హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ పోస్ట్‌ | VC Sajjanar Emotional Post After Being Transferred | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. సజ్జనార్‌ భావోద్వేగ పోస్ట్‌

Nov 13 2026 9:22 AM | Updated on Nov 13 2026 9:26 AM

VC Sajjanar Emotional Post After Being Transferred

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టిన తెలంగాణ సర్కార్‌.. కీలక స్థానాల్లో ఉన్న పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ను నియమించింది. కొంత కాలంగా డీజీపీ సీవీ ఆనంద్‌కు, హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌కు పొసగడం లేదని, ఎప్పుడైనా సజ్జనర్‌ బదిలీ తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ కావడం గమనార్హం.

ఈ క్రమంలో హైదరాబాద్ సీపీగా ఇక సెలవు అంటూ వీసీ సజ్జనార్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. గడచిన ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణం. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేశారు.

‘‘ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు నాపై, మా పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మేము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు నా మనసును ఎంతగానో కదిలించింది.

..ప్రజల క్షేమమే పరమావధిగా మేము అనేక అడుగులు వేశాం. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ఉక్కుపాదం మోపాం. భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నంలో మాకు అండగా నిలిచిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు.

..మరోవైపు, సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, డీవోటీ వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ గారు ప్రత్యేకంగా స్పందించి.. మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం మనందరికీ దక్కిన గౌరవం. అలాగే బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాం.

..భావితరాల బిడ్డల్లో పోలీసుల పట్ల భయం పోయి, సమాజం పట్ల ఒక ఉన్నతమైన స్ఫూర్తి కలగాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో చేపట్టిన ‘డే విత్ సీపీ’ కార్యక్రమం నాకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చింది. ఇక నగరవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలిగించాం. మన ఇంట్లోని ఆడబిడ్డల రక్షణను బాధ్యతగా భావించి మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం.

..ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించే ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు వారి త్యాగాలకు మేమిచ్చిన చిరు కానుకలు. హైదరాబాద్ ప్రజలందరూ సదా సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో.. హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నాను’’ అంటూ సజ్జనార్‌లో ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement