TG: ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే! | A joint initiative by Mee Seva, Cyberabad Municipal, Police, Security Council | Sakshi
Sakshi News home page

TG: ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే!

Nov 12 2026 7:37 PM | Updated on Nov 12 2026 7:39 PM

A joint initiative by Mee Seva, Cyberabad Municipal, Police, Security Council

డోర్ స్టెప్ డెలివరీ ద్వారా పౌర సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యం

ప్రజా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వ శాఖలు, పౌర సంస్థల సమన్వయం

సైబరాబాద్ పరిధిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యం

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మీసేవ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతమైంది.

సైబరాబాద్ పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఉన్నతాధికారులు పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ, మీసేవ కమిషనర్ టీ. రవికిరణ్ హాజరయ్యారు.

మీ-సేవ డోర్‌స్టెప్ డెలివరీ – ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే
కార్యక్రమంలో భాగంగా మీసేవ అందిస్తున్న డోర్‌స్టెప్ డెలివరీ (DSD) సేవల గురించి కమిషనర్ రవికిరణ్ ప్రత్యేకంగా వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దార్శనికతతో పౌరసేవలు అత్యంత సులువుగా అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లకుండానే తమ ఇంటి వద్ద నుంచే వివిధ ప్రభుత్వ సేవలను పొందే అవకాశం డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా ఉందని అన్నారు. బిజీగా ఉంటే ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు, మీసేవ కేంద్రాల దాకా వెళ్లలేని వృద్దులకూ ఈ సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు.

1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని, జనన, మరణ ధృవీకరణ పత్రాల్లో సవరణలు, పిల్లల పేర్ల నమోదు, కుల ధృవీకరణ పత్రాలు, జనన తేదీ ధృవీకరణ పత్రాలు, EWS సర్టిఫికెట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు, గ్యాప్ సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, OBC సర్టిఫికెట్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంలో ఈ విధానం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పౌరసేవలను సులభతరం చేసి అందించటంలో మీసేవ చొరవను మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ సృజన మెచ్చుకున్నారు. తగిన ప్రచారం కల్పించటం ద్వారా ఈసేవలు పొందాలని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను కోరారు.  ప్రభుత్వ శాఖలు, పోలీస్ విభాగం, మున్సిపల్ సంస్థలు, సాంకేతిక సేవా సంస్థలు, నివాస సముదాయాల మధ్య సమన్వయం పెంపొందించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పోలీస్ కమిషనర్ రమేష్ తెలిపారు.

ప్రజా రవాణా వ్యవస్థ పడకం మరింతగా పెరగాలి
అలాగే సైబరాబాద్ పరిధిలోని పౌరులు ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా వినియోగించడం పై దృష్టి పెట్టాలని కమిషనర్ రమేష్ కోరారు. సైబరాబాద్ మూవ్స్ పేరుతో ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు, ప్రత్యేక లూప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.  ఇందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల మద్దతు కూడా కావాలని కోరారు.

ప్రజా రవాణా, ఆన్‌లైన్ బుకింగ్ సేవలకు డిజిటల్ పరిష్కారం
అలాగే మీ టికెట్ యాప్ (Mee Ticket App) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను కూడా కార్యక్రమంలో వివరించారు. ఈ యాప్ ద్వారా కొత్త బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం, రెన్యువల్, TGSRTC బస్ టికెట్ సేవలు, హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ బుకింగ్, నెహ్రూ జూ పార్క్‌తో పాటు, ఇతర పార్కులు, సందర్శనీయ స్థలాల ప్రవేశ టికెట్లను నేరుగా ఈ యాప్ నుంచే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే సౌకర్యాలను పౌరులు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. డిజిటల్ సాంకేతికత ద్వారా ప్రజా రవాణా, వినోద, ఇతర పౌర సేవలను సులభంగా పొందేలా చేయడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల భాగస్వామ్యానికి పిలుపు
ఈ కార్యక్రమంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం క్యూర్ పరిధిలో అమలవుతున్న డోర్ స్టెప్ సర్వీసుల సేవలను పొందేందుకు గెటెడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ అసోసియేషన్లు భాగస్వాములు కావాలని అధికారులు ఆహ్వానించారు. ప్రతీ నివాస సముదాయంలోని ప్రజలకు మీసేవ డోర్‌స్టెప్ డెలివరీ, మీ టికెట్ యాప్, ఇతర ప్రభుత్వ, పౌర సేవలపై అవగాహన కల్పించడంలో అసోసియేషన్లు వారధిగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ చొరవను, ఐటీ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేన్ల ప్రతినిధులు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement