ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన అంకితా భండారీ హత్య కేసుకు సంబంధించిన ఆడియో క్లిప్‌లను విడుదల చేసిన నటి ఉర్మిళ సనావర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు. మాజీ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరిద్వార్‌లో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో అభ్యంతరకర, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం, ఆస్తిని బదిలీ చేయాలని, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం, చంపేస్తానని బెదిరించడం వంటి ఆరోపణలు ఆమెపై నమోదయ్యాయి. కేసు నమోదైన దాదాపు 12 గంటల్లోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంకితా కేసుతో సంబంధమేంటి?
ఉత్తరాఖండ్‌లో రిషికేశ్‌లోని వనంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసిన అంకితా భండారీ 2022లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కీలకమైన ‘వీఐపీ’ ప్రమేయం ఉందని సూచిస్తున్నాయంటూ ఉర్మిళ సనావర్ గత ఏడాది డిసెంబర్‌లో కొన్ని ఆడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ క్లిప్‌ల ప్రామాణికతపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఉర్మిళ సనావర్, సురేశ్ రాథోడ్ ఇద్దరూ నార్కో అనాలిసిస్ పరీక్షకు అంగీకరించిన రెండు రోజులకే ఆమె అరెస్ట్ కావడం గమనార్హం.
Saharanpur, Uttar Pradesh: BJP leader Urmila Sanawar was taken into custody by Uttarakhand Police ahead of her appearance before a Dehradun court in connection with the Ankita Bhandari murder case. https://t.co/alJpQ71XYl
— IANS (@ians_india) October 25, 2026
వీఐపీ ఆరోపణలు.. ఖండించిన దుష్యంత్ గౌతమ్
అంకితా హత్య కేసులో వీఐపీగా సిక్కిం గవర్నర్ దుష్యంత్ గౌతమ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. ఆడియో క్లిప్‌లలోని అంశాలు నిజమా కాదా అన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
ఇప్పుడు ప్రధానంగా తేలాల్సిన ప్రశ్నలు..
ఆడియో క్లిప్‌లు అసలైనవేనా? వాటిలోని సంభాషణలు ఎప్పుడు, ఏ సందర్భంలో రికార్డయ్యాయి?
ఆడియోలో ప్రస్తావించినట్లు చెబుతున్న ‘వీఐపీ’కి హత్యతో ఏదైనా సంబంధం ఉందా?
ఉర్మిళ సనావర్, సురేశ్ రాథోడ్‌లకు తెలిసిన వివరాలు దర్యాప్తులో ఎంతవరకు ఉపయోగపడతాయి?
ఉర్మిళపై నమోదైన తాజా కేసులోని ఆరోపణలకు ఆధారాలు ఏమిటి?. ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తు, ఫోరెన్సిక్ పరీక్షలు, న్యాయపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే తేలాలి.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ అతి విధేయత చూపించారు


