నగరాభివృద్ధికే చెరువుల పరిరక్షణ | CM Revanth Reddy at the inauguration of Thammidikunta Lake | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధికే చెరువుల పరిరక్షణ

Nov 12 2026 4:27 AM | Updated on Nov 12 2026 4:27 AM

CM Revanth Reddy at the inauguration of Thammidikunta Lake

నాగార్జునను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నాకు ఎలాంటి స్వార్థం లేదు..ఎవరిపైనా కోపం లేదు 

తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 

మొత్తం 1,372 చెరువుల్లో 50 శాతం మాయం

అందుకే సిటీలో వరదలు, ట్రాఫిక్‌ జామ్‌లు 

తమ్మిడికుంట అభివృద్ధి కోసం నటుడు నాగార్జున రెండెకరాలు ఇచ్చారు 

మూసీ అభివృద్ధి కొందరికి బాధ, కోపం తెప్పించిందన్న ముఖ్యమంత్రి 

ఓ మంచి కార్యక్రమంతో కొందరికి నష్టం వచ్చినా వేల మందికి లాభం కలుగుతుందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ‘నాకు ఎలాంటి స్వార్థం లేదు.. ఎవరిపైనా కోపం లేదు. కేవలం ప్రకృతిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించాలనేదే నా కోరిక. అందుకే నగరాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాం. అందులో భాగంగానే చెరువుల్ని పరిరక్షిస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా హైడ్రా అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువును ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 

మూసీ ప్రక్షాళనతో ఎవరికీ నష్టం జరగకుండా చూస్తా.. 
‘ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి, నాకు రాజకీయ, సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు ఉన్నా కొన్నింటిలో మాత్రం ఏకాభిప్రాయం. మూసీ అభివృద్ధి అనేది వాటిలో ఒకటి. ఆయనకు చదువుతో, నాకు అనుభవంతో వచ్చిన అభిప్రాయం అది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుతో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చేసే బాధ్యత నాది. దక్షిణ కొరియాలో ఇంత కన్నా కలు­షిత నదిని అభివృద్ధి అక్కడే లేక్, నైట్‌ ఎకానమీ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో నదీ పరివాహక ఎకానమీ ఉన్న నగరాలు అభివృద్ధి పథంలో నడిచాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఓ వేదిక పైకి రావాల్సిన సమయం ఇది? మొత్తం 55 కి.మీ. మూసీ అభివృద్ధి పనుల్లో 21 కి.మీ పనులు త్వరలోనే ప్రారంభించబోతున్నాం. 

అప్పట్లో నాగార్జున మనసుకు కష్టం, నష్టం 
తమ్మిడికుంట అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. చిరకాలంగా పరిచయం ఉన్న నాగార్జున, ఇతర మిత్రుల మనసుకు కష్టం, మరికొంత నష్టం కలిగి ఉండొచ్చు. ఓ మంచి కార్యక్రమంతో కొందరికి నష్టం జరిగినా కొన్ని తరాలకు మేలు జరుగుతుంది. అందుకే కేవలం 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను 30 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేశాం. నాగార్జున పెద్ద మనసుతో అర్థం చేసుకుని ముందుకు వచ్చి దాదాపు రెండు ఎకరాలను ఉదారంగా ఇచ్చారు. అందుకే ఆయన సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరో అని అసెంబ్లీలో చెప్పా. ఈ చెరువు ప్రారంభానికి ఆహ్వానిస్తే ఆయన షూటింగ్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు. నాగార్జున నిజమైన హైదరాబాదీ. ఈ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది..’అని సీఎం అన్నారు.  

అనేక కారణాలతో సగం చెరువులు మాయం 
‘హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తో పాటు ఔటర్‌ లోపల 1,372 చెరువులు ఉండాల్సి ఉండగా... ప్రభుత్వ నిర్లక్ష్యం, కొందరి జీవనాధారం కోసం, మరికొందరు చెరబట్టడంతో 50 శాతం కనుమరుగయ్యాయి. అందుకే చిన్న వర్షానికే నగర రోడ్లపై వరద ముంచెత్తి గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. వర్షాలు, వరదల సమయంలో నీరు చేరాల్సిన ప్రాంతాలను మనం ఆక్రమిస్తే.. ఆ నీరు మన జీవితాన్ని ఆక్రమిస్తోంది. వర్షాలు, వరదలు నగరానికి కొత్త కాదు. 1908లో వచ్చిన వరదల్లో వేలాది మంది చనిపోతే నిజాం నవాబు చలించిపోయారు. జంట జలాశయాల నిర్మాణానికి పూనుకున్నారు. 

ఇప్పుడు ఉత్తరాదిలో సబర్మతి, గంగా, యమునా నదుల్ని అభివృద్ధి చేసి రివర్‌ డెవలప్‌మెంట్‌ ఎకానమీ సృష్టించారు. న్యూయార్క్, లండన్‌ తదితర చోట్లా నదీ పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు. ఇది ఆనాడే గుర్తించిన నిజాం మూసీ పరివాహక ప్రాంతంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. మంచి ముత్యాలు, గాజులు మూసీ పక్కన చార్మినార్, చుడీబజార్‌లో దొరుకుతాయి. పత్తర్‌ఘట్టి, కబూతర్‌ఖాన, ఎంజే మార్కెట్‌ ఇవన్నీ మూసీ ఒడ్డునే ఉన్నాయి. అయితే కాలక్రమంలో ప్రజలకు వచ్చిన స్వేచ్ఛ, ప్రభుత్వాలకు తగ్గిన శ్రద్ధతో చెరువులు, నాలాలు కబ్జా అయ్యాయి. మూసీ కాలుష్యం నల్లగొండ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని వారికి శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే మూసీ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం. అయితే అది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం.  

ఏ ఒక్కరూ బిడ్డలకు మూసీ పేరు పెట్టుకోరు.. 
‘అనేక మంది తమ బిడ్డలకు గంగ, యమున, సరస్వతి నదుల పేర్లు పెట్టుకుంటారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి తన ముగ్గురు బిడ్డలకూ నదుల పేర్లే పెట్టుకున్నారు. కానీ ఒక్కరు కూడా మూసీ పేరు పెట్టుకోలేదు. ఎందుకంటే మూసీ మురికి కూపంగా మన కళ్ల ముందు కనిపిస్తుంది. అందుకే ప్రక్షాళన చేయాల్సిందే.. ఆక్రమణలకు గురైన చెరువులకు విముక్తి కల్పించాల్సిందే. ఇకపై మాదాపూర్‌లో శిల్పారామమే కాదు..తమ్మిడికుంట కూడా గుర్తుకు వస్తుంది. ఇకపై వర్క్‌ ఫ్రమ్‌ తమ్మిడికుంట జరగాలి.

 ఇక్కడ ఇందిర మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు స్టాల్స్‌ ఇవ్వండి. జమ్మి చెట్టు తెచ్చి పెట్టాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు సూచిస్తున్నా. దసరా సమయంలో ఇక్కడే అలయ్‌–బలయ్, సంక్రాంతికి కైట్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ చుట్టుపక్కల అనేక మంది రాజులు ఉన్నారంటూ ‘వాళ్లు కోళ్లు తెస్తారేమో..వాటిని కోసుకు తింటే అభ్యంతరం లేదు.. పందాలు వేస్తేనే ఇబ్బందులు వస్తాయి..’అని చమత్కరించారు.

సిటీ కోసం చేయాలి కదా అనుకున్నా: నాగార్జున 
నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ చెరువు విషయమై హైడ్రా కమిషనర్‌ను తొలిసారి కలిసినప్పుడు మనసులో ఏదో పెట్టుకుని కలిశా. అయితే ఆయన నన్ను కూర్చోబెట్టి పరిస్థితిని వివరించి ఒప్పించారు. అప్పుడు సిటీ కోసం ఇది కదా చేయాల్సింది అని నిర్ణయించుకున్నా. ఇక్కడ మనం శాశ్వతం కాదు. ఎప్పుడైనా పోవాల్సిందే అని కీలక నిర్ణయం తీసుకున్నా. రంగనాథ్‌ ఈ లేక్‌ను చాలా అందంగా చేశారు. సీఎంకు చెరువులు, నదులు అంటే చాలా ఇష్టం... వాటిని ఎలాగైనా పునరుజ్జీవింప చేయాలన్నదే ఆయన సంకల్పం. 

మూసీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికీ సీఎం నన్ను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నా..’అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా తమ్మిడికుంట వేదికగా ముఖ్యమంత్రి మల్లాపూర్, రామంతాపూర్‌ చెరువు అభివృద్ధిలో స్థలాలు కోల్పోయిన 34 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. నలుగురికి పట్టాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement