కోల్‌కతా: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్‌తో జరిగిన ఐదో లీగ్ మ్యాచ్‌లో చామా మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన మిలింద్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్ 19.2 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ పేస్ బౌలర్లు చామా మిలింద్ (4/25), రక్షణ్ రెడ్డి (3/24), అజయ్‌దేవ్ గౌడ్ (2/24) ఉత్తరాఖండ్‌ను దెబ్బ తీశారు.
ఉత్తరాఖండ్ బ్యాటర్లు యువరాజ్ చౌధరీ (59; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అవనీశ్ సుధా ( 43; 2 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. 147పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 15.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 149 పరుగులు సాధించి గెలిచింది. కొడిమెల హిమతేజ (40 బంతుల్లో 77; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత ఆటతీరుతో హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిలింద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రేపు జరిగే ఆరో లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ ఆడుతుంది.


