డ్రాపౌట్స్‌కు కళ్లెం పడేనా?! | Mixed Reactions Emerge Over Proposal to Abolish Intermediate Board: Telangana | Sakshi
Sakshi News home page

డ్రాపౌట్స్‌కు కళ్లెం పడేనా?!

Nov 13 2026 5:23 AM | Updated on Nov 13 2026 5:24 AM

Mixed Reactions Emerge Over Proposal to Abolish Intermediate Board: Telangana

విలీనం వెనుక వెంటాడే సమస్యలెన్నో..

ఇంటర్‌ బోర్డు రద్దుపై భిన్నాభిప్రాయాలు 

ఎన్ని స్కూళ్లలో 12వ తరగతి పెడతారు? 

మౌలిక వసతులు లేకుండా తొందరపాటు నిర్ణయమా?

ప్రైవేటు కాలేజీల విషయంలో కొరవడిన స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మిడియెట్‌ బోర్డును రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి సీనియర్‌ సెకండరీ విద్యా విధానం అమలు చేయాలని భావిస్తున్నందున ఇంటర్‌ బోర్డును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. టెన్త్‌ నుంచి ఇంటర్‌ వరకూ వెళ్లే క్రమంలో చదువు మానేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా సర్కారు చెబుతోంది.

సెకండరీ విద్యా విధానం అమలుతో ఈ పరిస్థితిని కొంతవరకు నివారించవచ్చని పేర్కొంటోంది. అయితే పూర్తి స్థాయిలో చర్చ లేకుండా ఇంటర్‌ బోర్డును రద్దు చేయడం, హైస్కూళ్లలోనే టెన్‌ ప్లస్‌ టు వరకూ నడిపించాలనే నిర్ణయం తొందరపాటుగా నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక అనేక సవాళ్లు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల మాటేమిటనేది, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను ఒకే గొడుగు కిందకు తెస్తారా? లేదా? అనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు.  

డ్రాపౌట్స్‌ జాతీయ సగటు కంటే ఎక్కువ 
ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక స్థాయిల్లో విద్యార్థులను పాఠశాలల్లో కొనసాగించడంలో మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ.. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్‌ ప్లస్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సెకండరీ స్థాయి డ్రాపౌట్‌ రేటు 13.2 శాతంగా నమోదైంది.

జాతీయ సగటు 11.5 శాతం కాగా.. తెలంగాణలో అంతకంటే 1.7 శాతం పాయింట్లు అధికంగా ఉంది. మరో కీలక అంశం ఏమిటంటే.. పదో తరగతి తర్వాత ఇంటర్మిడియెట్‌ లేదా ఇతర ఉన్నత మాధ్యమిక విద్యలోకి వెళ్లే విద్యార్థుల (ట్రాన్సిషన్‌) రేటు 72.8 శాతంగానే ఉంది. అంటే పదో తరగతి దశ నుంచి తదుపరి విద్యా స్థాయికి మారడంలో పెద్ద అంతరమే కనిపిస్తోంది. జాతీయ సగటు 75.1 శాతం కావడం గమనార్హం. నీతి ఆయోగ్‌ 2026 మేలో విడుదల చేసిన పాఠశాల విద్యా నివేదికలోనూ ఈ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించింది.  

బాలురే ఎక్కువ 
    ఇక డ్రాపౌట్ల విషయంలో బాలురు, బాలికల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణలో సెకండరీ డ్రాపౌట్లు 2024–25లో బాలురు 15.6 శాతం ఉంటే, బాలికలు 10.7 శాతం ఉన్నారు. అంటే బాలికలతో పోలిస్తే బాలుర డ్రాపౌట్లు 4.9 శాతం ఎక్కువగా ఉన్నాయి. బాలుర చదువులు మధ్యలోనే ఆగిపోవడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు ఉపాధి కోసం వెళ్లడం, ఇతర సామాజిక కారణాలు ప్రభావం చూపిస్తున్నాయి.

12వ తరగతి వరకు విద్యను కొనసాగిస్తున్న వారు సగం మందే ఉంటున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల లోపం కూడా విద్యార్థుల డ్రాపౌట్స్‌ను పెంచుతోందని నీతి అయోగ్‌ పేర్కొంది. తెలంగాణలో 5,001 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా.. వీటిలో 62,288 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2,245 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు. పాఠశాలల సంఖ్య, విద్యార్థుల నమోదు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల లభ్యత, బోధనా నాణ్యతలో అసమానతలు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.  

విలీనం సాధ్యమేనా? 
    రాష్ట్రంలో 4 వేలకు పైగా ఉన్నత పాఠశాలలున్నాయి. 417 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి. అయితే మొత్తం స్కూళ్ళల్లో టెన్‌ ప్లస్‌ టూ విద్య సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 1.25 లక్షలు మించడం లేదు. దాదాపు 4 లక్షల మందికిపైగా ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. ఇంటర్‌ బోర్డు ప్రస్తుతం ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తోంది. విలీనం చేస్తే పాఠశాల డైరెక్టరేట్‌ గుర్తింపు ఇవ్వాలి.

ఇది సమస్య కాకున్నా, ప్రైవేటు కాలేజీల విషయంలో ప్రభుత్వం ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూళ్ళలో టెన్‌ ప్లస్‌ టూ స్థాయికి వేటిని అప్‌గ్రేడ్‌ చేస్తారు? వాటిల్లో ల్యాబ్‌లున్నాయా? లేకుంటే వాటిని కల్పించేందుకు వీలు ఉంటుందా? అనే దానిపై కూడా సందేహాలున్నాయి. ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనల అమలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో జూనియర్‌ లెక్చరర్లను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తేవడం సాంకేతికంగా సమస్యగా మారే వీలుంది.  

అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి 
విలీనం చేసినంత మాత్రానే అమాంతంగా విద్యార్థుల సంఖ్య పెరిగిపోదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలి.

ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని నియంత్రించకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తీర్చకుండా, ఉపాధ్యాయులు, అధ్యాపకుల మధ్య ఉత్పన్నమయ్యే సర్వీసు సమస్యలను పరిష్కరించకుండా ఇంటర్మిడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసినందువల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు కీలక భాగస్వాములైన అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి. 
– చావా రవి (టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్షుడు)  

క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి 
విలీనం చేయడం మంచిదని విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడే ప్రభుత్వానికి సూచించా. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుంది. పాఠశాల స్థాయిలో మౌలిక సదుపాయాలు, లేబ్‌లను పరిగణనలోనికి తీసుకోవాలి. సరిపడా జూనియర్‌ లెక్చరర్లు సమకూర్చడంపై ముందే అవగాహనకు రావాలి.  
– ఆకునూరి మురళి (విద్యా కమిషన్‌ మాజీ చైర్మన్‌)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement