందా సాగిస్తోంది.
12 మంది ఇతర రాష్ట్రాల మహిళల నుంచి అండాల సేకరించినట్లు తేలింది. బాధితుల్లో వెస్ట్ బెంగాల్, యూపీ, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మహిళలు ఉన్నారు. డోనర్‌కు ఫెర్టిలిటీ సెంటర్‌కు మధ్య బ్రోకర్‌గా వ్యవహరించిన అమిత్ శర్మ.. ఒక్కో డోనర్‌కు రూ.50 వేలు ఇస్తామని నమ్మించినట్లు సమాచారం. సంస్థ డైరెక్టర్ దుర్గారావు, క్లినిక్ ఇంఛార్జ్‌లపై కేసు నమోదు చేశారు.
ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి యువతుల్ని ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, గర్ల్స్ హాస్టల్ ముసుగులో సాగుతున్న ఈ వ్యవ హారాన్ని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధి లోని ప్రకాశ్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌పై స్థానిక పోలీసుల సాయంతో ఎస్‌ఓ టీ అధికారులు అక్టోబర్ 30 (శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాడులు చేశారు.
అపార్ట్‌మెంట్‌లోని కింది అంతస్తులో తనిఖీలు చేపట్టి పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఏడాది కాలంగా ఓ బాలికల హాస్టల్ నడుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతులు ఎనిమిది నుంచి పది మంది అక్కడ నివాసం ఉంటున్నారు. ఉద్యోగాల పేరుతో ఆయా ప్రాంతాలకు చెందిన పేద యువతులను ఆకర్షించిన సూత్రధారులు ఇక్కడకు తీసుకొచ్చారు. ఆపై వారి నుంచి అండాలను సేకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: 5.6 అడుగుల అమ్మాయిలే కావాలి.. శరీరంపై మచ్చలు ఉండకూడదు!


