మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి ఉత్తమ్
ఎత్తు పెంపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూల స్పందన
152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి అంగీకరించాలన్న రేవంత్‌రెడ్డి
తెలంగాణ నీటి అవసరాలకు సహకరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న ఫడ్నవీస్
అయితే మహారాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం అని స్పష్టీకరణ
తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని వ్యాఖ్య
వాస్తవాలు, సాంకేతిక అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన
ముంబైలో ఫడ్నవీస్‌తో సీఎం నేతృత్వంలోని తెలంగాణ బృందం భేటీ..
గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్న రేవంత్
మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమని ప్రకటన
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఫడ్నవీస్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, మహారాష్ట్రల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల సరిహద్దులో ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తుమ్మిడిహెట్టి బరాజ్ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. మహారాష్ట్రపై, తమ ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే, 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి గతంలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని పున: పరిశీలించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం సోమవారం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఫడ్నవీస్‌తో సమావేశమై తుమ్మిడిహెట్టి బరాజ్‌పై చర్చలు జరిపింది. తొలుత బరాజ్ ప్రాధాన్యతపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని వివరించారు. బరాజ్ ఎత్తు పెంపు ప్రతిపాదనలు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు.
గతంలోనూ సానుకూల వైఖరి: ఫడ్నవీస్
తుమ్మిడిహెట్టి బరాజ్ విషయంలో గతంలోనూ మహారాష్ట్ర సానుకూల వైఖరి అనుసరించిందని ఫడ్నవీస్ గుర్తుచేశారు. బరాజ్ నిర్మాణ స్థలం, వివిధ ఎత్తుల వద్ద ముంపు ప్రభావం, అవసరమైన భూమి విస్తీర్ణాన్ని తమ స్వతంత్ర అధ్యయనంలో పరిశీలిస్తామని, ఈ అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలు, అంచనాలపై తెలంగాణకు అభ్యంతరాలు ఉంటే రెండు రాష్ట్రాల అధికారులు వాటిపై చర్చిస్తారని ఫడ్నవీస్ తెలిపారు. అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. గతంలో ఇచి్చన అనుమతుల అనంతరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే వాస్తవ ముంపు ప్రాంతం తొలుత అంచనా వేసిన దానికంటే పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు, సాంకేతిక అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకెళ్లాలి..
తెలంగాణ నీటి అవసరాల విషయంలో సహకరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మహారాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం అని ఫడ్నవీస్ తెలిపారు. తుమ్మిడిహెట్టి విషయంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా అవసరమైన అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు చేపడుతుందని చెప్పారు. ఆలోగా రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బరాజ్ ఎత్తు, నీటి లభ్యతపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలన్నారు. ప్రాజెక్టు స్థలంలో మార్పులతో ముంపు ప్రాంతంపై పడే ప్రభావం, సంబంధిత అభయారణ్యం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతం వెలుపల అవసరమయ్యే భూముల వివరాలను పరిశీలిస్తామని వెల్లడించారు. పరిహారం, ఇతర సాంకేతిక అంశాలనూ అధ్యయనం చేయాలని చెప్పారు. అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలని, రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని సూచించారు. తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులను నిర్ణయించాలన్నారు.
మా అమ్మమ్మ తెలుగు మాట్లాడతారు..
ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మహారాష్ట్ర సీఎం చెప్పారు. స్నేహ భావం, సోదర భావంతో మంచి పొరుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని చెప్పారు.
రెండు రాష్ట్రాలను కలిపే వారధి: సీఎం రేవంత్
దేశ రక్షణ, వ్యూహాత్మక రంగాల విషయంలో ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని వివరించారు. విమానాశ్రయంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తుమ్మిడిహెట్టి కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ–మహారాష్ట్ర మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్నాయంటూ పూర్వ హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని చెబుతూ అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఇలావుండగా..హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు మహారాష్ట్ర సీఎంను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
152 మీటర్ల ఎత్తుతోనే అత్యంత ప్రయోజనం: మంత్రి ఉత్తమ్
తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని మంత్రి ఉత్తమ్ తన ప్రజెంటేషన్‌లో వివరించారు. 2016లో 148 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి ఒప్పందం జరిగినా, దానితో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని చెప్పారు. బరాజ్‌తో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.


