తెలుగు నేల తరతరాల సజీవ కళల పుట్టినిల్లు. భక్తిని, ముక్తిని మేళ వించే ‘హరికథ’; శాస్త్రీయ నృత్యంలో తెలుగు సంతకమైన ‘కూచిపూడి’, కాకతీయుల వీరత్వాన్ని చాటే ‘పేరిణి శివతాండవం’ మన సాంస్కృతిక శిఖరాలు. ఇక పల్లెసీమలగుండె చప్పుళ్ళుగా నిలి చిన తెలంగాణ మట్టి పరిమళాల ‘ఒగ్గుకథ’, ‘చిందు భాగవతం’, ‘గొల్ల సుద్దులు’; ఉత్తరాంధ్ర జానపదుల ఊపిరైన ‘తప్పెటగుళ్ళు’, ‘జముకుల కథ’... ఇలా తెలుగు వారి కళా ప్రస్థానంఒక మహా సముద్రం. ఇందులో ఒక భాగం బుర్రకథ.
జంగం కథల సంప్రదాయంతో సన్నిహిత సంబంధం కలిగి, యక్షగాన, శారద కథల సంప్ర దాయంతో ముడిపడిన శక్తిమంతమైన కథాగాన కళారూపం ‘బుర్రకథ’. ‘వినరా భారత వీర కుమారా... విజయం మనదేరా’ అని ప్రధాన కథ కులు పాడగానే, వంతలు ‘తందాన తాన’... అనగానే పల్లెంతా నిద్ర మరిచేది. ‘బుర్ర’ ఆకారంలో ఉండే తంబురా భుజాన వేసుకుని, కుడి చేతి బొటన వేలికి లోహపు ఉంగరాలు తొడుక్కొని తాళం వేస్తూ, కాలి గజ్జెల రవళులతో ప్రధాన కథకులు ముందుకు, వెనుకకు అడుగులు వేస్తూ ‘భ్రమరి నృత్య’ రీతిలో గిర్రున తిరుగుతూ కథ చెబుతుంటే... ఇరువైపులా ఉండే వంతలు గుమ్మెట వాయిస్తూ కథకు ఊపునిస్తారు. ఒకవంత సమకాలీన సామాజిక అంశాలను ప్రస్తావిస్తే, మరో వంత హాస్యంతో నవ్విస్తారు. ఈ ముగ్గురి సమన్వయంతో సాగిపోయే ఈ కళా రూపం ఉద్వేగాన్నీ, చైతన్యాన్నీ మేళవిస్తుంది.
తొలితరం కళాకారులు రెంటపాళ్ల గుడ్డిజంగం, దొడ్డి సుబ్బారావుల స్ఫూర్తితో... కోసూరి పున్నయ్య, సుంకర సత్యనారాయణ, పద్మశ్రీ షేక్ నాజర్ వంటి వైతాళికుల గళంతో 1940లలో బుర్రకథ ఆధునిక రూపు సంతరించుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం నవాబుల కాలంలో దోపిడీకి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిన బుర్రకథపై ఒక దశలో నిషేధం ఉంది. రాత్రంతా మేల్కొని గొంతు చించుకుని పాడే బుర్రకథలో ఒక మహిళ ప్రధాన కథకురాలిగా నిలబడటం విశేషం. మోటూరి ఉదయం ప్రధాన కథకురాలిగా, చింతల కోటేశ్వరమ్మ, మహంకాళి పార్వతి వంతలుగా మహిళా బుర్రకథ జట్టు నడిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గరివిడి లక్ష్మి ప్రస్థానం మరో ముఖ్య అధ్యాయం. పెద్దగా చదువుకోకపోయినా బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీరచరిత్ర వంటి కథలను కంఠస్థం చేసి నిప్పులు చెరిగేలా గానం చేసిన లక్ష్మి పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె జీవితంపై వచ్చిన సినిమానే ‘గరివిడి లక్ష్మి’.
కథలన్నీ పురుషుల చుట్టూనే తిరుగు తాయని, మహిళలు కేవలం అలంకారప్రాయ మనే మూస ధోరణిని బద్దలుకొట్టిన అరుదైన చలన చిత్రం ఇది. సినీ అభిమానులంతా పురుష హీరోల చుట్టూనే తిరుగుతూ... నటులు, కులాలు, చివరకు ప్రాంతీయ విభజనలతో చీలిపోతున్న వేళ... ఓరుగల్లు గడ్డపై పుట్టిన ఆనంది, ఉత్తరాంధ్ర జానపద కోకిల పాత్రను మోస్తూ అక్కడి యాసను, బుర్రకథ బాణీని ఆత్మీయంగా పలికించడం... తెలుగు ప్రజలంతా కళాత్మకంగా, భావోద్వేగపరంగా ఒక్కటేనని చాటి చెప్పింది. తంబురా మీటుతూ, అందెలతో తాళం వేస్తూ తెలుగు అమ్మాయి ఆనంది వేసే చురుకైనఅడుగులు, ముఖ కవళికలు మహానటి సావిత్రి వారసత్వాన్ని గుర్తుకు తెస్తాయి.
ఆధునిక సాంకేతిక వినోదపు హోరులో ఆదరణ కోల్పోయి కాలగర్భంలో కలిసి పోతున్న జానపద కళారూపాలను చలన చిత్రాలుగా తీసి భద్రపరచాలన్న నాటి జానపద కళోద్ధారకుడు, నటుడు డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఆకాంక్షకు కార్యరూప మిస్తూ... బుర్రకథకు వెండి తెర పట్టిన నివాళి ‘గరివిడి లక్ష్మి’.
– శ్రీనివాస్ మాధవ్ సమాచార హక్కు పరిశోధకుడు
బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం నవాబుల కాలంలో దోపిడీకి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిన బుర్రకథపై ఒక దశలో నిషేధం ఉంది.


