సూపర్‌ లీగ్‌కు ముంబై | Mumbai team advanced to the Super League stage in the Syed Mushtaq Ali Trophy | Sakshi
Sakshi News home page

సూపర్‌ లీగ్‌కు ముంబై

Nov 27 2026 4:20 AM | Updated on Nov 27 2026 4:22 AM

Mumbai team advanced to the Super League stage in the Syed Mushtaq Ali Trophy

చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌పై విజయం  

విదర్భ కూడా ముందంజ

ముగిసిన ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 లీగ్‌ దశ 

ఈనెల 30 నుంచి 8 జట్ల మధ్య ‘సూపర్‌ లీగ్‌’ 

టాప్‌–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు

కోల్‌కతా: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబై జట్టు ‘సూపర్‌ లీగ్‌’ దశకు దూసుకెళ్లింది. గురువారం ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 86 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసింది. తాజా సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించిన ముంబై జట్టు 26 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. విదర్భ జట్టు కూడా 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని ముందంజ వేసింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముషీర్‌ ఖాన్‌ (40 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (34 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ (31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్దిక్‌ తమోర్‌ (39; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (1), టీమిండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే (0) విఫలమయ్యారు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో రవీందర్‌ నేగీ, జగదీశ సుచిత్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరాఖండ్‌ 16.5 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్‌ దంగ్వాల్‌ (37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అథర్వ అంకొలేకర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. గురువారంతో లీగ్‌ దశ ముగిసింది. ఈనెల 30 నుంచి నాగ్‌పూర్‌లో ఎనిమిది జట్ల మధ్య ‘సూపర్‌ లీగ్‌’ దశ మొదలవుతుంది. ‘సూపర్‌ లీగ్‌’లో రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు డిసెంబర్‌ 6న ఫైనల్లో తలపడతాయి.  

విదర్భ విజయం 
ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో విదర్భ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు  చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమన్‌ మోఖడే (42 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెప్టెన్‌ అథర్వ తైడె (37; 3 ఫోర్లు), దానిశ్‌ మాలేవర్‌ (37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశ్‌ రాథోడ్‌ (39; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలోఛత్తీస్‌గఢ్‌ 19.1 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అమన్‌దీప్‌ ఖరే (37 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. విదర్భ బౌలర్లలో ప్రఫుల్‌ హింగే 3 వికెట్లు పడగొట్టాడు. 

ఢిల్లీ ‘హ్యాట్రిక్‌’ 
ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో ఢిల్లీ జట్టు వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి... టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ఢిల్లీ కెప్టెన్‌ ప్రియాన్‌‡్ష ఆర్య మరోసారి రెచ్చిపోవడంతో ఆ జట్టు ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేసుకుంది. గురువారం ఇండోర్‌లో జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో రైల్వేస్‌ను చిత్తుచేసింది. మొదట రైల్వేస్‌ జట్టు 19.5 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్‌ గోయల్‌ (37; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. ఢిల్లీ బౌలర్లలో రజ్‌నీశ్‌ దాదర్, సుయశ్‌ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఛేదనలో ఢిల్లీ 11.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఓపెనర్‌ ప్రియాన్ష్ ఆర్య (30 బంతుల్లో 56 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా... తేజస్వి దహియా (18 బంతుల్లో 42 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. లీగ్‌దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ 20 పాయింట్లతో నాకౌట్‌కు చేరింది. ఈ గ్రూప్‌ నుంచి పంజాబ్‌ కూడా ‘సూపర్‌ లీగ్‌’లో అడుగుపెట్టింది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో బిహార్‌పై విజయం సాధించి 20 పాయింట్లతో ముందంజ వేసింది. 

బరోడా ఓడినా ముందుకు.. 
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బరోడా జట్టు పరాజయం పాలైనప్పటికీ... ‘సూపర్‌ లీగ్‌’ దశకు అర్హత సాధించింది. గురువారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో కర్ణాటక చేతిలో ఓడింది. లీగ్‌ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసుకున్న బరోడా... 20 పాయింట్లతో నాకౌట్‌కు చేరింది. తాజా సీజన్‌ను పరాజయంతో ప్రారంభించిన బరోడా... ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి తిరిగి చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడింది. గురువారం పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులకు ఆటౌటైంది. 

ధ్రువ్‌ పటేల్‌ (33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శాశ్వత్‌ రావత్‌ (31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కర్ణాటక బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విద్వత్‌ కవెరప్ప, శ్రీషా అచర్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో కర్ణాటక 16.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. రోహన్‌ పాటిల్‌ (48, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రీజిత్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కరుణ్‌ నాయర్‌ (30 నాటౌట్‌; 3 సిక్స్‌లు) రాణించారు. ఇదే గ్రూప్‌లో భాగంగా గురువారం జరిగిన మరో పోరులో రాజస్తాన్‌ 6 వికెట్ల తేడాతో బెంగాల్‌ను ఓడించింది. తద్వారా 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని ముందంజ వేసింది.  

అదరగొట్టిన అజహరుద్దీన్‌ 
వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ (57 బంతుల్లో 101; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కడంతో కేరళం జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో కేరళం జట్టు 67 పరుగుల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌ను చిత్తుచేసింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 ఓటములు మూటగట్టుకున్న కేరళం 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 

7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 1 ఓటమితో 24 పాయింట్లు సాధించిన ఆంధ్ర జట్టు ‘టాప్‌’లో నిలిచి ‘సూపర్‌ లీగ్‌’కు చేరగా... కేరళం కూడా నాకౌట్‌లో అడుగుపెట్టింది. న్యూ చండీగఢ్‌ వేదికగా గురువారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కేరళం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఓపెనర్‌ అజహరుద్దీన్‌ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేయగా... తక్కినవాళ్లు కూడా తలా కొన్ని పరుగులతో సత్తాచాటారు. 

రోహన్‌ కున్నుమ్మల్‌ (35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), విష్ణు వినోద్‌ (22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సల్మాన్‌ నిజార్‌ (26 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అబ్దుల్‌ బాసిత్‌ (24 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) భారీ షాట్‌లతో విరుచుకపడటంతో కేరళం భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో హిమాచల్‌ ప్రదేశ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. వైభవ్‌ కల్టా (28 బంతుల్లో 57 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కేరళం బౌలర్లలో వైశాఖ్‌ చంద్రన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement