10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. బిగ్‌ టెన్షన్‌ | Ramlila Maidan Rally, Delhi Traders Write To Rahul Gandhi Again, Seek Postponement Ahead Of Diwali 2026 | Sakshi
Sakshi News home page

10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. బిగ్‌ టెన్షన్‌

Oct 27 2026 11:38 AM | Updated on Oct 27 2026 12:54 PM

Ramlila Maidan Rally: Another Letter From Traders To Rahul Gandhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్‌ 1న నిర్వహించనున్న ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీని వాయిదా వేయాలని వ్యాపారులు మరోసారి కోరారు. దీపావళి పండుగకు ముందు కీలకమైన వ్యాపార సీజన్‌లో ర్యాలీ నిర్వహిస్తే తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) ఛైర్మన్‌ బ్రిజేష్‌ గోయల్‌.. రాహుల్‌ గాంధీకి మరోసారి లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా పంపించారు. ఈ అంశంపై మిత్రపక్షాలతో చర్చించాలని కోరారు.

నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఈ ర్యాలీకి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే, దీపావళి షాపింగ్‌ జోరుగా సాగుతున్న సమయంలో ర్యాలీ నిర్వహించడం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని, అందువల్ల కార్యక్రమాన్ని పండుగ తర్వాతకు వాయిదా వేయాలని వ్యాపారులు కోరుతున్నారు.

గతంలో చేసిన విజ్ఞప్తిని రాహుల్‌ గాంధీ తిరస్కరించడంపై గోయల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే 30 సెకన్లలో నిరసనలను ఆపేయవచ్చని రాహుల్‌ పేర్కొన్నారు.

‘ఢిల్లీ వ్యాపారులారా.. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీ సమస్యలను వింటున్నాం. ప్రభుత్వం మెట్రోను మూసివేసి, రహదారులను దిగ్బంధించి, రాజధానిని నిర్బంధంలో ఉంచింది. ఓట్ల చోరీ జరిగితే మీ దుకాణం, పొదుపు, మీ పిల్లల భవిష్యత్తు ఏదీ సురక్షితంగా ఉండదు’ అని రాహుల్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగో నిందితుడిగా జ్ఞానేశ్‌ కుమార్‌ను పేర్కొంటూ ఆయనను తొలగించాలని ప్రధాని మోదీని కోరారు.

ర్యాలీ కారణంగా రామ్‌లీలా మైదాన్‌ చుట్టుపక్కల ఉన్న 20 ప్రధాన మార్కెట్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 31 నుంచే బారికేడ్లు ఏర్పాటు చేసి.. రహదారులను మూసివేస్తారా? నవంబర్‌ 1న దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందా? వినియోగదారులు మార్కెట్లకు చేరుకోగలరా? అంటూ ప్రశ్నించింది.

ర్యాలీకి 10 లక్షల మంది నిరసనకారులను తరలించేందుకు సుమారు 15 వేల నుంచి 20 వేల బస్సులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వీటికి తోడు రాజకీయ నాయకుల ప్రైవేటు వాహనాలు కూడా వస్తాయని తెలిపింది. రామ్‌లీలా మైదాన్‌ చుట్టూ ఢిల్లీలోని అతిపెద్ద హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లు ఉన్నాయని, అక్కడికి వెళ్లే మార్గాలన్నీ ఈ మార్కెట్ల గుండా సాగుతాయని వివరించింది. చాందినీ చౌక్‌, భాగీరథ్‌ ప్యాలెస్‌, ఖారీ బావోలీ, సదర్‌ బజార్‌, చావ్రీ బజార్‌, కశ్మీరీ గేట్‌, నబీ కరీం, కరోల్‌ బాగ్‌ తదితర మార్కెట్లపై ర్యాలీ ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

అక్టోబర్‌ 10న జంతర్‌ మంతర్‌ వద్ద కేవలం 3 వేల నుంచి 4 వేల మంది పాల్గొన్న నిరసన కార్యక్రమం కారణంగానే సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతమంతా దిగ్బంధానికి గురైందని సీటీఐ పేర్కొంది. దీనివల్ల వ్యాపారులకు సుమారు రూ.3,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అలాంటిది నవంబర్‌ 1న 10 లక్షల మందితో ర్యాలీ నిర్వహిస్తే పాత ఢిల్లీలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని, రూ.10 వేల కోట్ల వరకు నష్టం సంభవించవచ్చని అంచనా వేసింది. ర్యాలీని వాయిదా వేయడం సాధ్యం కాకపోతే రామ్‌లీలా మైదాన్‌కు బదులుగా బురారీ గ్రౌండ్స్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించాలని సీటీఐ సూచించింది. తద్వారా మార్కెట్లకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంది.

ఇదీ చదవండి: రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షల మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement