టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ నుంచి అభిప్రాయాలు తీసుకున్న రాహుల్‌గాంధీ
రాష్ట్రంలో గతంలో పనిచేసిన రోహిత్ చౌదరి, విశ్వనాథన్, విష్ణునాథ్‌లతో చర్చలు
సీనియర్ నేతను రాష్ట్రానికి పంపాలని యోచన.. రాహుల్ అమెరికా పర్యటన తర్వాతే నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణకు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న దానిపై అధిష్టానం వివిధ కోణాల్లో పరిశీలిస్తోంది. కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై రాష్ట్ర నేతలతోపాటు గతంలో తెలంగాణలో పనిచేసిన ఏఐసీసీ స్థాయి నేతల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కలిసినప్పుడు రాష్ట్ర పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం.
గతంలో రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షించిన రోహిత్‌చౌదరి, విశ్వనాథన్, విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్ వంటి నేతల అభిప్రాయాలను సైతం రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నాయకుల మధ్య సమీకరణాలు, పార్టీ సంస్థాగత బలాబలాలు, ప్రభుత్వంతో సమన్వయం వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొత్త ఇన్‌చార్జ్ నియామకంలో గత అనుభవాలు కీలకంగా మారాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను గతంలో దీపాదాస్ మున్షీ పర్యవేక్షించిన సమయంలో పార్టీ సీనియర్లను సంప్రదించకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆ తర్వాత దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె పార్టీ వ్యవహారాలను క్రమశిక్షణతో నడిపించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఆమె విధానాలు, వ్యవహారశైలి రాష్ట్రంలోని కొందరు నాయకులకు అంతగా నచ్చలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్లడం, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో విఫలమయ్యారన్న చర్చ జరిగింది. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లనున్న నేపథ్యంలో కొత్త ఇన్‌చార్జ్ నియామకం అనివార్యమైంది. ఆమె స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై సెప్టెంబర్ నుంచే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీనియర్ నేతకే పగ్గాలు ?
అప్పట్లో ముకుల్ వాస్నిక్, డాక్టర్ చెల్లా కుమార్, పీవీ మోహన్, దిగ్విజయ్‌సింగ్, భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లోట్ వంటి సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉండటంతోపాటు, ఢిల్లీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతకు బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పాత, కొత్తతోపాటు సీనియర్ నాయకుల మధ్య సమన్వయం సాధించగలిగే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు, పదవుల పంపకాలు వంటి అంశాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల మధ్య సమన్వయం కుదర్చడం కూడా కొత్త ఇన్‌చార్జ్ ముందున్న ప్రధాన బాధ్యత కానుంది. ఈ నెల 16 నుంచి రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన తిరిగొచ్చాక కొత్త ఇన్‌చార్జ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వివిధ స్థాయిల్లో అభిప్రాయాలు సేకరిస్తున్న అధిష్టానం, అందరి సూచనలను బేరీజు వేసుకొని తుది నిర్ణయం తీసుకోనుంది.


