రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ వివాహితను రిసార్ట్స్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ పి.కిరణ్ తెలిపిన మేరకు.. మల్లాపూర్‌కు చెందిన ఓ మహిళ (30) భర్తతో విడిపోయి టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన జగన్‌మోహన్ మోత్కూరు మున్సిపాలిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతడితో మహిళకు 4 నెలల క్రితం ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. తాను భువనగిరి మేనేజర్‌గా పని చేస్తానని, రూ.5 లక్షలు ఇస్తే మున్సిపల్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె సోమవారం రూ.4.5 లక్షలు సిద్ధం చేసుకోగా, జగన్‌మోహన్ కారులో వెళ్లి మల్లాపూర్‌లో ఎక్కించుకుని భువనగిరికి బయలుదేరారు. ప్రయాణించే సమయంలోనే డబ్బు తీసుకొని కారులో భద్రపరుచుకున్నాడు. భువనగిరికి వెళ్లకుండా ఎదులాబాద్ డివిజన్ అవుషాపూర్ వద్ద శ్రీనిధి రిసార్ట్స్‌లోకి కారును మళ్లించగా బాధితురాలు అనుమానంతో ప్రశ్నించింది.
డబ్బులు తీసుకునే అధికారి రిసార్ట్స్‌లో ఉన్నాడని బదులిచ్చాడు. లోపలికి వెళ్లిన అనంతరం రిసార్ట్స్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అధికారిని కలుద్దామని ఆమె కోరడంతో కారులో ఎక్కించుకుని ఆమె ముఖంపై చేతులతో దాడి చేసి బయటకు తోసేసి వెళ్లిపోయాడు. బాధితురాలు 100కు డయల్ చేయగా ఘట్‌కేసర్ పోలీసులు వచ్చి భరోసా కేంద్రానికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగన్‌మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


