న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న నార్త్ బ్లాక్ వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో ఆందోళన వ్యక్తమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఆరు ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి పంపించారు. అయితే పొగలు రావడానికి గల కారణాలు, భవనానికి జరిగిన నష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. నార్త్ బ్లాక్ భవనం నుంచి పొగలు వస్తున్నట్లు సోమవారం ఉదయం 11.10 గంటలకు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
నార్త్ బ్లాక్ భవనంలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయని, వాటి కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ఓ పోలీసు అధికారి పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే పొగలు రావడానికి మరమ్మతుల పనులే కారణమని అధికారికంగా నిర్ధారించలేదు. పార్లమెంట్‌కు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించినట్లు శివసేన ఎంపీ మిలింద్ దేవ్రా తెలిపారు. సోమవారం ఉదయం 11.12 గంటలకు ఆయన ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అక్కడ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, అందరూ క్షేమంగా ఉండాలని, అత్యవసర సేవల సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు.
భవనం నుంచి పొగలు వెలువడటానికి గల అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. అక్కడ మంటలు కనిపించాయా? భవనంలోని ఏదైనా భాగం దెబ్బతిందా? అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ, ఆర్థికశాఖ సహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక కార్యాలయాలు ఉన్నాయి. సెంట్రల్ విస్టా పరిపాలనా ప్రాంతంలో ఉన్న ఈ భవనం పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉంటుంది.


