అక్టోబర్ 29 వ తేదీ నుండి ప్రారంభం
రోజుకు 80,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తుల శుభవార్త.. ఈ ఏడాది మండల-మకరవిళక్కు యాత్రకు సంబంధించిన వర్చువల్ క్యూ స్లాట్ బుకింగ్స్ అక్టోబర్ 29 ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తిగా ఉచితం. యాత్రికుల అధికారిక వెబ్ సైట్ sabarimalaonline.org ద్వారా భక్తులు తమ దర్శన స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. సోమవారం జరిగిన ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (TDB) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.
నిళక్కల్-పంబ మార్గంలో రోజుకు 80 వేల మందికి వర్చువల్ క్యూ టికెట్లు అందుబాటులో ఉంటాయి. యాత్రా కాలంలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు చాలా పరిమితంగా ఉంటాయని అధికారులు తెలియజేశారు. అలాగే వర్చువల్ క్యూ రిజర్వేషన్లు చేసుకోకుండా వచ్చే యాత్రికులందరికీ చోటు కల్పించడం సాధ్యం కాకపోవచ్చని స్పష్టం చేశారు. ఇలా బుకింగ్ లు లేకుండా ప్రయాణించే భక్తులు దర్శనం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఎక్కువసేపు వేచి ఉండవలసి రావచ్చని వెల్లడించారు. అందువల్ల యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తమ వర్చువల్ క్యూ స్లాట్లను నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి ప్రయాణించే వారు, తమకు కేటాయించిన దర్శన సమయ స్లాట్లలోపు శబరిమలకు చేరుకునేలా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రత్యేకంగా కోరారు. సురక్షితమైన, క్రమబద్ధమైన యాత్రా కాలాన్ని నిర్ధారించడానికి భక్తులందరూ బుకింగ్ విధానాన్ని పాటించాలని అధికారులు భక్తులకు సూచించారు.


