నేపాల్‌లో హైదరాబాద్‌సిట్ స్పెషల్ ఆపరేషన్
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోనూ పనిచేసిన పోలీసులు
రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజ కేసు నిందితుల కోసం ఐదు నెలలకుపైగా సరిహద్దుల్లో మకాం
మరో నేరం చేయడానికి వస్తుండగా నలుగురి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ హత్య కేసులో వాంటెడ్‌గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసుల సిట్ బృందం అనుసరించిన తీరు సాధారణ పోలీసింగ్‌కు భిన్నంగా ఉంది. ముఠా సభ్యుల ఆచూకీ కోసం సిట్ నెలల తరబడి గాలించింది. పర్యాటకుల మాదిరిగా నేపాల్‌లో అడుగుపెట్టి, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వంటవారిగా పని చేసి, వివరాలు సేకరించింది. మరో నేరం చేయడానికి సరిహద్దులు దాటి వచ్చిన వారిని నాంపల్లిలో పట్టుకుంది. ఈ కేసులో కల్పన సహా నలుగురిని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
దోపిడీకి పథకం వేసి..
నేపాల్‌కు చెందిన ధర్మ తిరువా అలియాస్ కల్పన 2025 జూన్‌లో బంధువు జోగి ద్వారా హైదరాబాద్‌కు వచ్చి తనూజ ఇంట్లో పనికి చేరింది. పుణేలో నివసించే నేపాల్ జాతీయుడు బికాస్‌తో ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. యజమానులు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఇతర ఆస్తుల వివరాలను ఈమె ద్వారా తెలుసుకున్న అతడు దోపిడీకి పథకం రూపొందించాడు. 2026 ఏప్రిల్‌లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసేందుకు కల్పన పుణేకు వెళ్లగా.. అక్కడే ఆమెకు బికాస్ ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది.
మే 4న వినయ్ బెంగళూరుకు వెళ్లగా, కల్పన తన ముఠాకు ఈ సమాచారం ఇచ్చింది. దీంతో అదేరోజు గణేశ్ షాహీ, శంకర్ లామా, సునీల్ పరివార్ కలంబోలి ప్రాంతంలో కలుసుకున్నారు. అద్దెకు తీసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కారులో పుణేకు వెళ్లారు. మే 5న పుణేలో బికాస్, గణేశ్ బీకే, దిలీప్ బిశ్వకర్మ అలియాస్ ఆకాశ్‌లను కలుసుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన సురేశ్ షాహీ, నేత్ర షాహీ కూడా వారితో చేరారు. దోపిడీ ప్రణాళికను ఖరారు చేసుకున్న అనంతరం ముఠా హైదరాబాద్ బయలుదేరింది.
రెండు ముఠాలుగా తొమ్మిది మంది
మే 7న ఉదయం 7.30 గంటలకు గణేశ్ బీకే, సురేశ్ షాహీలు తనూజ ఇంటి సమీపంలో కల్పనను కలిసి ఇంటిని పరిశీలించారు. సాయంత్రం ముఠా సభ్యులంతా ఎంజీబీఎస్ సమీపంలోని రవీంద్ర బార్ వద్ద సమావేశమయ్యారు. సురేశ్ షాహీ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముఠా రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందం ఇంట్లోకి చొరబడి దోపిడీ చేయాలని.. మరో బృందం నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
మే 7 అర్ధరాత్రి తనూజ ఇంటి తలుపును కల్పన తీయగా... మిగిలిన వాళ్లు ఇంట్లోకి ప్రవేశించారు. వీరిని తనూజ చూడటంతో ఆమె నోటిని మూసి దాడి చేశారు. ఈ క్రమంలో ఊపిరాడక ఆమె మరణించింది. తనూజ ఇంట్లో ఉన్న 225 గ్రాముల బంగారాన్ని తీసుకుని వీళ్లు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రెండో గ్యాంగ్‌తో కలిశారు. తర్వాత సొత్తును 9 వాటాలుగా పంచుకుని వివిధ మార్గాల్లో నేపాల్ వెళ్లి అక్కడ ఈ బంగారం అమ్మి సొమ్ము చేసుకున్నారు.
సిట్ వివిధ ప్రాంతాల్లో గాలించి...
నిందితుల ఆచూకీ కోసం సిట్ బెంగళూరు, ముంబై, పుణే, సూరత్, పట్నా, ఢిల్లీ, లక్నో, ఉత్తరాఖండ్‌ల్లో గాలించింది. చివరకు వీరంతా నేపాల్ చేరుకున్నారని నిర్ధారించుకుని పర్యాటకుల మాదిరి అక్కడకూ వెళ్లింది. అక్కడ నిందితులను గుర్తించి వారి కదలికలు కనిపెట్టడానికి వారి ఇళ్ల సమీపంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పోలీసులు పని చేశారు. ఇలా ఐదు నెలలకు పైగా అక్కడే మకాం వేసి పూర్తి సమాచారం సేకరించారు. ఇటీవల మళ్లీ భారత్‌లోకి వచ్చిన కల్పన, గణేశ్ బీకే, చంద్ర, గణేశ్ బహదూర్ బెంగళూరు, గురుగ్రామ్‌ల్లో మూడు నేరాలకు పథకం వేసి రెక్కీ కూడా చేశారు.
సిట్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో ఇండో–నేపాల్ సరిహద్దుల వద్ద నుంచి ఈ నలుగురినీ నీడలా వెంటాడుతూ వచ్చి చివరకు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేసింది. ఇప్పుడు నలుగురిని పట్టుకోగా... టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 22న సునీల్‌తోపాటు రిసీవర్ దిలీప్‌ను అరెస్టు చేశారు. దీంతో ముఠాలో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరగా పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 226 గ్రాముల బంగారం పోగా.. గతంలో 26 గ్రాములు, తాజాగా రూ.51 వేలు రికవరీ అయ్యాయి.


