ప్రత్యర్థిని బయటకు నెట్టడమే లక్ష్యం.. సుమో ఆట రూల్స్‌ ఇవే! | Japan Sumo Wrestling Tradition | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థిని బయటకు నెట్టడమే లక్ష్యం.. సుమో ఆట రూల్స్‌ ఇవే!

Nov 8 2026 12:11 PM | Updated on Nov 8 2026 12:48 PM

Japan Sumo Wrestling Tradition

ఫండే

అగడం బగడం

జపాన్‌ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సుమో కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత మతపరమైన ఆచారంగా మొదలైన ఈ క్రీడ కాలక్రమేణా వినోదాన్నిచ్చే పోటీ క్రీడగా మారింది. ఈ క్రీడలో బలమైన శరీరం మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఆచారాలు, సంప్రదాయాలు కూడా ప్రతిబింబిస్తుంటాయి. ప్రతి ఏడాది నవంబర్‌ మాసంలో 15 రోజుల పాటు ఉత్సాహంగాసాగే ఈ పోటీల్లో దేశంలోని అగ్రశ్రేణి సుమో క్రీడాకారులు సైతం బరిలోకి దిగి క్రీడాభిమానులకు కనువిందు చేస్తారు.

కఠినమైన శిక్షణ.. క్రమశిక్షణ.. సుమో మల్లయోధుల జీవితం కేవలం పోటీలకే పరిమితం కాదు. రోజువారీ శిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడం, ప్రత్యేక ఆహార నియమాలను పాటించడం వారి దినచర్యలో భాగం. సంప్రదాయ శిక్షణ కేంద్రాల్లో జీవిస్తూ, సాధన చేస్తూ క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారు. సుమోలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే శారీరక బలంతో పాటు పట్టుదల, సహనం కూడా అవసరం.

సుమో కుస్తీకి సుమారు 1,500 ఏళ్ల చరిత్ర ఉంది. తొలినాళ్లలో ఇది జపాన్‌ లోని షింటో మత సంప్రదాయాలతో ముడిపడి ఉండేది. కాలక్రమేణా ప్రజలు ‘చూసి ఆనందించే ఒక పోటీ క్రీడ’గా మారింది. జపాన్‌  జాతీయ క్రీడగానూ గుర్తింపు పొందింది. అయితే ఈ పోటీ ప్రారంభానికి ముందు చేసే ఆచారాల నుంచి విజేతను నిర్ణయించే విధానం వరకూ ప్రతీదీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ పోటీల్లో భాగంగా ఏడాదికి ఆరు ప్రధాన సుమో టోర్నమెంట్లు జరుగుతాయి. వాటిలో చివరిది నవంబర్‌లో ఫుకుఓకాలో నిర్వహించే క్యుషు సుమో టోర్నమెంట్‌. ఈ ఏడాదికి గానూ ఈ పోటీలు నవంబర్‌ 8 ప్రారంభమై 22 వరకు సాగుతాయి.

మట్టి వలయమే యుద్ధభూమి
సుమో పోటీల కోసం ప్రత్యేకంగా ఒక వృత్తాకార వేదికను ఏర్పాటు చేస్తారు. దీనిని ‘దోహ్యో మత్సురి’ అని పిలుస్తారు. ఈ వేదికను నిర్మించే బాధ్యత ‘యోబిదాశి’ అనే నిపుణులది. మట్టిని ప్రత్యేకంగా అమర్చి, చెక్క పనిముట్లతో గట్టిగా కొట్టి, గడ్డి కట్టలతో వలయాకారంలో సరిహద్దును రూపొందిస్తారు. ఈ పనిలో ఆధునిక నిర్మాణ పద్ధతుల కంటే సంప్రదాయ నైపుణ్యానికే ప్రాధాన్యం ఉంటుంది. ఇద్దరు మల్లయోధులు తలపడినపుడు ప్రత్యర్థిని బయటకు నెట్టడం లేదా, అతని పాదాలు కాకుండా ... శరీరంలోని మరేదైనా భాగం నేలను తాకేలా చేయడం ద్వారా గెలుపొందినట్టు భావిస్తారు.

ఆచారాలకూ ప్రాధాన్యం
అయితే ఈ పోటీల్లో పోరాటమే కాదు, ఆచారాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మల్లయోధులు బరిలోకి దిగేముందు ఉప్పు చల్లుతారు. ఇది వేదికను శుద్ధి చేయడానికి, చెడు శక్తులను దూరం చేయడానికి చేసే సంప్రదాయంగా భావిస్తారు. బియ్యం, ఉప్పు, ఎండిన చేపలు వంటి పవిత్ర నైవేద్యాలను వేదిక మధ్యలో ఉంచుతారు. కాళ్లను బలంగా నేలపై మోపడం, చేతులు చరచడం వంటి వాటితో పోటీలను మొదలుపెడతారు.

లండన్‌లో తొలి సుమో పోటీ
సుమోకు జపాన్‌ లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. దీనికి ఒక ముఖ్య ఉదాహరణ 1991లో లండన్‌ లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో నిర్వహించిన సుమో టోర్నమెంట్‌. జపాన్‌  వెలుపల జరిగిన తొలి సుమో పోటీగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్టోబర్‌ 9 నుంచి 13 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 40 మంది మల్లయోధులు పాల్గొన్నారు.

క్షణాల పోరు.. తరతరాల వారసత్వం
సుమో కుస్తీని చూసేవారికి అది బలప్రదర్శనగా కనిపించవచ్చు. కానీ దాని వెనుక క్రమశిక్షణ, గౌరవం, ఆచారాలు, నిరంతర సాధన ఉన్నాయి. ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యమైనా, సంప్రదాయాలను గౌరవించడం కూడా ఈ క్రీడలో అంతర్భాగం. అందుకే సుమో కేవలం ఒక పోటీ కాదు.. జపాన్‌ చరిత్రను, సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేస్తున్న సజీవ వారసత్వం.
- రమా జంబుల

ఇదీ చదవండి: పైన రిమోట్‌... కింద కరెంట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement