తమిళనాడు రాజకీయాల్లోను, విద్యా రంగంలోను సంచలనం సృష్టించిన రూ.100 కోట్ల భారీ కుంభకోణంలో రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, డీఎంకె నేత అన్బిల్ మహేష్ పొయ్యామొళి అరెస్టయ్యారు. మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో గ్రేటర్ చెన్నై పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు ఈడీ రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకుంది.
అసలు కుంభకోణం ఎలా జరిగింది?
అన్బిల్ మహేష్ పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటు విద్యాసంస్థలకు శాశ్వత గుర్తింపు, పాఠశాలల స్థాయి పెంపు (అప్‌గ్రెడేషన్), పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడం ప్రధాన విధిగా ఉండేది. అయితే, ఈ అనుమతుల ప్రక్రియను సొమ్ము చేసుకునేందుకు ఒక క్రమబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేశారనేది ప్రధాన ఆరోపణ.
పార్టీ ఫండ్ పేరుతో వసూళ్లు: విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి రావలసిన శాశ్వత గుర్తింపు పత్రాలు, ఇతర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యాల నుంచి పార్టీ ఫండ్ నెపంతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
1000కి పైగా ప్రైవేటు పాఠశాలలు: ఈ అక్రమ వసూళ్ల నెట్‌వర్క్ దాదాపు 1000కి పైగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విస్తరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రాథమిక విచారణలో కనీసం 177 ప్రైవేట్ పాఠశాలలు అనుమతుల కోసం నేరుగా భారీగా డబ్బు చెల్లించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
రూ.100 కోట్లకు పైగా హవాలా, లంచాల నెట్‌వర్క్: ప్రతి పాఠశాల నుంచి గుర్తింపు స్థాయిని బట్టి లక్షల రూపాయలు వసూలు చేసి మొత్తం రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గడించినట్లు సీసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేర్కొంటోంది.
ఈడీ దర్యాప్తు
చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేసింది. ఈ అక్రమ మార్గంలో వసూలైన సొమ్ము ఎక్కడికి మళ్లింది? ఏ రూపంలో డిపాజిట్ అయిందనే మనీ ట్రైల్‌ను వెలికితీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ప్రత్యేక కేస్ నమోదు చేసింది. విద్యా వ్యవస్థలో పారదర్శకతను దెబ్బతీస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ సాగిన ఈ రూ.100 కోట్ల అక్రమ అనుమతుల కుంభకోణం ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇదీ చదవండి: గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం


