ఏఐ కన్నా మనుషులే మిన్న! | Companies are bringing back workers after AI layoffs | Sakshi
Sakshi News home page

ఏఐ కన్నా మనుషులే మిన్న!

Nov 13 2026 5:47 AM | Updated on Nov 13 2026 5:47 AM

Companies are bringing back workers after AI layoffs

ఏఐ స్థానంలో మళ్లీ పాత ఉద్యోగులకు కంపెనీల పట్టం 

తొలగించిన ఉద్యోగులకు తిరిగి స్వాగతం 

ప్రపంచవ్యాప్తంగా జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్‌లలో మార్పు

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ఇక మనుషులతో పనిలేదంటూ రెండేళ్లుగా భారీగా ఉద్యోగ కోతలు పెట్టిన దిగ్గజ కంపెనీలు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నాయి. మనుషుల స్థానాన్ని ఏఐ  పూర్తిగా భర్తీ చేయలేదనే విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించి గతంలో తొలగించిన పాత ఉద్యోగులను మళ్లీ తిరిగి రమ్మని బతిమిలాడుతున్నాయి. కార్పొరేట్‌ ప్రపంచంలో ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది.  

ఖర్చు తగ్గుతుందనుకుంటే తడిసి మోపెడు కావడంతో...
నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆశతో చాలా కంపెనీలు ఉద్యోగుల స్థానంలో ఏఐ సాఫ్ట్‌వేర్‌లు, చాట్‌బాట్‌లను రంగంలోకి దించాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోగా ఏఐ నిర్వహణ ఖర్చులు, అవి చేసే తప్పులను సరిదిద్దే ఖర్చులు తడిసి మోపెడయ్యాయని కంపెనీలు గ్రహించాయి. 31 కంపెనీలు ఏఐ నిర్వహణ ఖర్చుల వల్ల లాభాలకు బదులు నష్టాలను చవిచూశాయి.

ప్రముఖ పరిశోధనా సంస్థలు ఫారెస్టర్, ఆర్గ్‌వ్యూ నివేదికల ప్రకారం ఏఐ కోసం ఉద్యోగులను తొలగించిన యజమానుల్లో 55 శాతం మంది తమ నిర్ణయం తప్పని అంగీకరిస్తున్నారు. ౖహెచ్‌ఆర్‌ సంస్థ ఎస్‌హెచ్‌ఎల్‌ తాజా సర్వే ప్రకారం ఏఐ వల్ల ఉద్యోగం కోల్పోయిన ప్రతి ఐదుగురిలో ఒకరిని కంపెనీలు తిరిగి ఆహా్వనించాయి. తొలగింపులు జరిపిన ఆరు నెలల్లోపే దాదాపు 70 శాతం కంపెనీలు మళ్లీ కొత్త నియామకాలు లేదా పాత ఉద్యోగులను వెనక్కి పిలిచే పని మొదలుపెట్టాయి. 

ఏఐ ఎందుకు విఫలమైంది?  
కోడింగ్‌ రాయడంలో, కస్టమర్లతో మాట్లాడటంలో ఏఐ చాలా తప్పులు చేస్తోంది. ఆ తప్పులను సరిదిద్దడానికి మళ్లీ మనుషులే అవసరమవుతున్నారు. కస్టమర్‌ కోపంగా ఉన్నప్పుడు లేదా ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు మనిషిలా ఆలోచించి ఓదార్చి పరిష్కారం చూపే శక్తి యంత్రాలకు లేదు. 

మళ్లీ నియామకాలు.. 
⇒ స్వీడన్‌కు చెందిన ఫిన్‌టెక్‌ కంపెనీ క్లార్నా ఏఐ చాట్‌బాట్‌ రాకతో 700 మంది కస్టమర్‌ కేర్‌ ఉద్యోగులను తొలగించి తాజాగా మళ్లీ నియామకాలు చేపడుతోంది. 
⇒ అమెరికాలోని కార్ల తయారీ దిగ్గజ సంస్థ ఫోర్డ్‌.. ఆటోమేటెడ్‌ సిస్టమ్స్‌పై నమ్మకంతో ఇంజనీర్లను తగ్గించింది. అయితే తయారీలో నాణ్యతా లోపాలను గుర్తించడంలో ఏఐ వైఫల్యంతో 300 మంది ఇంజనీర్లను తిరిగి తీసుకుంది. 

⇒ కామన్వెల్త్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆ్రస్టేలియా (ఆ్రస్టేలియా) ఏఐ వాయిస్‌ బాట్‌ సేవలను తీసుకొచ్చినందుకు 40 మందికిపైగా సిబ్బందిని తొలగించించింది. కానీ వాయిస్‌ బాట్‌ వల్ల కస్టమర్ల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుంది. 
⇒ ఐబీఎం సుమారు 8,000 బ్యాక్‌ ఆఫీస్, హెచ్‌ఆర్‌ ఉద్యోగాల నియామకాలను నిలిపివేసి ఏఐ హెచ్‌ఆర్‌ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. కానీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐ విఫలమవడంతో మళ్లీ హెచ్‌ఆర్‌ నిపుణులను, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను నియమించుకుంటోంది. 

⇒ గూగుల్‌ 2025–26 మధ్య తీసుకున్న ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లలో 20 శాతం మంది గతంలో కంపెనీ వదిలి వెళ్లిన లేదా తొలగించిన పాత ఉద్యోగులే.  
⇒ అమెజాన్‌ ఏఐ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో 30,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడటంతో పాత ఉద్యోగులను వెనక్కి పిలవాలని నిర్ణయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement