పుర పోలింగ్.. రాత్రికి రాత్రే పెరిగిన లక్షల ఓట్లు!
అధికారిక గణాంకాల్లో వ్యత్యాసాలే అసలైన రుజువులు
విశాఖలో ఒక్క రాత్రిలోనే 1,15,787 ఓట్లు అదనం
50.02 శాతంగా ప్రకటించిన ఓటింగ్.. తెల్లవారేసరికి 56.32 శాతానికి పెరుగుదల
ఒక్కో బూత్‌లో గంటకు 100కు పైగా ఓట్లు.. పలు మున్సిపాలిటీల్లో అసాధారణ పోలింగ్ వేగం!
చీమకుర్తిలో గంట వ్యవధిలోనే 1,390 ఓట్లు అదనం.. రాష్ట్రంలోనే అత్యధికంగా 84.36% పోలింగ్!
జమ్మలమడుగులో గంటకు ఒక్కో బూత్‌లో సగటున 122 ఓట్లు
అద్దంకిలో రెండు గంటల్లో 11,958 ఓట్లు.. ఒక్కో బూత్‌లో గంటకు సగటున 122 ఓట్లు!
ధర్మవరంలో రెండు గంటల్లోనే 30,157 ఓట్లు.. ఒక్కో బూత్‌లో గంటకు సగటున 112 ఓట్లు!
చిలకలూరిపేటలో 2 గంటల్లో 20,772 ఓట్లు.. ఒక్కో బూత్‌లో గంటకు సగటున 108 ఓట్లు!
గూడూరులో రెండు గంటల్లో 4,860 ఓట్లు.. ఒక్కో బూత్‌లో గంటకు సగటున 106 ఓట్లు!
పార్వతీపురంలో 2 గంటల్లో 13,042 ఓట్లు.. ఒక్కో బూత్‌లో గంటకు సగటున 104 ఓట్లు!
గంటకు 100 ఓట్లకు మించి పోలింగ్ ఎలా సాధ్యమైంది?
బూత్‌లవారీ గణాంకాలు, సీసీ కెమెరాల రికార్డులు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది.. కానీ అసలు ఓట్ల ఆట ఆ తర్వాతే మొదలైందా? పగలంతా పోలింగ్.. రాత్రంతా ఓట్ల పెరుగుదల! రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక గణాంకాలే ఎన్నికల నిర్వహణ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. విశాఖపట్నంలో ఒక్క రాత్రిలోనే 1.15 లక్షలకు పైగా ఓట్లు అదనం.. చీమకుర్తిలో గంటలోనే 6 శాతానికిపైగా పెరిగిన పోలింగ్.. జమ్మలమడుగు, అద్దంకి, ధర్మవరం, చిలకలూరిపేట, గూడూరు, పార్వతీపురంలలో ఒక్కో బూత్‌లో గంటకు 100 నుంచి 122 వరకు ఓట్లు!
పోలింగ్ ముగిసిన తర్వాత ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బూత్‌లలో గంటకు ఇంత వేగంగా ఓటింగ్ ఎలా సాధ్యమైంది? అధికారిక లెక్కల్లో ఇన్ని వైరుధ్యాలున్నా ఎన్నికల యంత్రాంగం ఎందుకు మౌనం వహిస్తోంది? ప్రజల ఓటు హక్కుకు భరోసా ఇవ్వాల్సిన ఎన్నికల వ్యవస్థే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మున్సిపల్ ఎన్నికల పేరుతో సాగిన ఈ ఓట్ల లెక్కల గందరగోళం ప్రజాస్వామ్య పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది! బూత్‌లవారీ గణాంకాలు, సీసీ కెమెరాల రికార్డులు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ నాయకులే కాదు ప్రజాస్వామిక వాదులంతా డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ గణాంకాల్లో ఇన్ని వ్యత్యాసాలేమిటి?
విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గణాంకాలు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలింగ్ ముగిసిన ఆదివారం సాయంత్రం 5 గంటలకు 9,19,367 ఓట్లు పోలైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజు రాత్రి 9.30 గంటలకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, నగర కమిషనర్ కేతన్ గార్గ్ నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో 9,45,915 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు వెల్లడించారు. అయితే, సోమవారం ఉదయం 9.30 గంటలకు తుది పోలింగ్ వివరాలంటూ నగర కమిషనర్ ప్రకటించిన గణాంకాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. విశాఖలో మొత్తం 10,35,154 మంది ఓటు వేసినట్టు వెల్లడించారు.

ఆదివారం అనంతపురంలో యథేచ్ఛగా దొంగఓట్లు వేస్తున్న టీడీపీ గూండాలు
ఈ మూడు ప్రకటనలను పరిశీలిస్తే అధికారిక గణాంకాల్లో భారీ వ్యత్యాసం స్పష్టమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన 9,19,367 ఓట్లతో పోలిస్తే, సోమవారం ఉదయం ప్రకటించిన తుది గణాంకాల్లో ఏకంగా 1,15,787 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. ఇక రాత్రి 9.30 గంటలకు కలెక్టర్ ప్రకటించిన అంచనా కంటే తుది గణాంకాల్లో మరో 89,239 ఓట్లు పెరిగాయి. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఓట్లు ఎలా పెరిగాయి? రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగం ప్రకటించిన గణాంకాల్లో ఇంతటి వ్యత్యాసానికి కారణమేంటి?
విశాఖలో రాత్రికి రాత్రే 6 శాతానికిపైగా పెరిగిన ఓటింగ్..!
విశాఖలో పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఓటింగ్ గణాంకాలు, రాత్రి సమయంలో జరిగిన పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ 50.02 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రకటించగా, సోమవారం తెల్లవారేసరికి అధికారులు ఏకంగా 56.32 శాతంగా తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించారు. అంటే ఒక్క రాత్రిలోనే 6.30 శాతం ఓటింగ్ పెరిగింది.

విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆదివారం రాత్రి 11 గంటలకు 9,19,367 ఓట్లు పోలైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాలు

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు 10,35,154 ఓట్లు పోలైనట్టు విశాఖ జిల్లా అధికారులు ప్రకటించిన గణాంకాలు
మరోవైపు, విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ ‘కూటమి ఓటింగే తక్కువగా ఉంది’ అంటూ పార్టీ శ్రేణులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోలింగ్ సరళిపై రాజకీయ వర్గాల్లో నెలకొన్న చర్చ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గెలుపు అంచనాలు పెరిగాయన్న అభిప్రాయాల నేపథ్యంలో రాత్రి వేళ పోలింగ్ పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జోక్యంతో స్థానిక టీడీపీ నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి సమయంలో భారీ రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నది వైఎస్సార్‌సీపీ ప్రధాన ఆరోపణ.
నిబంధనల ప్రకారం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయాల్సి ఉండగా, తమ ఏజెంట్లను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల అధికారులు చెప్పారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదివారం రాత్రే ఆరోపించారు. ‘మీరు వెళ్లండి.. మేం వేసుకుంటాం’ అంటూ అధికారులు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఒకవైపు పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ శాతంలో భారీ పెరుగుదల, మరోవైపు బ్యాలెట్ బాక్సుల సీలింగ్ ప్రక్రియపై అధికారుల తీరు.. విశాఖ ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఒక్కో బూత్‌లో గంటకు 122 ఓట్లు ఎలా సాధ్యం?
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ సాధ్యమే కాని వేగంతో సాగినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో గంటకు 80–100 మందికి మించి ఓటు వేయడం కష్టమనే అంచనాలు ఉండగా, కొన్ని మున్సిపాలిటీల్లో గంటకు 120కి పైగా ఓట్లు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అసాధారణ పోలింగ్ వేగం ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందేహాలకు తావిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో మొత్తం 38,441 మంది ఓటర్లు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఏకంగా 15,515 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం 64 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఈ ఓట్లను లెక్కిస్తే, ఒక్కో పోలింగ్ బూత్‌లో గంటకు సగటున 122 మంది ఓటు వేసినట్టు అవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా వెయ్యి మంది ఓటర్లను కేటాయించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పది గంటల పోలింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కో కేంద్రంలో గంటకు సగటున 100 ఓట్లకు మించి నమోదవడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు, జమ్మలమడుగులో మొత్తం 64 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కేవలం ఐదు కేంద్రాల్లోనే లోపల, బయట కలిపి 11 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం గమనార్హం. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అసాధారణ పోలింగ్ వేగానికి కారణమేంటి? ప్రతి కేంద్రంలో నమోదైన గంటలవారీ ఓటింగ్ వివరాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ రికార్డులను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ గణాంకాలపై సమగ్ర విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
అద్దంకిలోనూ అదే తీరు.. గంటకు 122 ఓట్లు ఎలా సాధ్యం?
ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలోనూ పోలింగ్ వేగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 31,895 మంది ఓటర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 49 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి 6,125 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సంఖ్య 18,083కు చేరింది. అంటే కేవలం రెండు గంటల వ్యవధిలోనే 11,958 ఓట్లు అదనంగా నమోదయ్యాయి.
మొత్తం 49 పోలింగ్ కేంద్రాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కో కేంద్రంలో గంటకు సగటున 122 మంది ఓటు వేసినట్టు లెక్క తేలుతోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గంటకు గరిష్టంగా 100 ఓట్ల వరకు మాత్రమే పోలింగ్ సాధ్యమన్న అంచనాల నేపథ్యంలో, అద్దంకిలోని అన్ని కేంద్రాల్లోనూ ఒకేసారి గంటకు సగటున 122 ఓట్లు ఎలా నమోదయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. జమ్మలమడుగు తరహాలోనే అద్దంకిలోనూ అధికారిక పోలింగ్ గణాంకాలు అసాధారణ వేగాన్ని చూపుతుండటం గమనార్హం.


ధర్మవరంలో రెండు గంటల్లో 30 వేలకుపైగా పోలింగ్!
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలోనూ పోలింగ్ గణాంకాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మొత్తం 1,06,250 మంది ఓటర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 134 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక గణాంకాల ప్రకారం ఉదయం 9 గంటల సమయానికి 8,473 ఓట్లు మాత్రమే పోలవగా, ఉదయం 11 గంటలకు ఆ సంఖ్య ఏకంగా 38,630కు చేరింది. అంటే కేవలం రెండు గంటల వ్యవధిలోనే 30,157 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. మొత్తం 134 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఈ ఓట్లను లెక్కిస్తే, ఒక్కో కేంద్రంలో గంటకు సగటున 112.5 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తేలుతోంది. ఇంత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎలా పోలయ్యాయి?
చిలకలూరిపేటలోనూ గంటకు 108 ఓట్లు!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలోనూ పోలింగ్ గణాంకాలు అసాధారణ వేగాన్ని చూపుతున్నాయి. మొత్తం 86,554 మంది ఓటర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఆదివారం 96 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉదయం 9 గంటలకు 6,059 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఉదయం 11 గంటలకు ఆ సంఖ్య ఏకంగా 26,831కు చేరింది. అంటే కేవలం రెండు గంటల వ్యవధిలోనే 20,772 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. మొత్తం 96 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తే, ఒక్కో కేంద్రంలో గంటకు సగటున 108 మంది ఓటు వేసినట్టు తేలుతోంది.
గూడూరులోనూ పోలింగ్ వేగంపై అనుమానాలు!
కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీలోనూ పోలింగ్ గణాంకాలు అనుమానాలకు తావిస్తున్నాయి. మొత్తం 17,665 మంది ఓటర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉదయం 9 గంటలకు కేవలం 1,500 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఉదయం 11 గంటలకు ఆ సంఖ్య 6,360కు చేరింది. అంటే కేవలం రెండు గంటల వ్యవధిలోనే 4,860 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. మొత్తం 23 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తే, ఒక్కో కేంద్రంలో గంటకు సగటున 105.7 మంది ఓటు వేసినట్టు తేలుతోంది.
పార్వతీపురంలోనూ రెండు గంటల్లో 13 వేలకుపైగా పోలింగ్!
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోనూ పోలింగ్ గణాంకాలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. మొత్తం 40,765 మంది ఓటర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 63 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉదయం 11 గంటలకు 4,950 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సంఖ్య 17,992కు చేరింది. అంటే కేవలం రెండు గంటల వ్యవధిలోనే 13,042 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. మొత్తం 63 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తే, ఒక్కో కేంద్రంలో గంటకు సగటున 103.5 మంది ఓటు వేసినట్టు తేలుతోంది.
ఓటమి భయంతో అడ్డదారులు తొక్కిన టీడీపీ..
రెండున్నరేళ్లకే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాస్వామ్యాన్నే పణంగా పెట్టింది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక ప్రజల ముందు నిలబడలేని టీడీపీ.. నామినేషన్ల అడ్డగింతలు, అభ్యర్థులపై బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసం, బూత్‌ల ఆక్రమణలు, ప్రత్యర్థి ఏజెంట్ల బహిష్కరణలు, రిగ్గింగ్‌తో ఎన్నికల ప్రక్రియను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించింది.
రాష్ట్రవ్యాప్తంగా 11,378 పోలింగ్ కేంద్రాలుంటే కేవలం 5,737 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మిగిలిన చోట్ల పర్యవేక్షణను పరిమితం చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత పలు మున్సిపాలిటీల్లో రాత్రికి రాత్రే పెరిగిన ఓట్ల సంఖ్యలు.. అధికారిక గణాంకాల్లో భారీ వ్యత్యాసాలు.. వెరసి ఎన్నికల పారదర్శకతనే ప్రశ్నార్థకం చేశాయి. ప్రజల ఓటుతో గెలవాల్సిన చోట అధికార బలంతో ఎన్నికల వ్యవస్థనే శాసించేందుకు టీడీపీ ప్రయత్నించింది.
22 వేల ఓటర్లున్న చీమకుర్తిలో రాత్రి వేళ 1,390 ఓట్లు అదనం
విశాఖపట్నం ఓటింగ్ గణాంకాల తరహాలోనే ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాలిటీలోనూ పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ శాతంలో భారీ వ్యత్యాసం నమోదైంది. మొత్తం 22,876 మంది ఓటర్లు ఉన్న ఈ చిన్న మున్సిపాలిటీలో రాత్రి 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం 78.28 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, గంట వ్యవధిలోనే అంటే అర్ధరాత్రి 12 గంటలకు ప్రకటించిన తుది గణాంకాల్లో ఓటింగ్ శాతం ఏకంగా 84.36కు చేరింది. కేవలం గంట వ్యవధిలోనే 6.08 శాతం పోలింగ్ పెరుగుదల నమోదైంది. ఓట్ల సంఖ్యలో చూస్తే ఏకంగా 1,390 ఓట్లు అదనంగా నమోదైనట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 84.36 శాతం పోలింగ్ నమోదైన మున్సిపాలిటీగా చీమకుర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మేము ఓటేయకపోయినా.. ఇంత పోలింగ్ శాతమెలా?
బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు 27వ వార్డు పరిధిలో రిగ్గింగ్ చేశారనే అనుమానాలున్నాయి. అధికార పార్టీల నేతలు పోలింగ్ బూత్‌లను చెరబట్టారు. ఓటర్లపై దౌర్జన్యం చేశారు. మా కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల చాలామంది ఓట్లు వేయలేదు. కానీ, పోలింగ్ డేటా ప్రకారం మా వార్డులో 27/1 కేంద్రంలో 80.53 శాతం, 27/2 కేంద్రంలో 81.92 % పోలింగ్ నమోదైంది. స్థానికంగా పలువురు ఓటు వేయలేదని చెబుతుంటే ఇంత అధికశాతం పోలింగ్ ఎలా నమోదైంది. – వెంకటరమణయ్య, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా


