సాక్షి, ముంబై: ముంబైలో సీజేపీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) నిరసనల్లో పాల్గొన్నందుకు నటుడు ఇమ్రాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' (OCI) కార్డు కలిగిన వ్యక్తిగా, "దేశాన్ని విమర్శించే హక్కు మీకు లేదు" అని బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ క్షమాపణలు తెలిపారు.
'లీవ్ ఇండియా' నోటీసును సవాలు చేసిన ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు సోమవారం తీవ్రంగా మండి పడింది. కేవలం అఫిడవిట్ సరిపోదని పేర్కొన్న కోర్టు, బహిరంగ క్షమాపణ (Unconditional Apology) చెబుతూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇమ్రాన్ ఖాన్‌కు విదేశీయుల నమోదు ప్రాంతీయ కార్యాలయం (FRRO) జారీ చేసిన 'లీవ్ ఇండియా' (భారత్ వదిలి వెళ్లాలి) నోటీసుపై ఉన్న స్టేను డిసెంబర్ 7 వరకు పొడిగించింది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఇమ్రాన్ ఖాన్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఆయనను భారత పౌరులతో సమానంగా చూడలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి నిరసనల్లో పాల్గొనబోనని అంగీకరిస్తూ, ప్రమాణపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లేదా హామీ పత్రాన్ని సమర్పించాలని కోర్టు ఆయనను ఆదేశించింది.
అలాగే నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశంలో నివసిస్తున్న, ఎటువంటి నేర చరిత్ర లేని వ్యక్తికి 'లీవ్ ఇండియా నోటీసు' జారీ చేసే ముందు, కనీసం ఆయనకు తన వాదన వినిపించే అవకాశం కల్పించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కోర్టు కొన్నితీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓసీఐ కార్డ్ ఉన్న వ్యక్తులు ఇండియాలో నిరసనల్లో పాల్గొనడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లో భారతీయుడు ఇలాంటి పని చేస్తే మరుసటి ఫ్లైట్‌లోనే వెనక్కి పంపేస్తారంటూ ఘాటుగా స్పందించింది. ఇన్ని సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటున్నా ఏనాడూ నిరసనల్లో పాల్గొనని మీరు, ఇప్పుడే ఎందుకు పాల్గొన్నారు?" అని ప్రశ్నించింది. "మీరు అమెరికా పౌరులు. అక్కడికి వెళ్లి నిరసనలు చేయవచ్చు, ఓటు కూడా వేయవచ్చు. కానీ ఇక్కడ నిరసనలు తెలిపితే ఊరుకు నేది లేదు." అని హెచ్చరిస్తూనే, 'వసుధైవ కుటుంబకం' అనే సూత్రాన్నికోర్టు ప్రస్తావించింది.
ఇదీ చదవండి: ట్రంప్ టవర్‌పై ఆరోపణలు రూ. 7 కోట్ల ఫ్లాట్ కొంటే, నో లిఫ్ట్, నో కర్టెన్స్ !
ఇమ్రాన్ ఖాన్ వాదన: తను రెండేళ్లు తప్ప జీవితమంతా భారతదేశంలోనే గడిపానని, తన కుటుంబం, పిల్లలు, వృత్తిపరమైన పునాదులు ఇక్కడే ఉన్నాయని తెలిపాడు. భారతదేశంలోనే ఉండనివ్వాలని కోర్టును అభ్యర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపాడు. నిరసన నిర్వాహకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించాడు.
ఇదీ చదవండి: 15 లక్షల మంది, రూ. 1200 కోట్లు : డిజిటల్ యాప్ స్కాం సంచలనం
కాగా అక్టోబర్ 10న ముంబైలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. OCI నిబంధనలను, వీసా షరతులను ఉల్లంఘించారని బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఆరోపించారు. ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) ఆధారంగా, అక్టోబర్ 14న FRRO ఇమ్రాన్‌ఖాన్‌కు'లీవ్ ఇండియా నోటీసు' జారీ చేసింది.


