గంజాయి మత్తులోనే ఘాతుకం! | The real angle behind the attack on the Raptadu girl | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులోనే ఘాతుకం!

Nov 3 2026 5:34 AM | Updated on Nov 3 2026 5:34 AM

The real angle behind the attack on the Raptadu girl

రాప్తాడు బాలికపై దాడి వెనుక అసలు కోణం

నిందితుడు డుంబు అలియాస్‌ హేమంత్‌ మత్తు పదార్థాలకు బానిస 

వైద్య పరీక్షల్లో గంజాయి ఆనవాళ్లు గుర్తించారా.. లేదా? 

నిందితుడి కాళ్లల్లో ఒక్క బుల్లెట్‌ కూడా లభించ లేదా?

సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి బాలిక గోపికపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన ఘటనలో నిందితుడు డుంబు అలియాస్‌ హేమంత్‌ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడే సమయంలో అతను గంజాయి మత్తులో ఉన్నాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. నిందితుడు కొంత కాలంగా మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైనట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఘటనకు ముందు రాప్తాడు కూడలిలోని ఓ బెల్టుషాపులో మద్యం సేవించడంతో పాటు అక్కడే ఎలక్ట్రిక్‌ రంపం మిషన్‌ను ఆన్‌ చేసి పరిశీలించినట్లు సమాచారం. ఈ సమయంలో హోటల్‌ నిర్వాహకులు ఎందుకు మిషన్‌ ఆన్‌ చేస్తున్నావని ప్రశ్నిచగా.. అయ్యవారిపల్లిలో చెట్లు కోసేందుకు వెళ్తున్నానని, మిషన్‌ సరిగా పని చేస్తుందో లేదో చూసుకుంటున్నానని చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితుడి మత్తు అలవాట్లు, ఘటనకు ముందు అతని కదలికలపై పూర్తి స్థాయి విచారణ జరపాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

మత్తుకు బానిసై..
నిందితుడు హేమంత్‌ అనాథగా పెరిగాడు. చిల్లరగా తిరుగుతూ మద్యం, గంజాయి అలవాట్లకు బానిసయ్యాడని స్థానికంగా ప్రచారం సాగుతోంది. కొంతకాలం అయ్యవారిపల్లిలో తన సోదరి వద్ద ఉన్న అతను.. ఆ తర్వాత రాప్తాడులో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ సమయంలో నిత్యం మద్యం, గంజాయి మత్తులో ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల రాప్తాడు నుంచి అనంతపురం నగర శివారులోని టమాట మండీకి మకాం మార్చినట్లు సమాచారం. అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని టమాట మండీలో కూలి పనులకు వెళ్తుండేవాడు. వచ్చిన డబ్బుతో మత్తు పదార్థాలు కొనుగోలు చేసేవాడని తెలుస్తోంది.

వైద్య పరీక్షల్లో గంజాయి ఆనవాళ్లు గుర్తించారా? 
పాఠశాలలో దాడి అనంతరం నిందితుణ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు తిరగడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన హేమంత్‌ ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం బయటపడిందా? లేదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో అతను మత్తులో ఉన్నాడనే ప్రచారం నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? నిర్వహిస్తే వాటి ఫలితాలేమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించినా, గంజాయి ఆనవాళ్ల గురించి బయటకు వెల్లడించరని ఓ పోలీసు అధికారి తెలిపారు.

గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? సరఫరాదారులెవరు? 
నిందితుడు హేమంత్‌కు నిషేధిత మత్తు పదార్థం గంజాయి ఎక్కడి నుంచి అందింది? ఎవరు సరఫరా చేశారు? రాప్తాడు, అనంతపురం నగర శివార్లలో గంజాయి సరఫరా వ్యవస్థ సంగతేమిటి? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు వస్తున్నాయి. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. అతని శరీరంలో ఒక్క బుల్లెట్‌ కూడా లభించలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాల్పులు ఎక్కడ జరిగాయి? ఎన్ని బుల్లెట్లు తగిలాయి? వైద్య పరీక్షల్లో ఏమి తేలింది? అనే అంశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికేలా పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement