డైనోసార్ల కంటే ముందే భూమిపై భారీ కీటకాలు సంచరించేవంటే నమ్మగలరా? సముద్రపు పక్షుల్లాగా భారీ పరిమాణంలో ఉండే తూనీగల్లాంటి జీవులు ఒకప్పుడు ఆకాశంలో విహరించేవి. అలాంటి రెండు భారీ కీటకాల శిలాజాలు ఏకంగా 500 మీటర్ల భూగర్భంలో బయటపడ్డాయి. దాదాపు 30 కోట్ల ఏళ్ల నాటి ఈ అరుదైన అవశేషాలు ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి.
ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్ ప్రాంతంలో ఉన్న బోల్సోవర్ బొగ్గు గనిలో 1979లో కార్మికులు వీటిని గుర్తించారు. ‘గ్రిఫిన్‌ఫ్లైస్’గా పిలిచే ఈ కీటకాలలో ఒకదాని రెక్కల వెడల్పు 17.4 సెంటీమీటర్లు కాగా.. మరొకటి సుమారు 50 సెంటీమీటర్లు ఉండేదని పరిశోధకులు అంచనా వేశారు.
కార్బోనిఫెరస్ కాలంలో అంటే 35.9 కోట్ల నుంచి 29.9 కోట్ల ఏళ్ల క్రితం ఇవి జీవించేవని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా చిత్తడి నేలలు, దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ భారీ కీటకాలు భయంకరమైన వేటగాళ్లని, ఎదురైన చిన్న జీవులను ఆహారంగా తీసుకునేవని నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది.
అప్పట్లో రెక్కల వెడల్పు 71 సెంటీమీటర్ల వరకు ఉండే తూనీగలతోపాటు.. రెండు మీటర్ల పొడవైన జెర్రులు, ఒక మీటరు పొడవైన బొద్దింకలు, తేళ్లు కూడా ఉండేవి. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి 35 శాతానికి చేరడంతో ఈ కీటకాలు ఇంత భారీగా పెరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. NOAA, NASA వంటి శాస్త్రీయ సంస్థల ప్రకారం.. ప్రస్తుతం వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21 మాత్రమే ఉంది.
కాలక్రమేణా పక్షులు కొత్త వేటగాళ్లుగా మారడంతో తూనీగల్లాంటి కీటకాలు చిన్నవిగా, వేగంగా కదిలేవిగా పరిణామం చెందాయి. కాగా.. ఈ రెండు శిలాజాలు మాత్రమే ఇప్పటివరకు ఆయా జాతులకు సంబంధించిన ఏకైక ఆధారాలుగా ఉన్నాయి. ప్రస్తుతం లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో వీటిని భద్రపరిచారు. ఇవి దెబ్బతింటే తిరిగి పొందడం వీలుకాదనే కారణంతో ప్రజల సందర్శనకు ప్రదర్శించడం లేదు.
ఈ అరుదైన ఆవిష్కరణకు గుర్తుగా బోల్సోవర్ పట్టణంలో భారీ తూనీగ శిల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పాఠశాల విద్యార్థులు 20 వారాలపాటు లోహపు పనులు, డిజైన్, వెల్డింగ్ నేర్చుకుని దీనిని రూపొందించారు. పట్టణంలోకి వచ్చే వారికి ఈ శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని స్థానిక కౌన్సిల్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంతరిక్షంలో శాండ్‌విచ్?


