లీగల్
నేనొక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. సంవత్సర కాలంగా, మా ప్రాజెక్ట్ హెడ్ నుండి అసభ్యమైన కామెంట్స్, అనుచితంగా తాకడం, ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్దామా అనే ప్రపోజల్స్ ఎక్కువయ్యాయి. అతని ఉద్దేశ్యం నాకు స్పష్టంగా అర్థమైంది. అది నాకు చాలా ఇబ్బందిగానూ, అభ్యంతరకరంగానూ ఉందని చెప్పడంతో కొంతకాలం నార్మల్‌గా ఉన్నాడు. మళ్లీ విజృంభించి వాట్సాప్ మెసేజెస్ పెట్టడం మొదలుపెట్టాడు. స్నేహితుల సలహా మేరకు మా హెచ్.ఆర్. మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. మెసేజెస్, స్క్రీన్ షాట్స్ కూడా ఇచ్చాను. మా బ్రాంచ్ మేనేజర్‌కు కూడా కాపీ పెట్టాను. అయితే ఆరు నెలలు గడిచినా, నా ఫిర్యాదుపై యాక్షన్ ఏమీ తీసుకోలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఉద్యోగం మానేయాలన్నంత మానసిక వేదనగా ఉంది. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.
– ఒక సోదరి, హైదరాబాద్
మీరు చేసిన ఫిర్యాదు సహా ‘పనిప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం, 2013’ ప్రకారమే నడుచుకున్నారు. సదరు చట్టానికి అనుబంధంగా రూపొందిన రూల్ 7 ప్రకారం, ఫిర్యాదుతోపాటే ఆధారాలను, సాక్షుల వివరాలను కూడా సమర్పించవలసి ఉంటుంది. మీరు చాలావరకు ఆ నిబంధనను పాటించినట్లు అర్థమవుతోంది. అయితే, కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలోనే ఖచ్చితత్వం అవసరం. ఏ చట్టం ప్రకారం, అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పనిప్రదేశాలలో, ఎక్కడైతే పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారో అక్కడ లైంగిక వేధింపుల నుంచి మహిళల రక్షణ కోసం ఒక అంతర్గత ఫిర్యాదు కమిటీ / ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చర్యలు చేపట్టేలా మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షించాలి. అయితే ఆచరణలో ఇది సక్రమంగా జరగడం లేదు. ఒక్క హైదరాబాద్‌లోనే వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఈ నిబంధనను పట్టించుకోకుండా ఉన్నాయనేది వాస్తవం.
మీరు రాసిన వివరాలను బట్టి, చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం మీ కార్యాలయంలో ఐసీసీ ఏర్పాటు చేశారా లేదా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఐసీసీ ఏర్పాటై ఉంటే, మీ ఫిర్యాదును నేరుగా ఆ కమిటీకి సమర్పించాలి. విచారణ కూడా ఆ కమిటీయే చేపట్టాలి. కాబట్టి, ముందుగా మీ కార్యాలయంలో ఐసీసీ ఉందో లేదో తెలుసుకోండి. ఉంటే, ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని ఐసీసీకి పంపి విచారణ కోరండి. ఒకవేళ మీ ఆఫీసులో ఐసీసీ లేకపోతే, సదరు చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం జిల్లా స్థాయిలో, కలెక్టర్ ఆదేశానుసారం ఏర్పడే లోకల్ కంప్లైంట్స్ కమిటీ (ఎల్ సీ సీ)కి ఫిర్యాదు చేయవచ్చు – చెయ్యాలి కూడా. ఒకవేళ విచారణలో సరైన న్యాయం జరగలేదని మీకు అనిపిస్తే, సంబంధిత లేబర్ కోర్టులో అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం, సదరు అప్పీళ్లను విచారించే అధికారాన్ని రాష్ట్రవ్యాపంగా ఎనిమిది లేబర్ కోర్టులకు అప్పగిస్తూ ఒక ఆదేశాన్ని జారీ చేసింది.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం
sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.


