breaking news
Japan culture
-
జపాన్ గుండె చప్పుడు
ఆసియా క్రీడల ఆరంభం సంబరం అద్భుతంగా సాగింది... తమ దేశ సంస్కృతి ప్రదర్శన మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలో తమ ఘనతను చూపిస్తూ జపాన్ ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా ప్రదర్శించింది. ప్రముఖ దర్శకుడు యుకిహికు సుసుమి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక కార్యక్రమం అన్ని రకాలుగా అలరించింది. రంగులు, హంగులతో మిరుమిట్లుగొలిపిన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. క్రీడల్లో పాల్గొంటున్న వేర్వేరు దేశాల ఆటగాళ్ల మధ్య బంధాన్ని చూపేలా ‘హృదయాన్ని’ నేపథ్యంగా ఎంచుకున్న నిర్వాహకులు కార్యక్రమం ఆసాంతం దాన్ని ప్రతిఫలిస్తూ వినూత్న తరహాలో వేడుకలను ప్రపంచం ముందు ఉంచడం విశేషం. శనివారం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైలైట్స్‌ను చూస్తే...అలా సాగింది... ప్రారంభోత్సవ కార్యక్రమం జపాన్ జాతీయగీతంతో మొదలైంది. ఆ తర్వాత ఆ దేశ రక్షణ దళానికి చెందిన సైనికులు జపాన్ జాతీయ పతాకాన్ని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ఐషీ రాష్ట్రంలో పర్యాటకపరంగా ఎంతో గుర్తింపు ఉన్న ‘నగోయా క్యాజిల్’ నమూనాను స్టేడియం మధ్యలో ప్రదర్శిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ వయోలినిస్ట్ టారో హకాసే తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించగా, నాలుగు భిన్నమైన రంగులతో 240 మంది డాన్సర్లు చేసిన ప్రత్యేక సంగీత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. జపాన్ చారితక్ర, సాంస్కృతిక ‘కబూకీ’ ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చంది. ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘ఐఎన్ఐ మ్యూజిక్ గ్రూప్’ కూడా తమ ప్రదర్శనతో అలరించింది. ఈ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్న 43 క్రీడాంశాలకు చెందిన ఆడియో విజువల్ షోను కూడా ప్రదర్శించారు. కుటుంబ సమేతంగా హాజరైన జపాన్ రాజు నరుహిటో అధికారికంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీ తదితరులు పాల్గొన్నారు.తండ్రీ కొడుకులు కలిసి... ఆసియా క్రీడల జ్యోతిని ఇద్దరు జపాన్ స్టార్ ఆటగాళ్లు కలిసి వెలిగించారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్ క్రీడల హ్యామర్ త్రోలో స్వర్ణం సాధించిన మురోఫుషు కోజి, అతని తండ్రి షిగెనొబు కలిసి ఈ లాంఛనం పూర్తి చేశారు. షిగెనొబు కూడా హ్యామర్త్రోలనే ఆసియా క్రీడల్లో ఐదు స్వర్ణాలు గెలుచుకున్నాడు. 46 జట్ల పరేడ్... ప్రారంభోత్సవంలో జరిగిన మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 45 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. వీటితో పాటు నలుగురు సభ్యుల ఆసియా రెఫ్యూజీ టీమ్ కూడా పరేడ్‌లో భాగమైంది. ఆసియా క్రీడల్లో రెఫ్యూజీ జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. అక్షర క్రమంలో అఫ్గానిస్తాన్ జట్టు అందరికంటే ముందుగా రాగా, సంప్రదాయాన్ని అనుసరించి ఆతిథ్య జట్టు జపాన్ అన్నింటికంటే ఆఖరిగా వచి్చంది. జపాన్ తరఫున 900 మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటుండటం విశేషం. అంతా హృదయమయం...ఆసియా క్రీడల థీమ్ హార్మోనిక్ ‘హార్ట్’ బీట్... వేదికపై పెద్ద సైజులో ‘హార్ట్’ నమూనా ఏర్పాటు...స్వాగత సంగీతం పేరు అవేకనింగ్ ఆఫ్ ద స్పేస్ అండ్ రెజొనేటింగ్ ‘హార్ట్’ బీట్... మార్చ్‌పాస్ట్‌లో వివిధ దేశాల పేర్ల ప్లకార్డ్‌లు కూడా ‘హార్ట్’ రూపంలోనే...సంగీత కచేరీ చేస్తున్న వయోలినిస్ట్ వేసుకున్న దుస్తులపై కూడా గుండె గుర్తులే... డ్రోన్ షోలో ఏంజెల్స్ రెక్కలూ అదే ఆకారంలో... ఇలా ఆసియా క్రీడల నిర్వాహక బృందం అన్ని చోట్లా హృదయాన్ని నింపేసింది. కబుకీ ప్రదర్శనలోనూ ‘హార్ట్’ బీట్ ఆఫ్ ట్రెడిషన్ అంటూ పరిచయం జరిగింది. ఆటగాళ్ల మధ్య అనుబంధం, ఏకత్వం, స్నేహం పెంపొందించడమే క్రీడల లక్ష్యమంటూ పదే పదే గుర్తు చేసేలా ఈ కార్యక్రమ రూపకల్పన జరగడం విశేషం.సాంకేతిక సత్తా చూపిస్తూ... ప్రఖ్యాత మోటో కార్ప్ కంపెనీ టయోటా ప్రధాన కార్యాలయం ఈ క్రీడలు జరుగుతున్న ఐషీ రాష్ట్రంలోనే ఉంది. అలాంటప్పుడు దాని ప్రాధాన్యతను గురించి చెప్పకపోతే ఎలా! క్రీడల నిర్వాహకులు కూడా అదే తరహాలో ఆలోచించారు. అందుకే ‘హార్మొనీ కనెక్టింగ్ టు ద ఫ్యూచర్’ పేరుతో తమ సాంకేతిక పురోగతిని ప్రదర్శించారు. ఐషీలో ఉన్న ఉత్పాదక కంపెనీలు, అవి తయారు చేసే వస్తువులువంటి అంశాలను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో, ఎప్పటికిప్పుడు కొత్త ఉత్పాదనలతో భవిష్యత్తు కోసం ఎలా తాము దూసుకు పోతున్నామో ఇందులో వివరించారు.మనూ, పవన్ పతాకధారులుగా...మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి యువ షూటర్ మనూ భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నీలం రంగు డిజైనర్ డ్రెస్‌లలో భారత అథ్లెట్లు మెరిశారు. బంద్గలాతో కూడిన ఆకర్షణీయమైన చీరలను మహిళా అథ్లెట్లు ధరించగా, అదే తరహాలో సిద్ధం చేసిన జోధ్‌పురి డ్రెస్‌లో పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. పతాకధారుల విషయంలో చివరి నిమిషంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మనూ భాకర్‌తో పాటు షాట్‌పుటర్ తజీందర్‌పాల్ సింగ్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాల్సి ఉండగా...అతని స్థానంలో పవన్ వచ్చాడు. ఓపెనింగ్ సెరెమనీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్ తజీందర్కు అందకపోవడంతో మార్పు తప్పలేదు. తజీందర్ మాత్రమే కాకుండా భారత అథ్లెటిక్స్ బృందంలో ఎవరికీ ప్రారంభోత్సవ కిట్ అందలేదు. దాంతో 75 మంది భారత ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు! -
విడాకుల గుడి ఉందని మీకు తెలుసా?.. ఇంతకీ ఎక్కడ ఉందంటే?
కోరిన కోర్కెలు నెరవేర్చే దేవాలయాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. ఇటువంటి దేవాలయాలకు జనం పోటెత్తడాన్ని కూడా చూసేవుంటాం. అయితే విడాకుల దేవాలయాన్ని ఎప్పుడూ చూసివుండం. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి భక్తులు ఎందుకు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన మాస్తుగావోకా టోకీజీ ఆలయం జపాన్‌లో ఎంతో పేరొందిన దేవాలయం. ఈ ఆలయానికి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం సాధికారత, నవీనీకరణల సందేశాన్ని అందిస్తుంది. ఈ దేవాలయాన్ని డైవర్స్ టెంపుల్ అంటే విడాకుల దేవాలయం అని అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే.. 1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్ షిదో-నీ నిర్మించిన ఈ ఆలయం ప్రముఖ బౌద్ధ మందిరంగా విలసిల్లుతోంది. మొదట్లో ఈ ఆలయంలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ అందించేవారు. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది. వారికి సమాజంలో ఎటువంటి అధికారాలు ఉండేవికాదు. దీనికితోడు వారిపై పలు సామాజిక కట్టుబాట్లు విధించేవారు. అటువంటి పరిస్థితుల మధ్య మహిళలు గృహ హింసకు గురయ్యేవారు. దీంతో వారు ప్రశాంతత కోసం ఈ మందిరానికి వస్తుండేవారు. ఆ రోజుల్లో పలు సామాజిక వర్గాలలో పెళ్లిళ్లి పెటాకులవుతుండేవి. విడాకుల వ్యవహారాలు కూడా విరివిగా జరిగేవి. ఇటువంటి సమయంలో ఒంటరి మహిళలు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతుండేవారు. ఇటువంటి మహిళలకు ఇక్కడ విడాకుల ధృవపత్రాలను అందించేవారు. ఈ పత్రాలు ఒంటరి మహిళలకు స్వేచ్ఛగా ఉండే హక్కును ప్రసాదించేవి. In Japan, visitors can write their divorce wishes & flush them down the toilet in the Mantokuji Temple. #movingon pic.twitter.com/ohwCsEz8FA— BBL Divorce Finance (@BBLChurchill) July 23, 2014 టోకీజీ మందిరంలో ఒక సంగ్రహాలయం కూడా ఉంది. దీనిలో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రతో ముడిపడిన కళాకృతులు కొలువుదీరి ఉన్నాయి. నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే పలు ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. దీనికి తోడు ఇది ఒక బౌద్ధమందిరంగానూ పేరొందింది. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ ఆలయంలోని బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు. పచ్చని ప్రకృతి శోయగాల నడుమ ఉన్న ఈ ఆలయం ప్రశాంతతను ప్రసాదిస్తుందని చెబుతుంటారు. కలపతో రూపొందించిన అనేక కళా కృతులు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఆలయ ద్వారంవైపు ముందుకు సాగేవారికి రాతితో కూడిన రహదారి మార్గం స్వాగతం పలుకుతుంది. ఆలయంలోని పెద్ద హాలులో ధార్మిక సమావేశాలు, ధ్యాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. More Than Just a “Divorce Temple”http://t.co/izUFwFRXuT#Tokeiji #Japan pic.twitter.com/5rDwXus1r4— IGNITION (@ignition_co) July 14, 2015 ఇది కూడా చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షలు అందుకోండి! -
అదృష్ట ఆలయం!
విహారం దేశాలకు రాజధాని ఉండడం తెలుసు, రాష్ట్రాలకు రాజధాని ఉండడం తెలుసు. మరి బొమ్మలకు రాజధాని ఉంటుందనే విషయం తెలుసా? టకసాకి సిటీ గురించి తెలిసినవాళ్లు ‘ఉంటుంది’ అంటారు. జపాన్‌లోని క్యోటోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టకసాకీని ‘దరుమా బొమ్మల రాజధాని’ అని పిలుస్తారు. ఈ సిటీలో ఉన్న షోరింజన్ దరుమా ఆలయంలో దరుమ బొమ్మలను ఉంచితే ‘అదృష్టం’ వరిస్తుందనే బలమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం నిన్నా మొన్నటిది కాదు... కొన్ని శతాబ్దాల నాటిది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు రకరకాల ఆకారాల్లో ఉన్న దరుమా బొమ్మలను ఈ ఆలయంలో పెడతారు. జపాన్ సంస్కృతిలో బొమ్మలు వినోదానికి మాత్రమే కాదు... రకరకాల సెంటిమెంట్లకు ప్రాముఖ్యం పొందాయి. వీటిలో ముఖ్యమైనవి... కోకేషి, హకట, దరుమా బొమ్మలు. చెక్కతో తయారు చేసిన కోకెషి, మట్టితో తయారుచేసిన హకటల కంటే ఎరుపురంగు దరుమా బొమ్మలపై ఎక్కువ సెంటిమెంట్ ఉంది. ఈ బొమ్మలపై తమ కోరికను రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కోరిక ఫలిస్తే మరో బొమ్మను కూడా ఇదే ఆలయంలో పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరాంతంలో ఇలా పోగైన బొమ్మలను గుట్టలుగా పేర్చి కాల్చి వేస్తారు. కాల్చే ముందు ఆ బొమ్మలకు కృతజ్ఞత తెలియజేస్తారు. ఈ తంతుని ‘దరుమ క్యో’ అంటారు. టకసాకిలో ఇతర పర్యాటక ఆకర్షణలు లేకపోలేదు. 1597లో నిర్మించిన టకసాకి క్యాజిల్ చరిత్రను కళ్ల ముందు ఉంచుతుంది. టకసాకి స్టేషన్ నుంచి 90 నిమిషాలు ప్రయాణిస్తే హరున సరస్సు కనిపిస్తుంది. దీన్ని ఆనుకొని ఉంటుంది మౌంట్ హరున. ఆ సరస్సు, ఈ పర్వతాల సౌందర్యం ఒక ఛాయా చిత్రాన్ని తలపి స్తుంది. జపాన్ చక్రవర్తి యోమై సమాధిని కూడా ఎక్కువ మంది సందర్శిస్తారు. మినోవా క్యాజిల్, ‘ద మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్’... మొదలైనవి కూడా పర్యాటక ప్రాముఖ్యాన్ని సంతరించు కున్నప్పటికీ వీటన్నికంటే పర్యాటకులు షోరింజన్ దరుమా ఆలయానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దరుమా బొమ్మలను ‘ధర్మ బొమ్మలు’ అని కూడా పిలుస్తారు. ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి బోధిధర్మ చెప్పిన సిద్ధాంతాలకు, మనుషులు నమ్మే అదృష్టానికి ఈ బొమ్మలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెబుతారు. ఈ బొమ్మలు బోధిధర్మ ముఖాన్ని పోలి ఉంటాయి. బోధిధర్మ తొమ్మిదేళ్ల పాటు ఒక చెట్టు కింద ధ్యానం చేశాడని, నిద్ర రాకుండా కనురెప్పలను కోసుకున్నాడని... ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. బోధిధర్మ బొమ్మలకు, అదృష్టానికి ఉన్న సంబంధం గురించి వివరించే ప్రత్యేక కథలు లేనప్పటికీ... బోధిధర్మ పేరు మీద బొమ్మను పెడితే అదృష్టం వరిస్తుందనే నమ్మకం పెరిగిపోయింది. కొందరైతే అదృష్ట దురదృష్టాల గురించి చెప్పిన జెన్ కథలను కూడా ప్రస్తావిస్తుంటారు. ఉదా: ఒక రైతు దగ్గర ఒక బలహీనమైన గుర్రమొకటి ఉండేది. ఒకరోజు దాన్ని చూసి జాలి పడిన రైతు దానికి స్వేచ్ఛను ఇస్తూ అడవిలో వదిలి పెట్డాడు. ‘‘ఉన్న ఒక్క గుర్రాన్నీ వదులు కున్నావు... నీలాంటి దురదృష్టవంతుణ్ని మేం చూడలేదు’’ అన్నారు పొరుగువారు. అడవిలోకి వెళ్లిన గుర్రం వారం రోజుల తరువాత వెనక్కి వచ్చింది. వస్తూ వస్తూ తనతో పాటు పన్నెండు గట్టి గుర్రాలను తీసుకువచ్చింది. ‘‘నీలాంటి అదృష్టవం తుడు లేరు’’ అన్నారు. ఆ గుర్రాల్లో ఒక గుర్రం మీద స్వారీ చేయబోయి చేయి విరగొట్టుకున్నాడు రైతు కొడుకు. ‘దుర దృష్టం’ అన్నారు. ఆకస్మికంగా వచ్చిన యుద్దం కోసం రాజ్యంలోని యువకు లందరినీ సైన్యంలో చేర్చమని రాజు ఆజ్ఞాపించాడు. చేయి విరగడంతో రైతు కొడుక్కీ సైన్యంలో చేరే బాధ తప్పింది. ‘అదృష్టం’ అన్నారు పొరుగువాళ్లు. ఈ కథను ఉదహరిస్తూ ‘అదృష్ట దురదృష్టాలు అనేవి శాశ్వతం కానప్పుడు... అదృష్టం కోసం టకసాకికి వెళ్లడం దేనికి?’ అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. వారి ప్రశ్నలు, వాదనలు అందులోని హేతువు సంగతి ఎలా ఉన్నా.. షోరింజన్ అలయా నికి వెళితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకం పెరుగుతోందే తప్ప తరగట్లేదు.


