బెంగళూరు: రాష్ట్రంలో విరివిగా పెరిగిపోయిన మత్తుపదార్థాలే అనంతపురం జిల్లా రాప్తాడు బాలిక ఘటనకు కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు.
ఈ క్రమంలోనే డాక్టర్లతో మాట్లాడిన వైఎస్ జగన్.. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘‘ఏకంగా రంపం తీసుకుని స్కూల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లల మీద దాడి చేశాడు. స్కూల్లో చదివే పిల్లల పరిస్థితి ఏంటి? ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో విచ్చలవిడిగా గంజాయి, బెల్టు షాపులు వెలిశాయి. పిల్లలకు వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఊరిలోనూ అవి విస‍్తృతంగా వ్యాపించాయి. వీటిని అరికట్టే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయినందుకు తలదించుకోవాలి. స్కూల్లోకి తెలియని వ్యక్తి రావడం.. రంపంతో కోయడం.. అతడు వచ్చినా కూడా ఎవరూ ఆపలేని పరిస్థితిని చూశాం’’ అని తెలిపారు.
రూ.50 లక్షలు ఇవ్వాలి..
కూటమి ప్రభుత్వం ఆ బాలిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ‘‘వైద్యానికి పూర్తిగా సాయం అందించాలి. ప్రభుత్వం నుంచి సాయం రాకుంటే వైఎస్సార్‌సీపీ వైద్యం చేయిస్తుంది. అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చాక ఆ బాలిక కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తుంది.
ఇదీ చదవండి: చంద్రబాబుకు ఎస్‌ఈసీ తొత్తుగా మారింది: వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ పార్టీకి సంబంధించిన ఆ బాలిక చిన్నాన్న.. మండల కన్వీనర్‌గా ఉన్నారు. ఇంత దారుణంగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. కాబట్టే అరాచకాలు జరుగుతున్నాయి. 15-16 నెలల్లో ఇది తొమ్మిదో ఘటన. ప్రతి గ్రామంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉంచుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. దేవుడి దయతో పాప రికవరీ అవుతుందని వైద్యులు చెప్పారు. మనసును కుదుటపర్చే విషయం ఇది’’ అని వైఎస్ జగన్ తెలిపారు.



