తెలంగాణ వ్యాప్తంగా హమాలీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఘనత ‘తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ’కి దక్కుతుంది. దీనికి నాయకత్వం వహించి, పోరాటాలకు పురుడుపోసింది హమాలీ హక్కుల నేత గుంటి సామ్రాజ్యం. హమాలీల ఐక్యతకు, హక్కుల కొరకు పారాడిన ఈ యూనియన్ అక్టోబర్ 25న పెద్దపల్లిలో పదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
దశాబ్దాలుగా సరైన గుర్తింపునకు, భద్రతకు నోచుకోని వర్గాల్లో హమాలీ కార్మికులు ముఖ్యమైనవారు. మార్కెట్లు, గోదాములు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు, రవాణా రంగం, వ్యాపార సంస్థలు... ఇలా ఒకటేమిటి అనేక చోట్ల హమాలీ కార్మికుడు చమట చిందిస్తాడు. ఆర్థిక వ్యవస్థ గమనంలో వారి పాత్ర ముఖ్యమైనదే అయినా... వారి జీవితాల్లో మాత్రం భద్రత, సంక్షేమం, గౌరవం కనిపించడం లేదు. హమాలీ సమస్యలపై వారిని సంఘటితం చేయడం, ప్రభుత్వాల దృష్టికి డిమాండ్లను తీసుకెళ్లడం వంటి కార్యకలాపాల్లో సంఘం విజయవంతంగా పురోగమించింది.
హమాలీ సంక్షేమ బోర్డుకోసం కమిటీ
హమాలీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రత్యేకంగా ‘హమాలీ సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి హమాలీ కార్మికుల సమస్యలను వివరించింది. హమాలీలకు గుర్తింపు కార్డులు అందించే ఉద్దేశంతో వరంగల్‌లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ, అవగాహన లోపం తదితర కారణాలతో ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందలేదు. హమాలీలకు చట్టపరమైన శాశ్వత సంక్షేమ వ్యవస్థ అవసరమని భావించి ‘హమాలీ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటును ప్రధాన డిమాండ్‌గా చేసుకుంది.
అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి హమాలీ బోర్డు అవసరాన్ని వివరించడం, వినతిపత్రాలు అందించడం, ప్రభు త్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది యూనియన్. ఈ క్రమంలో ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి హమాలీ బోర్డు ఏర్పాటు చేయా లని వినతిపత్రం అందించింది. ఎన్నికల సమయంలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేని ఫెస్టోలో హామీ పొందుపరిచేలా ఈ యూనియన్ కృషి చేసింది.
పదేళ్ల ప్రస్థానంలో వరంగల్‌లో నిర్వహించిన హమాలీ గర్జన బహిరంగ సభ ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై హమాలీల సమస్య లపై స్పందించారు. సభ అనంతరం ప్రభుత్వం హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర లేబర్ కమిషనర్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది కూడా.
మహారాష్ట్రలో హమాలీ వర్కర్ల కోసం ఒకే బోర్డు లేదు కానీ... అవసరాన్ని బట్టి చిన్న చిన్న బోర్డులను ‘ద మహరాష్ట్ర మథాడి, హమాల్ అండ్ అదర్ మాన్యువల్ వర్కర్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ వెల్ఫేర్) యాక్ట్, 1969’ కింద మథాడీ– హమాలీ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సుమారు 34 ఇటు వంటి బోర్డులు అక్కడ పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మహరాష్ట్ర వెళ్లి ఆ బోర్డుల పని తీరును అధ్య యనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. కానీ ఇంత వరకూ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం జరగకపోవడం విచారకరం.
కూలీ రేట్లు, పనిభారం, కాంట్రాక్టు విధానం, పని ప్రదేశాల్లో భద్రత, ప్రమాదాల సమయంలో రక్షణ, సామాజిక భద్రత, వైద్యం, పిల్లల విద్య, వృద్ధాప్యంలో బాసట, ఉండటానికి ఇళ్లు వంటి అంశాలపై ఈ యూనియన్ చేస్తున్న అనేక డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని స్పందించాలి.
– డా. ఆవాల హరిబాబు, తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ సలహాదారు (అక్టోబర్ 25న పెద్దపల్లిలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ దశాబ్ది ఉత్సవ సభ)
ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగి మెడపై క్రాస్ సెల్లింగ్ కత్తి


