అయ్యప్ప భక్తులకు అలర్ట్‌.. శబరిమలలో కొత్త రూల్స్‌! | Sabarimala Room Booking Likely Only for Devotees with Darshan Tickets | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తులకు అలర్ట్‌.. శబరిమలలో కొత్త రూల్స్‌!

Oct 21 2026 10:48 AM | Updated on Oct 21 2026 10:55 AM

Sabarimala Room Booking Likely Only for Devotees with Darshan Tickets

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శబరిమలలో ఆన్‌లైన్‌ గదుల బుకింగ్‌ విధానంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు సిద్ధమవుతోంది. ఇకపై ముందస్తుగా దర్శనం బుక్‌ చేసుకున్న భక్తులకే వసతి గదులు కేటాయించేలా మార్పులు చేయాలని యోచిస్తోంది. గదుల బుకింగ్‌లో ఏజెన్సీలు, దళారుల జోక్యాన్ని అరికట్టి.. సామాన్య భక్తులకు వసతి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది.

శబరిమల సన్నిధానంలో గదుల కేటాయింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేవస్వం విజిలెన్స్‌ విభాగం విచారణ ప్రారంభించింది. తులా మాస పూజల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన 400 గదులను ఏజెన్సీలే బుక్‌ చేసుకున్నాయన్న ఆరోపణలు ఈ పరిణామాలకు కారణమయ్యాయి. బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే గదులన్నీ ఖాళీ కావడంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో ఒకరు తమ అవసరానికి మించి ఒకటి కంటే ఎక్కువ గదులను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది భక్తులకు గదులు దొరకడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు బుకింగ్‌ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు బోర్డు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది.

దర్శనం బుకింగ్‌ ఉంటేనే వసతి
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్‌లో అయ్యప్ప స్వామి దర్శనాన్ని ముందుగానే బుక్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే గదులు కేటాయించనున్నారు. గదుల బుకింగ్‌ సమయంలో సంబంధిత భక్తుడి మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) పంపించి ధ్రువీకరించే విధానాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ఇతరుల పేర్లతో గదులు బుక్‌ చేయడం, పెద్ద సంఖ్యలో గదులను ముందుగానే స్వాధీనం చేసుకోవడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ మార్పులకు సంబంధించిన సిఫార్సులతో కూడిన నివేదికను శబరిమల ప్రత్యేక కమిషనర్‌ త్వరలో కేరళ హైకోర్టుకు సమర్పించనున్నారు. తదుపరి నిర్ణయాలు, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాత కొత్త విధానం అమలుపై స్పష్టత రానుంది. కాగా, శబరిమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు సక్రమంగా అందేలా చూడటమే ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం. అయితే కొత్త నిబంధనలు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నందున, అమలు తేదీతో పాటు బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన తర్వాతే వెల్లడికానున్నాయి.

ఇదీ చదవండి: దీపావళి యాడ్‌ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement