సేవా పథం
నేటి రోజుల్లో ‘సమాజానికి మన వంతుగా’ అని ఆలోచించే వారు ఎంతో అరుదు. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు శ్రీవారి భారతి. పండితుడైన తండ్రి నోటి నుంచి తెలుగు పద్యాలు, తెలుగు ప్రాభవం గురించి మాత్రమే వినలేదు. సేవాపథంలో పయనించడమనేది ఎంత గొప్ప విషయమో తరచుగా వినేవారు భారతి. ‘మన పరిధిలో–మన సమాజం కోసం’ అనేది ఆయన సిద్ధాంతం. నాన్న మాటల వెలుగులో సమాజానికి తనవంతుగా సేవచేస్తున్నారు భారతి.
తాజాగా... తండ్రి జ్ఞాపకార్థం రూ.22 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలో మూడు గదులతో భవనం నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని కాకతీయనగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సరిపడా గదులు లేక వరండాల్లో బోధన సాగేది. భారతి దాతృత్వంతో నిర్మితమైన మూడు గదుల భవనంతో సమస్య పరిష్కారమైంది.... సంస్కృతాంధ్ర పండితుడు, విశ్రాంత ఆచార్యుడు అమరేశం రాజేశ్వరశర్మ భారతి తండ్రి. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘నన్నెచోడుడి కవిత్వం–కుమార సంభవం’ అంశంపై పీహెచ్‌డీచేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, వివేకవర్థిని కళాశాల అధ్యాపకుడిగా, ఓయూ అనుబంధ కళాశాలల తెలుగు ఆచార్యుడిగా, తెలుగు శాఖాధిపతిగా, కాకతీయ విశ్వవిద్యాలయం డీన్‌గా సేవలందించారు. యూజీసీ ఎమిరేట్స్ ప్రొఫెసర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణతోపాటు విజయనగరం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో సంస్కృత కళాశాలలలో బోధించారు. ఎన్నో పుస్తకాలు రాశారు.
ఎన్నో కార్యక్రమాలు... కామారెడ్డి పట్టణంలో ప్రాచ్యకళాశాల ఏర్పాటులో కీలక భూమిక పోషించారు రాజేశ్వరశర్మ. ఎంతోమంది పేదపిల్లల చదువుకు తన వంతుగా సహాయం అందించారు. తండ్రి ఆశయాలను కొనసాగించడానికి ఆయన కూతురు భారతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్కారు బడులలో తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం నుంచి ఉపాధ్యాయులు లేని బడుల్లో తన సొంత డబ్బులతో వాలంటీర్లను ఏర్పాటు చేసి విద్యాబోధన చేయించడం వరకు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పేద విద్యార్థికి మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజును చెల్లించి అండగా నిలిచారు.
ఇదీ చదవండి: కళ్లలో చక్కెర కొడుతుంది జాగ్రత్త!!
ఆ బలమే వేరు!... సైంటిస్ట్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్‌తో భారతి వివాహం జరిగింది. వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.‘సేవా కార్యక్రమాలకు సంబంధించి కుటుంబ సభ్యులు అండగా ఉంటే ఆ బలమే వేరు. అందరూ ఒకేలా ఆలోచిస్తారని లేదు. సేవాకార్యక్రమాలు చేయడం కొందరికి డబ్బు వృథా చేయడంగా మాత్రమే అనిపించవచ్చు. మా ఆయన మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించలేదు. సేవాకార్యక్రమాలకు సంబంధించి ఎంతో అండగా ఉంటున్నారు. అది నా అదృష్టం’ అంటున్న భారతి భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు.
– ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
సేవతోనే జీవితం!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదపిల్లలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనేది నా లక్ష్యం. ‘ఎస్‌సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నా వంతుగా మా నాన్నగారి స్ఫూర్తితో కామారెడ్డిలో విద్యార్థులకు ఉపయోగపడేలా భవనం నిర్మించాను. ఎవరం ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్నాళ్లు మనతో అయ్యే మేలు చేయాలి. నాన్న చూపిన బాటలో నడుస్తున్నాను. ఆయన పేరు కలకాలం నిలవాలి. నా భర్త, సైంటిస్ట్ చంద్రశేఖర్‌తో కలిసి మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను.
– శ్రీవారి భారతి
ఇదీ చదవండి : తొలి బిడ్డను కోల్పోవడం తీరని విషాదం : సోనియా గాంధీ


