తేనెటీగలు, ఇతర కీటకాలను వేటాడే ఆసియా కందిరీగలు వేగంగా విస్తరిస్తున్నాయి. గుయెర్న్సీలో ఈ ఏడాది ఇప్పటివరకు 44 కందిరీగల గూళ్లను గుర్తించారు. గత ఏడాది నమోదైన 17 గూళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలకు పైగా పెరిగింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆసియా కందిరీగలు ఇతర కీటకాలపై దాడి చేసే ఆక్రమణ జాతి. ముఖ్యంగా తేనెటీగలకు ఇవి పెద్ద ముప్పుగా మారాయి. ఈ కందిరీగల ఆహారంలో 39 శాతం తేనెటీగలే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంఖ్య పెరిగితే స్థానిక జీవవైవిధ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
గుయెర్న్సీలో 2026 మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తం 44 గూళ్లలో.. చిన్న గూళ్లతోపాటు, వేలాది కందిరీగలు ఉండే భారీ గూళ్లను అధికారులు గుర్తించారు. 2025లో 17, 2024లో నాలుగు, 2023లో 19, 2022లో నాలుగు గూళ్లు మాత్రమే బయటపడ్డాయి. 2017లో తొలిసారిగా ఈ కందిరీగలు అక్కడ కనిపించగా.. గుర్తించిన గూళ్లను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి, పొడి రూపంలోని పురుగుమందుతో వాటిని తొలగిస్తున్నారు.
అయితే, వసంతకాలం రాగానే రాణిగా పిలవబడే ఆడ కందిరీగ నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చి గూడు కట్టడం ప్రారంభిస్తుంది.. మొదటగా 100 వరకు కందిరీగలు ఉండే చిన్న గూడును ఏర్పాటు చేసి, మిగతా కందిరీగలను పెంచుతుంది. ఆ తర్వాత చెట్లపై ఎత్తైన ప్రదేశాల్లో పాత గూడును సరిచేస్తూ పెద్ద గూడును నిర్మిస్తుంది. ఇలాంటి రెండవ గూళ్లలో ఏకంగా 5 వేల వరకు కందిరీగలు ఉండే అవకాశం ఉంది. పొదలు, కంచెలు, ఇంటి పైకప్పుల వంటి మనుషులు తరచూ తిరిగే ప్రాంతాల్లో గూళ్లు ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కీటకాలపై పరిశోధనలు చేసే నిపుణులు చెబుతున్నారు.
వీటి సంఖ్యను నియంత్రించేందుకు.. వసంతకాలంలోనే రాణి కందిరీగలను గుర్తించి నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తే జనావాసాల్లో అవి వాటి గూళ్లను ఏర్పాటు చేయకుండా అడ్డుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫాట్సియా జపోనికా, కామెలియా మొక్కల పూలపై ఈ కందిరీగలు కనిపించే అవకాశం ఉంది. దాంతో చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాలని, కందిరీగలు లేదా వాటి గూళ్లు కనిపిస్తే వెంటనే పర్యావరణ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అక్కడి స్థానిక ప్రజలకు, అలాగే ఈ మొక్కలు ఉన్నవారికి అధికారులు తగు సూచనలు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: బల్లి కాళ్లకు జిగురు ఉంటుందా? తోకను ఎందుకు తెంచుకుంటుంది?


