'మంత్రాల' నెపంతో ఇద్దరిని దారుణంగా... | Superstition Double Murder Telangana | Sakshi
Sakshi News home page

'మంత్రాల' నెపంతో ఇద్దరిని దారుణంగా...

Nov 12 2026 9:56 AM | Updated on Nov 12 2026 10:07 AM

Superstition Double Murder Telangana

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మూఢనమ్మకాలు ఇద్దరు వృద్ధుల ప్రాణాలను బలితీసుకున్నాయి. మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ఐదుగురు వ్యక్తులు కలిసి.. ఇద్దరు వృద్ధులను దారుణంగా హత్య చేసి, మృతదేహాలను అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. నాలుగు వారాల క్రితం జరిగిన ఈ జంట హత్యల ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మణుగూరు మండలం మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన బుడుగుల గ్రామానికి చెందిన మడకం భీమయ్య, పెద్ద మాసయ్య గత నెల 7న అడవి మార్గంలో వెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు వారిపై దాడి చేశారు. తమ కుటుంబ సభ్యుల అనారోగ్యానికి, మరణాలకు వృద్ధులు చేస్తున్న పూజలు, మంత్రాలే కారణమని అనుమానించిన నిందితులు పథకం ప్రకారం ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం రాత్రి వేళలో ఇద్దరి మృతదేహాలను సమీపంలోని చెక్‌డ్యామ్‌ వద్ద అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టి, చెట్ల కొమ్మలతో కప్పి వెళ్లిపోయారు. నాలుగు వారాలుగా కనిపించకుండా పోయిన వృద్ధుల కోసం కుటుంబ సభ్యులు గాలించగా.. చివరకు వారి మృతదేహాలు బయటపడటంతో గ్రామంలో కలకలం రేగింది.

మృతుడి కుమార్తె ఎట్టి నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలకు పాల్పడిన ఐదుగురు నిందితులను గుర్తించినట్లు మణుగూరు సీఐ నాగబాబు తెలిపారు. త్వరలోనే వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: విషాదం.. నీటి కుంటలో పడి నలుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement