హోటల్ లీజు వివాదం.. ఐదుగురి హత్య! | Lease dispute shooting that left 5 people dead in Guwahati | Sakshi
Sakshi News home page

హోటల్ లీజు వివాదం.. ఐదుగురి హత్య!

Oct 27 2026 12:25 PM | Updated on Oct 27 2026 1:19 PM

Lease dispute shooting that left 5 people dead in Guwahati

గౌహతి: అసోం రాజధాని గౌహతిలో దారుణం చోటుచేసుకుంది. హోటల్ లీజు విషయంలో తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె కుమారుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఘనకాంత గొగోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

లీజు వివాదమే కారణమా?
గౌహతిలోని బోరా సర్వీస్ ప్రాంతంలో ఉన్న హోటల్ బిలాస్ ఇన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో ఆరుగురిపై నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీస్ కమిషనర్ పార్థ సారథి మహంత తెలిపారు. తొలుత నలుగురి మృతదేహాలను గుర్తించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. ప్రస్తుతం ఒకరు చికిత్స పొందుతున్నారు.

హోటల్ యజమాని కుటుంబమే లక్ష్యంగా..
హోటల్ యజమాని హెలెనా భరాలి, ఆమె కుమారుడు దేబర్షి కశ్యప్, ఆమె అన్న భుదేబ్ భరాలి కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. నయన్ దాస్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. సత్యేంద్ర పాఠక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ హోటల్‌లో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఏడాది క్రితమే హోటల్ లీజు..
హెలెనా భరాలి కుటుంబానికి చెందిన హోటల్‌ను ఘనకాంత గొగోయ్ ఏడాది క్రితం లీజుకు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాల్పులకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి కాల్పులకు ఉపయోగించినట్లు భావిస్తున్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాన్ని వినియోగించిన పరిస్థితులు, ఘటనకు దారితీసిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ లైంగిక నేరాల్లో ట్రంప్‌ పాత్ర?.. 50 పేజీల నివేదికతో ప్రకంపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement