బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంలో సమర్థ వాదనలు వినిపించాలి
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించాలి
అసెంబ్లీ ఎన్నికల నాటికి కృష్ణా జలాల్లో గరిష్ట వాటాను సాధించాలి
నీటిపారుదల శాఖ, న్యాయ నిపుణులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట సమర్థంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీతో జల వివాదాలున్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సమర్పించాలని సూచించారు. వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి కృష్ణా జలాల పంపిణీ అంశం ఎంతో కీలకం కానుందని, సాధ్యమైనంత మేరకు గరిష్టంగా కృష్ణా
జలాలను సాధించడానికి గట్టిగా ప్రయత్నించాలని ఆదేశించారు.
మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి సీఎం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ట్రిబ్యునల్‌లో జరగనున్న విచారణలో తెలంగాణ తరఫున వినిపించాల్సిన వాదనలపై న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించారు.
చివరి దశకు తెలంగాణ వాదనలు
75 శాతం, 65 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఏపీకి కేటాయించిన మొత్తం 1,050 టీఎంసీల కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956లోని సెక్షన్– 3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతను గత శాసనసభ సాధారణ ఎన్నికలకు ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.
సెక్షన్–3 కింద ట్రిబ్యునల్‌లో ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వాదనలు ముగిశాయని, ఏపీ వాదనలను ఖండిస్తూ తెలంగాణ వినిపిస్తున్న ప్రతివాదనలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు, న్యాయనిపుణులు సీఎంకు వివరించారు. డిసెంబర్‌లోగా ప్రతివాదనలు ముగిసే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత సెక్షన్–3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సుప్రీంలో కేసు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోండి
సెక్షన్–3 కింద కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు సత్వరంగా కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని న్యాయనిపుణులను సీఎం ఆదేశించారు. సెక్షన్–3 కింద నీటి పంపకాలకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఆమోదిస్తే, ఏపీ పునరి్వభజన చట్టం–2014లోని సెక్షన్ 89 కింద రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మళ్లీ విచారణ జరపాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలియజేశారు.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,050 టీఎంసీల వాటాలో తెలంగాణకు 673 టీఎంసీలను (64%) కేటాయించాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని తెలియజేశారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ పాల్గొన్నారు.
ఏదుల నుంచి డిండికి..
డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని అందించాలని స్పష్టం చేశారు. ఈ రెండు పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
మళ్లీ కేంద్రానికి అదనపు టీఎంసీ డీపీఆర్
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను సీఎం హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నందున అదనపు టీఎంసీ పనుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. సీడబ్ల్యూసీ నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతో పాటు డీపీఆర్ సిద్ధం చేసి మరోసారి కేంద్రానికి సమర్పించాలని ఆదేశించారు.


