ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదు
ఎమ్మెల్యే ఆది, బీటెక్ రవి, పుత్తా నరసింహారెడ్డి గాంధేయవాదులా... అందుకే అక్కడ ఉంచారా?
తీవ్రస్థాయిలో మండిపడ్డ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అత్యంత నీచంగా తయారైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై టీడీపీ గూండాలు రాళ్లు, బీరు బాటిళ్లు విసిరారని.. నామినేషన్ కేంద్రం గేటు వద్ద గంటసేపు తమ అభ్యర్థులు నిలబడినా పోలీసులు వారితో నామినేషన్ వేయించలేకపోయారన్నారు. ఆ అల్లరి మూకలు, రౌడీలు రాకముందే 7.30 గంటలకే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి క్యూలో నిల్చునేందుకు తమ అభ్యర్థులు వస్తే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ‘11 గంటలకే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా?, ఓటు వేసేందుకు గంట ముందే వెళ్లి క్యూలో ఉంటాం కదా? ఇప్పుడు కూడా అలా వెళ్తే ఏమవుతుంది? దీనిని కుట్రకాక ఏమంటారు.
నామినేషన్లు వేసే సమయానికి టీడీపీ గూండాలు, రౌడీలు వందల సంఖ్యలో వచ్చి నామినేషన్ కేంద్రం చుట్టూ తిష్ట వేస్తున్నారు. వాళ్లు వచ్చేవరకూ పోలీసులు మమ్మల్ని లోపలికి అనుమతించరు. ఆ అల్లరి గుంపులు వచ్చిన తర్వాత మా అభ్యర్థులను పంపిస్తే నామినేషన్ పేపర్లు చించేసి, దాడులు చేస్తున్నారు. పోలీసులు వాళ్లను నియంత్రంచరు. 144 సెక్షన్, 30 యాక్టు, ముందస్తు అరెస్ట్‌లు అన్నీ వైఎస్సార్‌సీపీ నాయకులకే తప్ప టీడీపీ వారికి కాదు’ అని అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ కార్యాలయం వద్ద చెట్లపై రాళ్లు, బీరు బాటిళ్లతో అరాచక మూకలు కాచుకుని కూర్చున్నాయన్నారు.
ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఎన్నికల కమిషన్‌కు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్లు, కంకర, రాడ్లు పట్టుకుని 50 మంది చొప్పున రౌడీలు ఉన్నారని, పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారన్నారు. నామినేషన్లు వేయకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని, ఒకవేళ పోలీసులను దాటుకుని లోపలికి వెళ్తే టీడీపీ నాయకులు తమ వారిపై దాడులు చేస్తున్నారన్నారు. ‘జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, పుత్తా నరసింహారెడ్డి గాంధేయవాదులా. అహింసా వాదులా. అందుకే వారిని నామినేషన్ కేంద్రంలో ఉంచారా’ అని అవినాష్‌రెడ్డి నిలదీశారు.


