లక్నో: ఉత్తరప్రదేశ్ ఓటరు జాబితాలో పేర్ల నమోదులో జరిగిన పొరపాటు రాజకీయ వివాదానికి దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నలకు స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. దీంతో చివరకు వ్యాఖ్యల తీరు, భాషపై ఎన్నికల అధికారి కార్యాలయం క్షమాపణలు చెప్పింది. ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల ఓటరు జాబితాలో ‘రామ్‌హిత్ యాదవ్’ అనే పేరు ‘రామ్ నే యాదవ్ కో మారా’ (రామ్ యాదవ్‌ను కొట్టాడు) అని తప్పుగా నమోదైంది. ఈ పొరపాటుపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రశ్నించారు. రామ్ కేవలం యాదవ్‌నే ఎందుకు కొట్టాడు? సింగ్, పాఠక్, అస్తానా, శర్మ, రాయ్, బిష్ట్‌లను ఎందుకు కొట్టలేదు? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కంప్యూటర్ కుల వివక్షతో పనిచేస్తోందా? ఒక రాజకీయ పార్టీ ఎజెండాను అమలు చేస్తున్నారా? అని నిలదీశారు.
సంజయ్ సింగ్ ప్రశ్నలకు స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా కార్యాలయం మరో ఉదాహరణను ప్రస్తావించింది. ఓటరు జాబితాలో రవి శర్మ తండ్రి పేరును ‘రామ్ నే శర్మా కో మారా’ (రామ్ శర్మను కొట్టాడు) అని తప్పుగా నమోదు చేసినట్లు పేర్కొంది. కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌కు కుల వివక్ష ఉండదని, పొరపాటు జరిగిందని అంగీకరిస్తున్నప్పటికీ ఇందులో కుల వివక్ష లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
ఈ వివాదానికి సంబంధించిన పోస్టులో ‘రామ్ ఒక మైనారిటీ వ్యక్తిని చంపినట్లు ఎంట్రీ వచ్చి ఉంటే, మతతత్వంతో పాటు కులతత్వ ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. అదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అనే అర్థం వచ్చేలా యూపీ ఎన్నికల అధికారి కార్యాలయం వ్యాఖ్యానించింది. ఈ వ్యంగ్య వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. ఓటరు జాబితాలో జరిగిన తప్పును వివరిస్తూ చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన అంశాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.
వివాదం తీవ్రం కావడంతో మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తన వ్యాఖ్యల భాష, ధోరణిపై క్షమాపణలు తెలిపింది. ఓటరు జాబితాలో తప్పుగా నమోదైన పేరుపై మొదలైన వివాదం.. కుల వివక్ష, మతపరమైన వ్యాఖ్యల వరకు వెళ్లి చివరకు ఎన్నికల అధికారి కార్యాలయం క్షమాపణలు చెప్పే పరిస్థితికి దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


