జరూసలేం: వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రోన్ ప్రాంతంలో జరిగిన ఒక కాల్పుల ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)భద్రతా బలగాలతో కలిసి ఆ ప్రాంతంలో పరిమిత ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు 'ది ట్రిబ్యూన్' తెలిపింది. ఉగ్రవాదులు తలదాచుకున్న స్థావరాల నుంచి ఈ దాడులు జరగడంతో, ఐడీఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో నిఘా పెంచి, ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను ఏరివేసేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హెబ్రోన్‌లో పర్యటించి, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంపై పూర్తి లాక్‌డౌన్‌కు ఆదేశించారు. ఎన్నికల వేళ శత్రువులు తమ పౌరులపై, సైనికులపై దాడులకు తెగబడుతున్నారని, అయితే సైనికులు వాటిని ధైర్యంగా తిప్పికొట్టి, ఉగ్రవాదులను మట్టుబెట్టారని ఆయన తెలిపారు. శరణార్థుల శిబిరాలలో తాము ఉపయోగించిన విజయవంతమైన వ్యూహాత్మక మోడల్‌ను ఇప్పుడు హెబ్రోన్‌లోని ఆ ప్రాంతంలోనూ అమలు చేసి, ఇంటింటి గాలింపు ద్వారా ఉగ్రవాద మూలాలను పూర్తిగా తుడిచిపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చామని, మిగతా వారి కోసం వేట కొనసాగుతోందని ఐడీఎఫ్ వెల్లడించింది. అలాగే ఆ ప్రాంత నివాసితులు బయటకు వెళ్లడానికి వీలుగా మూడు ప్రత్యేక నిష్క్రమణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, క్షుణ్ణంగా భద్రతా స్క్రీనింగ్, విచారణ చేపట్టిన తర్వాతే అనుమతిస్తామని పేర్కొంది.
ఇదీ చదవండి: ‘దుస్తుల కన్నా సేవలు మిన్న’.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోల్స్


