వరి సాగు.. బాధ్యత నాదే! | Instructions from the Agriculture Department to seed dealers | Sakshi
Sakshi News home page

వరి సాగు.. బాధ్యత నాదే!

Oct 27 2026 1:54 AM | Updated on Oct 27 2026 1:54 AM

Instructions from the Agriculture Department to seed dealers

విత్తనాలు కొనాలంటే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి  

పంట ఎండితే ప్రభుత్వానికి, డీలర్లకు సంబంధం లేదు 

రైతుల నుంచి ఆ మేరకు హామీ పత్రం తీసుకోవాలి 

విత్తనాల డీలర్లకు వ్యవసాయ శాఖ ఆదేశాలు 

యాసంగిలో బోర్లు, బావుల కింద కూడా వరి వద్దంటూ సూచనలు.. మరోవైపు రాగులు, సజ్జలు వంటి ఆరుతడి పంటల విత్తనాలూ అందించలేని పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో వరి సాగు వద్దని ఇన్నాళ్లూ సూచనలకే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. వరి వంగడాల కోసం వచ్చే ప్రతి రైతు నుంచి ’స్వయం అంగీకార పత్రం’ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) తీసుకున్న తర్వాతే విత్తనాలు అమ్మాలని డీలర్లకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రభుత్వం వరి వేయవద్దని చెబుతున్నా, నా పొలంలో వరి మాత్రమే పండుతుంది కాబట్టి నా సొంత నిర్ణయంతో వరి వేస్తున్నా. కరెంటు గానీ, నీరు గానీ అందక పంట పండకపోతే డీలర్లకు గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదు..’అని రైతు రాసిచ్చి, సంతకం లేదా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల కింద సాగునీటి వసతి ఉన్న పొలాల్లోనే కాదు, సొంత బోర్లు, బావుల కింద కూడా ఈ యాసంగిలో వరి వేయవద్దని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. అయినా మొండిగా వరి సాగు చేస్తే నష్టానికి రైతే బాధ్యుడని ఈ పత్రం ద్వారా ముందుగానే రాయించుకుంటోంది. వరి విత్తనాలు కొనాలంటే రైతు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని నిబంధన పెట్టిన వ్యవసాయ శాఖ.. ఆరుతడి విత్తనాలకు కూడా జనవరి వరకు వేచి ఉండాలని చెబుతోందని రైతులు వాపోతున్నారు.  

నీళ్లు లేవు..కరెంటు కష్టం! 
ప్రాజెక్టులు, చెరువుల కింద నీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఉన్న కొద్దిపాటి నీరు తాగడానికే సరిపోతుందని ప్రభుత్వం చెపుతోంది. జలాశయాల్లో సాధారణంగా ఈ సమయంలో 462 టీఎంసీలు ఉండాల్సి ఉండగా 200 టీఎంసీలే ఉన్నాయి. మొత్తం తాగునీటికే కేటాయించారు. అదే సమయంలో కరువు విశ్వరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బోర్లు, బావుల కింద కూడా వరి వేయవద్దని స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 11.24 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఇది 6.44 మీటర్లు దిగువ. ఇక అక్టోబర్‌లో సాధారణంగా 15 వేల మెగావాట్లు ఉండే విద్యుత్‌ డిమాండ్‌ ఈసారి 20 వేల మెగావాట్లు దాటింది. భూగర్భ జలాలు అందడం మాట అలా ఉంచితే యాసంగిలో బోర్లన్నీ ఒకేసారి నడిస్తే కరెంటు సరఫరా కష్టమన్నది అధికారుల ఆందోళన. గత యాసంగిలో రాష్ట్రంలో 92.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, అందులో 65.42 లక్షల ఎకరాల్లో వరే వేశారు. ఈసారి ఆ విస్తీర్ణాన్ని 20 నుంచి 30 లక్షల ఎకరాలకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

ఆరుతడి పంటల విత్తనాలకూ ఎదురుచూపులే.. 
వరి వద్దన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధంగా ఉంచాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలో విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు, ఇతర ఆరుతడి పంటల విత్తనాల కోసం జనవరి వరకు ఆగాలని వ్యవసాయ శాఖ సిబ్బంది చెపుతున్నారని రైతులు వాపోతున్నారు. యాసంగి విత్తనాలు నవంబర్, డిసెంబర్‌లో పడాల్సి ఉండగా, జనవరిలో విత్తితే పంట చివరి దశ మార్చి, ఏప్రిల్‌ ఎండల బారిన పడుతుంది. ఆ సమయానికి బోర్లు మరింత అడుగంటి దిగుబడి దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. విత్తన రాయితీకి రూ.224 కోట్లు ప్రతిపాదించామని వ్యవసాయ శాఖ చెబుతున్నా, అవి ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వలేకపోతే ప్రైవేటు దుకాణాల్లో ఎక్కువ ధరకు, నాణ్యత తెలియని విత్తనాలు కొనాల్సి వస్తుందని, నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రమాదమూ ఉందని ఆందోళన చెందుతున్నారు. చిరుధాన్యాలు తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో పండుతాయని, వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని ప్రభుత్వమే ప్రచారం చేస్తోంది. కానీ వాటి విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుకు అందించే ఏర్పాట్లు మాత్రం కనిపించడం లేదు. కరువు నేపథ్యంలో అవసరమైన విత్తనాలు రైతులకు ఇస్తేనే పంట మార్పిడికి ముందుకొస్తారని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. 

ఆర్థికసాయం ఏదీ? 
కరువు నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలకు మారేవారికి ప్రత్యేక ఆర్థిక సాయంపైనా ప్రకటన రాలేదు. ఒకవైపు రైతు భరోసా బకాయిలు అందక, మరోవైపు వానాకాలం పంటలు వర్షాభావంతో దెబ్బతిని అప్పుల్లో ఉన్న రైతులకు యాసంగి పెట్టుబడి సమకూర్చుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో విత్తనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడం, ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనాల్సి రావడం వారిని మరింత కుంగదీస్తోంది. విత్తనాలు సకాలంలో ఇవ్వకుండా బాధ్యత మొత్తం రైతుపై నెట్టడం సరికాదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆరుతడి విత్తనాలు వెంటనే అందుబాటులోకి తేకపోతే రైతులు మళ్లీ వరి వైపే మొగ్గు చూపే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement