సాక్షి, తాడేపల్లి: రేపు(మంగళవారం, నవంబర్ 3వ తేదీ) మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. కౌంటింగ్‌లో ప్రతీ ఓటును కాపాడుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో సోమవారం( నవంబర్ 2వ తేదీ) ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అధికార టీడీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు.
కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ పనితీరును పార్టీ ఏజెంట్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల సీల్స్, ఏజెంట్ల సంతకాలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఒక్క ఓటు కూడా తారుమారు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తుది ఫలితాలు ప్రకటించి, అవసరమైన పత్రాలపై సంతకాలు పూర్తయ్యే వరకు కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాలను విడిచి పెట్టకూడదని సూచించారు. అధికార పార్టీ ప్రలోభాలు, పోలీసుల ఒత్తిళ్లు, తప్పుడు కేసులు, ఘర్షణలకు చేసే ప్రయత్నాలను సంయమనంతో ఎదుర్కోవాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇక నవంబర్ 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సజ్జల కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసేలా ఎన్నికల అధికారులను కోరాలన్నారు. కేవలం గెలిచిన స్థానాలే కాకుండా, సాధించిన ఓట్లు, ఓట్ల శాతం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఓటు, ప్రతి వార్డు, ప్రతి డివిజన్ పార్టీకి అదనపు బలమని గుర్తించి, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఇదీ చదవండి: రాప్తాడు బాలికకు వైఎస్ జగన్ పరామర్శ


