ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్ టోర్నీలో పాకిస్తాన్-A జట్టు ఇండియా-A ముంగిట 314 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దోహా వేదికగా మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్ (82 బంతుల్లో 79), ఫర్హాన్ యూసఫ్ (56), మాజ్ సదాఖత్ (59) అర్థసెంచరీలతో రాణించారు.
ఓపెనర్ షమిల్ హుస్సేన్ (33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా, ఆయుశ్ బదోని ఒక వికెట్ తీశాడు. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో మ్యాచ్‌లో భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయి.
ముఖ్యంగా భారత బౌలర్ హర్షిత్ రాణా తన దూకుడుతో పదే పదే పాక్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. పలుమార్లు పాక్ బ్యాటర్లు కూడా హద్దు మీరి ప్రవర్తించడం కనిపించింది. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ 121 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో హసన్ నవాజ్, మాజ్ సదాఖత్లు కలిసి నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించారు.
అనంతరం హసన్ నవాజ్, ఫర్హాన్ యూసఫ్‌లు 65 పరుగులు జోడించడంతో పాక్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే ఫర్హాన్, హసన్ నవాజ్, సదాఖత్లు ఔటైన తర్వాత పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఆఖర్లో మొహ్మద్ ఇమ్రాన్ (14 బంతుల్లో 23) వేగంగా ఆడడంతో పాక్ 300 పరుగుల మార్క్‌ను దాటింది.
ఇదీ చదవండి: SMAT 2026: మెరిసిన ఆర్సీబీ స్టార్.. రఫ్పాడించిన లక్నో బ్యాటర్


