అధికారుల మధ్య తలెత్తిన విభేదాలు
మండలి చైర్మన్ నేతృత్వంలో రిజిస్ట్రార్ల సమావేశం
విద్యాశాఖ ఆధ్వర్యంలో వీసీలతో భేటీ
మరోవైపు కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన
మలుపులు తిరుగుతున్న పోస్టుల భర్తీ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఒకవైపు యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో భేటీ కాగా, ఇంకోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారి వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో సమావేశమయ్యారు. మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని చుట్టముట్టి తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా నియామకాలు చేపట్టవద్దని ఆందోళన చేశారు. ఇదిలాఉంటే నియామక ప్రక్రియ విషయంలో అధికారులు, వీసీల మధ్య భిన్నాభిప్రాయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడంతో గందరగోళం నెలకొంది. ప్రారంభంలోనే స్పష్టత లేకపోవడం సరికొత్త వివాదానికి కారణమైంది. విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల నియామకానికి ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఉన్నత విద్యామండలికి కీలక బాధ్యతలు అప్పగించింది. మండలి స్రూ్కటినీ చేసిన తర్వాత, వర్సిటీ వీసీలే నియామకాలు చేపడతారు.
రిజిస్ట్రార్లతో మండలి చైర్మన్ భేటీ
మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తొలి విడతగా రిజిస్ట్రార్లతో సమావేశమై పోస్టుల భర్తీపై చర్చించారు. విధివిధానాలు, రోస్టర్ పాయింట్లు, పోస్టుల వారీగా రిజర్వేషన్లు, ఇందుకు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు పోస్టులు, సబ్జెక్టుల వారీగా భర్తీ చేసే పోస్టుల వివరాలపైనా చర్చించారు. మరో ఏడాదిలో వర్సిటీల పాలక మండళ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో నియామకాలపై అవసరమైన కసరత్తు మొదలు పెట్టాలని సూచించారు. వీలైనంత త్వరగా దరఖాస్తుల స్వీకరణకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
పోటీగా వీసీలతో సమావేశం
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రిజిస్ట్రార్ల సమావేశం చేపడితే, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అత్యవసరంగా వర్సిటీ వీసీలతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో మండలి చైర్మన్ హాజరవ్వాలని కబురు పంపారు. ఈ సమావేశంలో అధ్యాపకుల నియామకాలపైనే ప్రధానంగా చర్చ జరగ్గా, అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. దరఖాస్తుల పరిశీలనకు తాము చెప్పిన నిపుణులను నియమించాలని విద్యాశాఖ ఉన్నతాధికారి సూచించినట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని మండలి చైర్మన్ అన్నట్టు సమాచారం. ఇదే క్రమంలో రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించడాన్ని పలువురు వీసీలు, విద్యాశాఖ అధికారులు ఆక్షేపించినట్టు తెలిసింది. తమ ప్రమేయం లేకుండా రిజిస్ట్రార్లతో భేటీలో అర్థం లేదని వీసీలు అన్నట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల డిమాండ్లను మండలి చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించగా.. దీనికి వీసీలు, విద్యాశాఖ అధికారులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. వారి పట్ల అంత ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు అన్నట్టు తెలిసింది.
మండలిని ముట్టడించిన కాంట్రాక్టు లెక్చరర్లు
కాంట్రాక్టు అధ్యాపకులు సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. మండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్‌తో కలిసి బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా వారు శాంతించలేదు. తమను రెగ్యులర్ చేయకుండా, యూజీసీ వేతనం ఇవ్వకుండా నియామక ప్రక్రియను ముందుకు కదలనివ్వమని బైఠాయించారు. సామూహిక ఆత్మహత్యలకూ సిద్ధపడతామని హెచ్చరించారు. కాంట్రాక్టు అధ్యాపకులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో కార్యాలయ వాతావరణం వేడెక్కింది. ఈ దశలో పోలీసు బలగాలు మండలి కార్యాలయానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


